Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందికి గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే పదే గుర్తొస్తుంటాయి. వాటినే తలుచుకుంటు కుంగిపోతుంటారు. కాస్త ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి సమస్యలు సహజమేనంటూ వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది. అలాంటి అలక్ష్యమే తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీన్నే మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న స్థితిగా పేర్కొంటున్నారు. సరైన సమయంలో దీన్ని గుర్తించి చికిత్స తీసుకోకపోతే మానసికంగా మరింత దిగజారే ప్రమాదం ఉందంటున్నారు. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే.. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవడమే కాదు.. ఏ పని పైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే ఇలాంటి మానసిక సమస్యను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు.
లక్షణాలు ఇవే: మానసికంగా మనం ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడిని కొన్ని లక్షణాలతో గుర్తించచ్చని చెబుతున్నారు నిపుణులు.
- బీపీ పెరిగి విపరీతమైన కోపం రావడం
- మనపై మనం నమ్మకం కోల్పోవడం.. ఒక దశలో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు రావడం
- ప్రతికూల ఆలోచనలతో రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం.. తద్వారా ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది.
- విపరీతమైన అలసట, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం
- ఏదైనా విషయం జరగకపోయినా జరుగుతుందేమోనని భ్రమపడడం
- ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడడం
- గతంలో జరిగిన భయంకరమైన సంఘటనలు పదే పదే గుర్తుకు రావడం
- నలుగురిలోకి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడం.. ఎక్కువ సమయం ఒంటరిగానే గడపాలనిపించడం
- ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం
కారణాలు ఇవే: మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తులతో పాటు ఈ అంశాలు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
- నిరంతరాయంగా పనిలో కలిగే ఒత్తిడి ఇలాంటి మానసిక స్థితికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే కొంతమంది ఉద్యోగమైనా, ఇతర పనైనా తప్పక చేస్తుంటారు. అలాంటివారు అయిష్టంగానే ఆ పనిని పూర్తిచేస్తుంటారు. ఈ క్రమంలో రోజూ ఎదుర్కొనే ఒత్తిడి వల్ల కూడా ఈ స్థితి రావచ్చంటున్నారు నిపుణులు.
- బాగా ఇష్టమైన కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం/దూరమవడం, అలాగే ఆర్థిక స్థితి బాగోలేక పదే పదే డబ్బు గురించే మథన పడడం కూడా ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
- దీర్ఘకాలం పాటు నిద్ర సరిగ్గా లేకపోవడం, విశ్రాంతి తీసుకోవడానికీ సమయం దొరక్కపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు.. వంటివి కూడా మానసికంగా మనల్ని దెబ్బతీసేందుకు ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు.
ఇలా జయించచ్చు: ఇలా మీరు ఎదుర్కొంటోన్న ఈ తీవ్రమైన మానసిక స్థితిని గుర్తించిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...
- అన్నింటికంటే ముందుగా మీ ఫిజీషియన్ సలహా మేరకు కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవాలి. తద్వారా మీ మానసిక స్థితి మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకోవచ్చు.
- ఇక ఈ మానసిక స్థితి నుంచి బయటపడేందుకు టాక్ థెరపీ/కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ.. వంటివి ఉపయోగపడతాయి.
- ఈ మానసిక స్థితి లక్షణాలను ఎదుర్కోవడానికి డాక్టర్ సలహా మేరకు యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ మందులు వాడచ్చు.
- అలాగే నిపుణుల సలహా ప్రకారం ఆక్యుపంక్చర్, యోగా, ధ్యానం, మసాజ్ చేయించుకోవడం.. చక్కటి ఫలితాన్నిస్తాయి.
- తీసుకునే ఆహారంలో కెఫీన్ లేకుండా చూసుకోవాలి.
- పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం, మనసుకు నచ్చిన పనులు చేయడంతో పాటు స్వీయ ప్రేమ కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ క్రమంలో సమస్యతో బాధపడుతోన్న వారికి కుటుంబ సభ్యుల నుంచి తగిన మద్దతు లభించడం కూడా ముఖ్యమే!