Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయిషా నాజియా... ఫిఫా మాస్టర్ ప్రోగ్రాం 2021కు ఎంపికైన 30 ఏకైక భారతీయ మహిళ. కొన్ని పరిస్థితుల వల్ల తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌కు దూరమయ్యింది. కానీ ఇప్పుడు అందులోనే ప్రొఫెషనల్‌గా ఎంపికయింది. ఈ విజయం ఆమెకు అంత సులువుగా వరించలేదు. ఆమె పడిన కష్టాల ఫలితమే ఇది... ఆ స్ఫూర్తిదాయ జీవత పరిచయం...
ఇరవై ఆరేళ్ల ఆయిషా నాజియా కేరళలోని కోజికోడ్‌లో పుట్టింది. చిన్నతనం నుండి ఫుట్‌బాల్ అంటే ఆమెకు పిచ్చి. అయితే కుటుంబ పరిస్థితులు ఆమెను ఫుట్‌బాల్‌కు దూరం చేశాయి. కానీ ఇప్పుడు అందులోనే ప్రొఫెషనల్‌గా మారింది. ఫిఫా మాస్టర్ కోర్సుకు ఎంపికైన 30 మందిలో ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది. మనలాంటి పితృస్వామ్య భావజాలంలో ఓ మహిళకు ఇది అంత సులభంగా కాదు.
సొంత ప్రయాణం
ఆయిషా తల్లిదండ్రులు ఆమె ఐదు సంవత్సరాల వయసులో విడాకులు తీసుకున్నారు. ఆమె తల్లి మళ్ళీ వివాహం చేసుకుంది. మారు తండ్రితో కలిసి జీవించడం ఓ అగ్ని పరీక్షగా మారింది. చెన్నైలోని నన్స్ కాన్వెంట్లో కష్టపడి చదువుకుంది. చదువులో ఎప్పుడూ టాపర్‌గా నిలిచింది. కొల్లంలోని టీకెఎం ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివేందుకు కేరళ ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల స్కాలర్షిప్ కూడా అందుకుంది. ఆ విధంగా 18 ఏండ్ల వయసులో ఆయిషా తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది. మంచి స్నేహితులను సంపాదించుకుంది. వారిలోనే తను కోరుకున్న కుటుంబాన్ని చూసుకునేది.
ఆట మొదలైంది
ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆయిషా ఇండియన్ ఆయిల్-అదానీ గ్యాస్ వద్ద మెకానికల్ ఇంజనీర్‌గా చేరి కొచ్చికి వెళ్ళింది. చిన్న వయసులో ఉన్నప్పటికి ఆమె అప్పటికే మూడు ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లను చూసింది. ఆట పట్ల ఆమె ఆసక్తి ఎప్పటిలాగే బలంగా ఉంది. ఉద్యోగం ఆమెకు ఎంతో అవసరం. అందుకే ఉద్యోగం చేస్తూనే తాను కోరుకున్న క్రీడ ఎప్పటికైనా తన జీవితంలోకి రాకపోతుందా అని అవకాశం కోసం ఎదురు చూసింది.
చిన్న ఉద్యోగిగా చేరి
''2017లో ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్ భారతదేశానికి వచ్చినప్పుడు నేను జట్టులో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నాను. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ డిగ్రీ నాకు లేదు. నా ఇంజనీరింగ్ కోర్సు పరిజ్ఞానంతో ఇంటర్వ్యూలో ఎంపికయ్యాను. వర్క్‌ఫోర్స్ మేనేజర్‌గా నియమించబడ్డాను. 23 ఏండ్ల వయసులో వారి వద్ద చిన్న ఉద్యోగిగా చేరాను'' అంటూ ఆమె గుర్తు చేసుకుంది. ఇది ''చీఫ్-ఆఫ్-స్టాఫ్'' పాత్ర లాగా ఉందని ఆమె అంటుంది. ఇక్కడ ఆమె అన్ని విభాగాలలో పనిచేసిన వ్యక్తులను నిర్వహించింది. ఈ క్రీడా పరిశ్రమ ఎలా పనిచేస్తుందో.. ఆమె ఏమి చేయగలదో.. విలువైన అవగాహన ఇచ్చింది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బిఎ) భారతదేశానికి వచ్చినప్పుడు ఆయిషా కూడా ఈ కార్యక్రమంలో భాగమయింది. జట్టులోని 200 మంది అమెరికన్లలో ఈమె ఒకరు. ప్రతి అనుభవంతో ఆమె భారతదేశంలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ రంగంలో మరింత కృషి చేసింది.
