Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుమారి పాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని దిగులుగా కూర్చుంది. ఇంకా ఇలా ఎన్ని రోజులు పుట్టింట్లో కూర్చోవాలో అర్థం కావడంలేదు. తన తోటి వారందరూ హాయిగా సంసారం చేసుకుంటున్నారు. తన బతుకు మాత్రం ఇలా అయిపోయినందుకు ఆకలీ, నిద్ర మాని ఏడుస్తూనే ఉంది. ఒకపక్క చుట్టుపక్కల వారు మీ ఆయన ఎప్పుడు వస్తాడు అని అడిగినప్పుడల్లా ఏంమాట్లాడకుండా దీనంగా ఓ నవ్వు నవ్వి ఊరుకుంటుంది.
ఇలా రోజులు గడుపుతున్న కుమారికి ఐద్వా లీగల్‌సెల్ నుంచి ఉత్తరం వచ్చింది. ''నాకెవరు ఉత్తరం రాసారబ్బా..!'' అనుకుంటూ ఆ ఉత్తరాన్ని అందుకుని చూసింది. లెటర్ కుటుంబ న్యాయ సలహా కేంద్రం నుంచి వచ్చినట్టుంది. వెంటనే కవర్ చింపి లెటర్ చదివింది. అందులో భర్త(రత్నబాబు) తనపై కంప్లెయింట్ ఇచ్చినట్టుంది. వచ్చే శనివారం తనని కూడా రమ్మనమని అందులో ఉంది. కుమారికి భయం వేసింది. లెటర్లో ఉన్న నెంబర్‌కు వెంటనే ఫోన్ చేసింది.
అటు నుండి హల్లో... అంటూ ఓ మహిళ గొంతు వినిపించింది. కుమారి మాట్లాడుతూ ''మేడమ్ నాపేరు కుమారి. నాకు లెటర్ వచ్చింది. ఇందులో నెంబర్ ఉంటే ఫోన్ చేస్తున్నా. నన్ను శనివారం రమ్మన్నారు. మీ దగ్గరకు మా ఆయన వచ్చాడా? నా గురించి ఏం చెప్పాడు? ఆయన నన్ను తాగి విపరీతంగా కొడతాడు. పుట్టింటికి వచ్చేస్తే ఆయన మారతాడని ఇలా చేశా. మాకు ఓ పాప కూడా ఉంది. నాకు ఆయనతో కలసి బతకాలనే ఉంది. కానీ ఆయన మారాలి. అప్పుడే నేను ఆయనతో కలిసి ఉండగలను. నేను శనివారం వస్తే మీరు ఏం చేస్తారు?'' అంటూ ఏడ్చేసింది.
కుమారి మాటలన్నీ నిదానంగా విని, ''చూడమ్మా... మేము మిమ్మల్ని కలపటానికే రమ్మన్నాం. నువ్వు శనివారం రోజు ఇక్కడికి రా. కూర్చొని మాట్లాడుకుందా'' అంటూ ఫోన్ పెట్టేయబోయింది అటువైపు గొంతు. వెంటనే కుమారి మాట్లాడుతూ... ''మేడమ్, మా ఆయన నా గురించి మీకు ఏం చెప్పాడో, ఆయన మాటలు నమ్మకండి, అన్నీ అబద్దాలే చెబుతాడు...'' అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయింది. వెంటనే అటు నుంచి ''మేము ఆయన మాటలు వినేవాళ్ళమే అయితే నిన్ను రమ్మనమని లెటర్ పంపేవాళ్ళమే కాదు. నువ్వు చెప్పింది కూడా విన్న తర్వాతనే ఓ నిర్ణయానికి వస్తాం. కాబట్టి నువ్వేం భయపడకూ'' అంటూ ఆ గొంతు ధైర్యం చెప్పింది.
ఆ మాటలకు కాస్త స్థిమిత పడ్డ కుమారి శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది. ఆ రోజు రానే వచ్చింది. అందరికంటే ముందే లీగల్‌సెల్‌కు వచ్చేసింది. సభ్యులు వచ్చీ రాగానే తమ కోసమే ఎదురుచూస్తున్న కుమారిని ముందు లోపలికి పిలిచారు.
ఆమె మాట్లాడుతూ ''మేడమ్ ఆయన తాగుతాడు. ఇంట్లో ఒక్కపైసా ఇవ్వడు. విపరీతంగా కొడతాడు. తిడతాడు. మా బావగారికి ఆయన డబ్బులు ఇచ్చాడు. ఆ విషయాలేమీ నాకు తెలియదు.
