Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసే మహిళలు చాలాసార్లు కుటుంబానికి సమయం కేటాయించ లేకపోతున్నామని చెబుతుంటారు. మొదట్లో కాస్త సమయం కేటాయించి సర్దుబాటు చేసుకుంటే క్రమంగా సులువవుతుంది.
పనిభారం తగ్గి, ఎక్కడి పనులు అక్కడే పూర్తిచేయాలంటే ప్రణాళిక ఉండాలి. మర్నాడు చేయాల్సిన పనుల్ని ముందురోజే ఆలోచించుకోవడం, అందుకు అవసరమైనవి సిద్ధం చేసుకోవడం వల్ల కొంత సమయం కలిసొస్తుంది.
మీ ఉద్యోగమైనా, వ్యాపారమైనా ముందు మీ పనిని మీరు ప్రేమించాలి. ఎందుకంటే అయిష్టత, నిరాసక్తత ఒత్తిడిని పెంచుతాయి. ఉత్పాదకతను తగ్గిస్తాయి. తర్వాత ఇంటికీ, కార్యాలయానికీ మధ్య పని విభజన చేసుకోవడంతో పాటు పరిధినీ నిర్ణయించుకోండి. ఆఫీసులో గడువులోగా పనులు ముగించుకోవడం, ఇంటి బాధ్యతల్ని ఆఫీసుకి తీసుకురాకపోవడం వంటి వాటివల్ల మీ టైమ్ సద్వినియోగమవుతుంది.
మీకున్న సమయంలోనే పిల్లలు, కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు ఫోన్లు, ఇతరత్రా అంశాలపైకి మనసు పోనివద్దు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. అప్పుడు మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడిపిన భావన వస్తుంది. మీ మనసు తేలికపడుతుంది. ఉత్సాహంగానూ ఉండ గలుగుతారు.
ఇతరత్రా రోజులు ఎలా గడిచిపోయినా సెలవు రోజున కచ్చితంగా ఓ గంట మీకోసమే కేటాయించుకోండి. అవసరాన్ని బట్టి దాన్ని పెంచుకోండి. తోటపని, బొమ్మలు గీయడం, సంగీతం వినడం వంటి అభిరుచుల కోసం కేటాయించుకోండి. ఇవి మీలో నూతనోత్తేజాన్ని తెస్తాయి. వీటితో పాటూ చర్మ, కేశ సంరక్షణపై దృష్టిపెట్టడం, తగినంత నిద్రపోవడం మరిచిపోవద్దు. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.