Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే రోజూ కూరగాయలు తినడమంటే బోర్ కొడుతుంది. పైగా వర్షాలకు ఏమైనా కార కారంగా తినాలనిపిస్తుంది. కూరగాయల్లోనే కాదు కొన్ని రకాల పచ్చళ్లతోనూ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కరివేపాకు పచ్చడి, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఆ కోవకు చెందినవే. ఇంకెందు ఆలస్యం.. ఈ వారం మీరూ ట్రై చేయండి.
అల్లం చట్నీ
కావల్సిన పదార్థాలు: అల్లం - పావుకేజీ, ఆవాలు - టీస్పూన్, మెంతులు - పది గింజలు, మినప్పప్పు - టీస్పూన్, బెల్లం - కొద్దిగా, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత, ఎండుమిర్చి - ఎనిమిది, జీలకర్ర - కొద్దిగా, ఉప్పు - తగినంత, పసుపు - కొద్దిగా, ఇంగువ - కొద్దిగా.
తయారు చేసే విధానం: ముందుగా స్టవ్‌పై బాణలి పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగించాలి. అల్లం శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండును నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు పోపు, అల్లం ముక్కలు, బెల్లం, పసుపు, ఉప్పు, నానబెట్టిన చింతపండు... అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ.
పోషక విలువలు: వంద గ్రాముల అల్లంలో... క్యాలరీలు - 335, ఫ్యాట్ - 4.2 గ్రా, సాచురేటెడ్ ఫ్యాట్ - 2.6గ్రా, సోడియం - 27 ఎంజి, కార్బోహైడ్రేట్లు - 72 గ్రా, డైటరీ ఫైబర్ - 14 గ్రా, ప్రొటీన్ - 9 గ్రాములతో పాటు ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అల్లం జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తిని అందిస్తుంది.
నువ్వుల చట్నీ
కావల్సిన పదార్థాలు: నువ్వులు - 200 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, నిమ్మరసం - కొద్దిగా, పంచదార - టీస్పూన్, కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా నువ్వులను వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి పొడి చేయాలి. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేయాలి. కొద్దిగా ఉప్పు, పంచదార వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అన్నం లేదా చపాతీతో వడ్డించాలి.
పోషక విలువలు: నువ్వుల్లో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారికి నువ్వులు మంచి ఆహారం. ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. శాకాహారులు ప్రొటీన్ కోసం నువ్వులు తీసుకోవచ్చు. క్రమంతప్పకుండా నువ్వులు తింటే హైపర్‌టెన్షన్, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి. అలాగే నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటిలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. గుండెకు మేలు చేసే ఒలెయిక్ యాసిడ్ నువ్వుల్లో లభిస్తుంది. ఇంకా ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, కాల్షియం వీటిలో లభిస్తాయి. చర్మ సంరక్షణ కోసం నువ్వుల నూనె పనికొస్తుంది.
కరివేపాకు చట్నీ
కావల్సిన పదార్థాలు: కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుపు - అర టీస్పూన్, ధనియాలు అర టీస్పూన్, నువ్వులు - టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - రెండు చిటికెడులు, నూనె - రెండు టీస్పూన్లు, శనగపప్పు - అర స్పూన్, మినప్పప్పు - అర స్పూన్, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్.
తయారు చేసే విధానం: ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి. నువ్వుపప్పు దోరగా వేగించాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఆ పోపును ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి. చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడి తయారీ చేసుకోవాలి.
పోషక విలువలు: క్యాలరీలు - 108, కార్బోహైడ్రేట్లు - 18, ఫైబర్ - 6.4 గ్రా, ప్రొటీన్ - 6 గ్రా, ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, సి-విటమిన్, కాపర్, మెగ్నీషియంలు మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. కంటిచూపును కాపాడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
కొత్తిమీర చట్నీ
కావల్సిన పదార్థాలు: కొత్తిమీర కట్ట - ఒకటి(పెద్దది), పచ్చిమిర్చి - ఎనిమిది, ఎండుమిర్చి - ఒకటి, నూనె - మూడు టీస్పూన్లు, ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - అర స్పూన్, శెనగపప్పు - కొద్దిగా, మినప్పప్పు - కొద్దిగా, మెంతులు - ఆరు, ఇంగువ - కొద్దిగా, చింతపండు - నిమ్మకాయంత, బెల్లం - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - కొంచెం.
తయారు చేసే విధానం: కొత్తిమీరను సన్నగా తరిగి బాగా కడిగి ఆర బెట్టుకోవాలి. స్టవ్‌పై బాణలిపెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఇంగువ వేసి వేగించాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. చివరగా పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కాసేపు వేగించి దింపాలి. చింతపండు పోయాలి. చల్లారాక బెల్లం, పసుపు, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే సమయంలో నీళ్లు పోయకూడదు. పోపు నూనెతోనే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
పోషక విలువలు: వంద గ్రాముల కొత్తిమీరలో.. క్యాలరీలు - 23, కార్బోహైడ్రేట్లు - 3.7 గ్రా, డైటరీ ఫైబర్ - 2.8 గ్రా, ప్రొటీన్ - 2.1 గ్రా|| ఉంటాయి. ఇంకా క్యాల్షియం, ఐరన్, పొటాషియం మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కొత్తిమీరలో పుష్కలం. షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తినిస్తుంది. గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.