Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లటి ఒత్తయిన కురులను కాపాడుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా అందరూ తమకు తోచిన చిట్కాలను పాటిస్తారు. వీటిలో ఎక్కువ భాగం తలకు వేసే హెయిర్‌ప్యాక్‌లు, మాస్క్‌లే ఉంటాయి. అయితే కూరగాయలు సైతం జుట్టు రాలిపోవడాన్ని నియంత్రించి వాటిని దృఢంగా అయ్యేలా చేస్తాయి. అదెలాగో తెలుసుకుందాం...
చాలామందిలో ఐరన్ లోపం కారణంగానే జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఇలాంటి వారిలో కురులను దృఢంగా ఉంచడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది.. దీన్నుంచి పీచుపదార్థం, ఐరన్, జింక్, ఇతర విటమిన్లు లభిస్తాయి. ఇవన్నీ జుట్టు దృఢంగా ఉండటానికి, పొడవుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
క్యారట్ కూడా వెంట్రుకలను దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ బీ7 పుష్కలంగా లభిస్తుంది. దీన్నే బయోటిన్ అని పిలుస్తారు. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యారట్‌తో తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌ని కూడా అప్పుడప్పుడూ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందచ్చు. దీనికోసం కొన్ని క్యారట్ ముక్కలను తీసుకొని నీటిలో వేసి ఉడకబెట్టి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్త్లె చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ వెంట్రుకలు రాలడాన్ని నియంత్రించి దృఢంగా పెరిగేలా చేస్తుంది.
ఉల్లిగడ్డలో జింక్,
ఐరన్, బయోటిన్‌తో సహా కురుల ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టుని బలంగా అయ్యేలా చేయడంతో పాటు చిన్న వయసులో వెంట్రుకలు నెరవకుండా కాపాడతాయి.
మోరంగడ్డలో బీటాకెరోటిన్ అధికమొత్తంలో లభిస్తుంది. ఆహారం ద్వారా మనం తీసుకొన్న బీటా కెరోటిన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత విటమిన్ 'ఎ'గా రూపాంతరం చెందుతుంది. ఇది కురుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ దుంపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఒత్తైన కేశ సంపదను సొంతం చేసుకోవచ్చు.
టొమాటోల్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నిర్జీవమైపోయిన కురులకు తిరిగి జీవం పోయడంలో సహకరిస్తాయి. అంతేకాదు జుట్టు, కుదుళ్లలో చేరిన టాక్సిన్లు, ఇతర మలినాలను తొలగిస్తాయి. కాబట్టి టొమాటోలను ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడూ టొమాటో గుజ్జుని హెయిర్ప్యాక్లాగా వేసుకోవాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యం ఇనుమడిస్తుంది.