బహుళ వృత్తి
క్రీడా రంగంపై ఆమెకున్న ఆసక్తితో ఆయిషా ఇండియన్ ఆయిల్లో ఉద్యోగాన్ని వదిలేసింది. ఆదాయం కోసం బెంగళూరులోని ఆక్వాకోనెక్ట్ స్పాటాబ్ల్ వంటి ప్రముఖ స్టార్టప్‌లతో ప్రొడక్ట్ కన్సల్టింగ్ ప్రారంభించింది. ఆమెలోని క్రీడా స్ఫూర్తిని గుర్తించిన వారు ఆమె కార్యక్రమాలకు హాజరై ఎంతో ప్రోత్సహించేవారు. ఫిఫా మాస్టర్ కోర్సు గురించి ఈషా మొదటిసారి విన్నది 2015లో. ఇది ఒక సంవత్సర కార్యక్రమంగా ఇంటర్నేషనల్ మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్, లా, హ్యుమానిటీస్ ఆఫ్ స్పోర్ట్స్, డి మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయం (యుకె), ఎస్డిఎ బోకోనీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఇటలీ), న్యూచాటెల్ విశ్వవిద్యాలయం (స్విట్జర్లాండ్) వంటి కోర్సులను నిర్వహిస్తుంది.
ఇది నాకు మంచి అవకాశం
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం 700 మందికి పైగా గ్లోబల్ అప్లికేషన్ల నుండి ఎంపికైన 30 మందిలో ఆయిషా మాత్రమే భారతీయ మహిళ. దీంతో పాటు ఆమె 50 శాతం స్కాలర్షిప్ కూడా అందుకోబోతుంది. ''ఇది చాలా ఉత్తేజకరమైనది. ఎందుకంటే వారు మాకు అన్ని విధాలుగా శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా మొత్తం 80 పర్యటనలు ఉంటాయి. అలాగే కోర్సు ముగింపులో ఫిఫా ఉపాధి కోసం ముగ్గురు వ్యక్తులను ఎంపిక చేస్తుంది. ఇది నాకు ఓ మంచి అవకాశం'' అని ఆమె చెప్పింది.
రుణం దొరకలేదు
మెరిట్ స్కాలర్షిప్ తర్వాత అయిషా ఇప్పుడు కోర్సులో చేరడానికి సుమారు 28 లక్షల రూపాయల క్రౌడ్ ఫండింగ్ చేస్తోంది. నిధుల కోసం ఆమె వివిధ సంస్థల తలుపులు తట్టడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేదు. ''బ్యాంక్ రుణం తీసుకోవాలని అనుకున్నాను. కాని వాళ్ళు రుణం ఇవ్వడానికి నాకు ఆస్తి లేదు. అందుకే క్రౌడ్ ఫండింగ్ ఎంచుకున్నాను'' ఆమె జతచేస్తుంది. ఈ కోర్సు సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. క్రౌడ్ ఫండ్ చేస్తున్నట్టు లింక్డ్ఇన్లో ప్రకటించినప్పుడు ఆమె తన పోస్ట్‌లో ఒక్క వారంలో 38,000 స్పందనలను అందుకుంది.
పోరాటం తప్పదు
''స్పందించిన 38,000 మంది కేవలం 100 రూపాయలైనా ఇచ్చి ఉంటే నేను నా లక్ష్యాన్ని చేరుకుని ఉండేదాన్ని. కానీ అలా జరగలేదు'' అని ఆమె అంటుంది. అయినప్పటికీ అయిషా నమ్మకంగా ఉంది. తన కలలను నిజాలుగా మార్చుకోవాలని కోరుకునే ప్రతి మహిళ ఏదో ఒక స్థాయిలో పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఈ మరో యుద్ధంలో గెలవడానికి పట్టుదలతో కృషి చేయాలి.
మహిళలు కొనసాగలేరు
ఒకే సమయంలో నేను బహుళ పనులు చేస్తాను. నా పరిస్థితులరీత్యా చిన్నతనం నుండి నన్ను నేను అలా తీర్చిదిద్దుకున్నాను. చేసే ప్రతి పనిలో చాలా నిర్మాణాత్మకంగా ఉన్నాను. నాకు తెలిసిన వ్యక్తులు కూడా నేను ఒకేసారి మూడు పనులు చేయగలిగే సామర్థ్యం ఉందని అంటుంటారు. ఇటు మెకానికల్ ఇంజనీరింగ్ అటు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఈ రంగాలలో మహిళలు ఎక్కువగా లేరు. ఇది ఒక దగ్గర కూర్చొని చేసే పని కాదు. క్రీడల్లో ఉంటే ఎర్రటి ఎండలో ఉండాల్సి వస్తుంది. రోజుకు 500 సార్లు పిచ్ చుట్టూ నడవాలి. ఇది శారీరక శ్రమతో కూడుకున్నది. పనికీ, కుటుంబానికి మధ్య సమతుల్యత ఉండదు. అందుకే చాలామంది మహిళలు ఈ రంగంలో కొనసాగడానికి ఇష్టపడరు.
ఆశగా ఎదురు చూశా
చెన్నైలో నా పాఠశాల విద్యను పూర్తి చేశాను. మా పాఠశాల అనాథాశ్రమానికి అనుసంధానించబడి ఉండేది. ఎవరైన మంచి తల్లిదండ్రులు నన్ను దత్తత తీసుకుంటారా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూసేదాన్ని. నా పరిస్థితి చూసి కాన్వెంట్‌లోని నన్స్ నన్ను కష్టపడి పనిచేయమనేవారు. నా దయనీయ జీవితం నుండి బయటపడటానికి ఇదే మార్గమని ఎంతో కష్టపడేదాన్ని.
- సలీమ