Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతటా ప్రజలను అతలాకుతలం చేసే వైరస్సుల వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చెయ్యాలి. కరోనా, సార్స్, మెల్స్ వంటి వైరస్లు ప్రపంచ ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. ఈ మూడు వైరస్సులు ఒకే కుటుంబానికి చెందినటువంటివి. ఈ మూడూ కూడా శ్వాస వ్యవస్థపై దాడి చేసేవే. శ్వాసకోశంపై తన ప్రతాపాన్ని చూపించి తీవ్రమైన దగ్గు, తుమ్ములు, ఆయాసం కలగజేస్తాయి. సార్స్ వైరస్ కూడా తుమ్ములు దగ్గుల వలననే మరొకరికి వ్యాపిస్తాయి. శ్వాసకోశంపై సమరభేరి మోగించి ఆయాసాన్ని కలిగించే మెర్స్ వైరస్ తనకు దగ్గరగా అత్యంత సన్నిహితంగా మెలిగే వారికే సోకుతుంది. దీనికీ వాక్సిన్లు తయారు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మన దేశంలో ఆటగాళ్ళకిచ్చిన ప్రాధాన్యం, సైన్స్ ప్రయోగాలకివ్వరు. పరిశోధనాశాలలకు ఎక్కువ నిధులు కేటాయించరు. సైన్స్‌ను ముందుకు తీసుకెళితే గదా ఇటువంటి పరిస్థితుల నుంచి కాపాడేది. హూస్కూలు స్థాయి నుంచే పరిశోధనలకు పెద్దపీట వేస్తే ఎందరో యువసైంటిస్టులు తయారవుతారు. మనమైతే కరోనాను నిరోధించడానికి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి విజ్ఞాన విషయాలు తెలుసుకుంటూ బొమ్మలు నేర్చుకుందాం.
చింతగింజల గుర్రం
ఇది చింతపండు సీజన్. అందరూ చింతకాయలు తెచ్చుకొని చింతపండుగా కొట్టుకుంటున్నారు. మా ఇంట్లో కూడా చింతపండు సంవత్సరానికి సరిపోయేలా తెచ్చుకున్నాం. అందులో బోలెడు చింతగింజలు వచ్చాయి. నేను ఇంతకు ముందు కేవలం ఆసుపత్రి వ్యర్థాలతోనే బొమ్మలు చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఇంట్లోని పప్పు దినుసులతోనూ, వ్యర్థాలతోనూ చేస్తున్నాను. అందువల్ల ఈ చింత గింజలతో కొన్ని జంతువుల్ని చెయ్యాలనుకున్నాను. మొదటగా గుర్రాన్ని చేశాను. మనమంతా చిన్నప్పుడు నాన్న మీదనో, తాత మీదనో ఎక్కి గుర్రం ఆట ఆడి ఉంటాము. అలాగే చెక్క గుర్రము ఎక్కి ముందుకు, వెనక్కి ఊగటం కూడా గుర్తుంది కదూ. ''చల్ చల్ గుర్రం! చలాకి గుర్రం'' అంటూ పాటలు కూడా పాడుకున్నాం. పరుగులో రారాజు అనిపించుకున్న గుర్రాన్ని తయారు చేయడమంటే సరదాగా ఉంటుంది. ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ ఏ యుద్ధానికి వెళ్ళినా తన దగ్గరున్న నల్ల గుర్రంపైనే వెళ్ళేవాడట. ఆ నల్లగుర్రం పేరు ''బూసెఫాలస్''. ఈ గుర్రం అంటే అలెగ్జాండర్‌కు ప్రాణం. అందుకే ఈ గుర్రం చనిపోయాక దీని పేరుతో ఒక నగరాన్ని నిర్మించాడట. పూర్వం రాజులు ఎక్కడికి వెళ్ళాలన్నా, వేటాడాలన్నా, యుద్ధానికైనా అన్నీ గుర్రాల వలనే సాధ్యమయింది. ఇలాంటి గుర్రాన్ని ఈరోజు నేను చింత గింజలతో తయారు చేశాను. చాలా అందంగా వచ్చింది.
చింతగింజల చీమ
''నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా'' అంటూ అడిగే చీమను ఈరోజు చింతగింజలతో రూపొందించాను. చీమలు శ్రమశక్తికి ప్రతీకలు. చీమలు తమ బరువు కన్నా అధిక బరువును మోసుకెళ్ళగలవు. ఎండాకాలం అంతా ఆహారాన్ని సేకరించి తమ పుట్టలకు చేరుస్తుంటాయి. మట్టిని తొలిచి గదులు గదులుగా చక్కగా భూమిలోపల పుట్టలుగా కట్టుకుంటాయి. వానాకాలంలో ఆహార సేకరణ కుదరదు కాబట్టి ఎండాకాలంలోనే తెచ్చుకుంటాయి. ఆ పుట్టల్లో ఆహారం కొరకు, రాణి చీమల నివాసం కొరకు, గుడ్లు పెట్టటం కొరకు రకరకాల గదులు ఉంటాయి. చీమల్లో మగ చీమలు, ఆడ చీమలు, శ్రామిక చీమలు అని మూడు రకాలుంటాయి. శ్రామిక చీమలు రాణీ చీమలకు పని చేసి పెడతాయి. చీమల్లో ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ఉంటాయి. మనం ఈ రోజు గండు చీమను తయారు చేసుకున్నాం. చింత గింజలు నల్లగా ఉన్నాయి. కాబట్టి ఇవి నల్ల చీమ అయింది. చీమలు ఐకమత్యానికి ఉదాహరణ. ఒకే పుట్టలో కలసిమెలసి ఉండటమే కాకుండా ఎంతో క్రమశిక్షణతో పని చేస్తాయి. 10 కోట్ల ఏండ్ల కిందట కందిరీగల నుంచి విడిపోయి ఇవి ప్రత్యేక జీవులుగా రూపొందాయి. చింత గింజలతో పాటు సపోటా గింజలు కూడా వాడాను. అతుకుల కాళ్ళు గల కీటకాల విభాగానికి చెందినవి చీమలు. చింతగింజల చీమ మిమ్మల్నేమీ కుట్టదు. తయారు చెయ్యవచ్చు.
