Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యల్లో చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. కాళ్లు మాత్రం ఎక్కువగా నీళ్లలో నానుతూ ఉంటాయి.. కాబట్టి వర్షా కాలంలో పాదాల సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల పాదాలు పగలడం, దుర్వాసన రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అథ్లెట్ ఫుట్, అలర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి ఇంట్లోనే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం...
చాలామందికి వర్షాకాలంలో వచ్చే సమస్యల్లో పాదాలు వాసన రావడం ముఖ్యమైనది. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని నివారించేందుకు కర్పూరాన్ని మెత్తని పొడిగా చేసి దాన్ని టాల్కం పౌడర్‌లో వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని పాదాలకు పట్టించి సాక్స్ వేసుకోవాలి. ఇది తడిని పీల్చుకుంటుంది కాబట్టి వాసన రాకుండా ఉంటుంది.
ఒక పెద్ద బకెట్లో కాళ్లు పట్టేలా చూసుకొని దానిలో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో ఉప్పు, కొద్దిగా మైల్డ్ షాంపూ కూడా వేసుకొని పదిహేను నిమిషాల పాటు అందులో కాళ్లను నానబెట్టుకోవాలి. ఉప్పు పాదాలపై ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తుంది. వాసనను తొలగిస్తుంది. ఆ తర్వాత కాళ్లు బాగా నానిన తర్వాత వాటిపై ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించాలి. ఇందుకోసం ప్యూమిస్ స్టోన్ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత కాళ్లను బాగా తుడిచి మంచి ఫుట్ క్రీమ్ రాసుకోవాలి.
ఒక పెద్ద టబ్ తీసుకొని అందులో వేడి నీళ్లు పోసి అందులో నిమ్మరసం వేసి పావుగంట పాటు పాదాలను ఉంచాలి. దీనివల్ల పాదాలకు చెమట రాకుండా, వాసన రాకుండా ఉంటాయి. అంతే కాదు.. వర్షాకాలంలో షూస్, పాదాలు పూర్తిగా మూసి ఉండే చెప్పులు కాకుండా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకోవడం మంచిది.
నీళ్లలో ఎక్కువగా నానుతూ ఉండడం వల్ల పాదాలకు, వేళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. దానికోసం టీ ట్రీ ఆయిల్లో దూదిని ముంచి దాంతో పాదాలను తరచూ రుద్దుకుంటూ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
వర్షా కాలంలో నీటిలో ఎక్కువగా నానుతూ ఉండడం వల్ల పాదాలు దురద కూడా ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని తగ్గించేందుకు ఉల్లిగడ్డ రసాన్ని తీసుకొని దాంతో పాదాలు మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే దురద మాయమవుతుంది.