చింతగింజల తాబేలు
మా చిన్నతనంలో స్కూలు మాస్టార్లు చింత బరికెతోనే పిల్లల్ని కొట్టేవాళ్ళు. అందరూ ఒక్కదెబ్బైనా తిన్నవాళ్ళే. చింత చెట్టు తల విరబోసుకున్న బ్రహ్మరాక్షసిలా ఉంటుందని చెబుతారు. చింత చెట్టు పెద్ద వృక్షం. ఇది ఫ్యాబేసి కుటుంబంలోని సిసాల్సినాయిడే ఉప కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయనామం ''టమరిండస్ ఇండికస్''. ఈ చింత చెట్టుకు కొడవళ్ళలాగా వేలాడుతూ వంకర తిరిగిన చింతకాయలు వేలాడుతూ ఉంటాయి. ఈ కాయల నుంచి వచ్చే చింతపండును ప్రతిరోజూ మనమంతా వంటింట్లోని ఆహారపదార్థాలలో వాడుతున్నాం. చింతకాయల్లోని విత్తనాలతోనే నేనీరోజు తాబేలును చేశాను. చెట్టు మీద ఉండే చింతగింజలతో నీటిలో ఉండే తాబేలును చేయడం గమ్మత్తుగా ఉంది. ఏదైనా ఆపద వస్తుందనగానే తన తల మొత్తాన్ని డిప్పలో దాచుకునే తాబేలు అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవిగా చెబుతారు. తల బయట పెట్టిన తాబేలు నట్టింట్లో తిరుగుతోంది.
చింతగింజల నత్త
నత్త కూడా నీటిలో నివసించే జీవే. ఇది మలస్క వర్గానికి చెందిన జీవి. ఇది సముద్ర జలాల్లోనూ, మంచినీటి సరస్సులోనూ జీవిస్తాయి. వీటిలో కొన్ని భూమి మీద కూడా జీవిస్తాయి. వీటికి బలమైన కండరాలు కలిగిన పాదం ఉంటుంది. నత్తలు ఇసుకలో గుడ్లను పెట్టుకుంటాయి. నెత్తిమీద కొమ్ము కలిగిన జీవిగా నత్తను చెబుతారు. ఇవి చాలా నిదానంగా నడుస్తాయి. దానికున్న కండర పాదం మీద గ్లైడింగ్ ద్వారా చలనం కలుగుతుంది. అందుకే ఏ పనైనా నిదానంగా జరుగుతుంటే ''నత్తనడకన'' సాగుతున్నాయని అంటుంటారు. చింత గింజలతో పాటు నేను రబ్బరు బ్యాండ్లను కూడా వాడాను. నేను వీటిని తయారు చేసి మా హాస్పిటల్‌కు వచ్చే చిన్నారి పిల్లలకు చూపించాను.
చింతగింజలతో జెల్లీఫిష్
జెల్లీఫిష్ కూడా నీటిలో నివసించే జీవే. అనుకోకుండా మూడు నీటి జీవులు వచ్చాయి. చెట్టు మీద కాయకు, నీళ్ళలోని ఉప్పుకు సంబంధం కలిసినట్టుగా ఈరోజు చింతగింజలతో నీటి జీవులు తయారయ్యాయి. చింతకాయలతో పెట్టుకునే చింతకాయ పచ్చడి ఎంత పాతదో ఏమో ఎవరైనా పాత కాలపు భావాలతో ఉంటే వాళ్ళవన్నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనల్లే అంటారు. ఇలాంటి బొమ్మలు మనమే చేసి పిల్లలకు వీటి ప్రత్యేకతల్ని వివరించవచ్చు. లేదా పిల్లలతోనే చేయించి ఆయా జంతువుల ఆకారాన్ని పరిచయం చేయవచ్చు. వీటిని ఫ్లోరల్స్ డిజైన్లుగా తయారు చేసి పిల్లలకు పాఠాలు చెప్పాక మరల తీసేయవచ్చు. అంటే బోర్డు మీద బొమ్మలు వేసి వాటి జీవిత చరిత్రను బోధించినట్టుగా ప్రస్తుత కరోనా సమయంలో ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఈ బొమ్మల తయారీ వలన పిల్లలకు సైన్స్ సులభంగా అర్థమవుతుంది. నేనైతే పిల్లల కోసమే ఈ బొమ్మలన్నీ తయారు చేస్తున్నాను. జెల్లీఫిష్ల్లో కొన్ని కాటేస్తుంటాయి. ఇవి ఎక్కువగా సముద్రాల్లో నివసిస్తాయి. నేను ఏ దేశంలో చూశానో గుర్తులేదు గానీ జెల్లీఫిష్‌ల జూ లాంటిది చూశాను. కొన్ని వందల ఫొటోలు తీశాను. తయారు చేయండి సరదాగా.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్