ఆయన డబ్బులు ఇవ్వకపోతే మా అక్కకు చెప్పి ఇప్పించమని నన్ను కొడతాడు. మా బావ ఈయనకు సొంత అన్నే, ఆయనే అడగొచ్చు. కాని నన్నే అడగమంటాడు. అక్కడ మా అక్కకు బావకు ఎప్పుడైనా గొడవలైతే దానికి నన్నే కారణం చేసి కొడతాడు. వాళ్ళ అన్న ఈయన్ని ఏమన్నా అంటే దానికే నన్ను కొడతాడు. ఇలా కారణం లేకుండా ప్రతి విషయానికి కొడుతూనే ఉంటాడు. కొట్టడమే కాదు. లేను ఇంట్లో లేనప్పుడు వేరే అమ్మాయిలను తెచ్చుకుంటాడు. ఈ విషయాలన్నీ మామయ్యకు ఫోన్ చేసి చెప్తా. మామయ్య కూడా ఆయన్నే తిడుతుంటారు. అందుకే నా దగ్గర ఫోన్ కూడా లేకుండా చేశాడు. నన్ను ఎవరితో మాట్లాడనివ్వడు. నాకు పాప పుట్టిన తర్వాత మూడు సార్లు అబార్షన్ అయింది. ప్రతిసారి ఐదో నెల్లో కామెర్లు అయ్యేవి. దాంతో నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. డాక్టర్ ఇక పిల్లలు వద్దని చెప్పారు. అయినా కూడా అబ్బాయి కావాలని ఇబ్బంది పెడతాడు. ఓసారి పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టా. ఇప్పటికీ ఆకేసు నడుస్తూనే ఉంది. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఇంకా ఎన్ని రోజులని ఈ కష్టాలను భరించాలి. ఇక నా వల్ల కాలేదు. అందుకే పుట్టింటికి వెళ్ళాను. అతనిలో మార్పు వచ్చేవరకు నేను పుట్టింట్లోనే ఉంటాను' అని చెప్పింది.
కుమారి చెప్పిన విషయాలు విన్న తర్వాత సభ్యులు రత్నబాబును కూర్చోబెట్టి ''నువ్వు తాగి ప్రతి విషయానికి నీ భార్యను కొడుతున్నావు. ఇది మంచి పద్దతి కాదు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే తను మాత్రం ఏం చేస్తుంది. నీ బాధ భరించలేకే పుట్టింటికి వెళ్ళింది. నువ్వు మారతానంటేనే తను నీతో వస్తానంటుంది'' అని చెప్పారు.
దానికి అతను ''నేను అప్పుడప్పుడు తాగుతాను. కాని తనని కొట్టను. రమ్మని చెప్పండి'' అన్నాడు. ''అయితే మీరిద్దరే మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రండి'' అని సభ్యులు ఇద్దరినీ బయటకు పంపారు. పదిహేను నిమిషాల తర్వాత కుమారి సభ్యుల దగ్గరకు వచ్చి ''ఆయన తాగుడు మానడంటా. అప్పుడప్పుడు తాగుతాడంటా. ఆయన తాగితే మనిషి కాదు. అతనితో ఉండలేను'' అని కచ్చితంగా చెప్పేసింది.
తర్వాత రత్నబాబును పిలిచి తర్వాతి వారం అన్నను, నాన్నను పిలుచుకు రమ్మని చెప్పారు. చెప్పిన ప్రకారమే తండ్రిని, అన్నను వెంటబెట్టుకొని వచ్చాడు. తండ్రి మాట్లాడుతూ 'ఆడపిల్లకు అన్యాయం చేయడం మాకు ఇష్టం లేదు. నా కొడుకు బాగా తాగుతాడు. కొడతాడు. నా కోడలు చెప్పినవి నిజాలే. అతను తాగుడు మానకపోతే అతనితో బతకడం కష్టమే' అని చెప్పాడు. ఇదంతా వింటున్న రత్నబాబు ''మగవాళ్ళన్న తర్వాత తాగకుండా ఎలా ఉంటారు'' అని ప్రశ్నించాడు.
వెంటనే సభ్యులు ''ఇలాంటి ఆలోచనల వల్లే నీ సంసారంలో ఇన్ని గొడవలు. తాగుడు వల్ల నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. మగాడంటే తాగాలి, భార్యను కొట్టాలి అలా చేసిన వాడే మగాడు అని అనుకుంటున్నావు. కానీ, ఇవన్నీ చేతగాని వారు చేసేపనులు. నీకు ఓ కూతురు ఉంది. తను పెరిగి పెద్దదై తన భర్త కూడా ఇలాగే ఆలోచిస్తే ఏం చేస్తావు. కాబట్టి ముందు ఓ మనిషిగా ఆలోచించు. నీ భార్యను గౌరవించి, ఓ మనిషిగా చూడు. ఆమెకూ ఓ మనసు ఉంటుంది. భర్త, పాపతో సంతోషంగా ఉండాలని ఆమెకూ ఉంటుంది. నువ్వు మంచిగా చూసుకుంటే తను ఊరికే పుట్టింటికి ఎందుకు వెళుతుంది.
ఇప్పటికి నీ భార్యకు మూడు సార్లు అబార్షన్ జరిగింది. అయినా కూడా నువ్వు అబ్బాయి కావాలంటున్నావు. ఇది నీ భార్యకు, పుట్టబోయే బిడ్డకు కూడా మంచిది కాదు. ఇక నుంచి తనను పిల్లల కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఈ విషయాలన్నీ ఆలోచించుకొని వచ్చేవారం ఇద్దరూ రండి. అప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకుందాం'' అన్నారు.
మళ్ళీ వారం ఇద్దరూ వచ్చారు. ముందుగా రత్నబాబు మాట్లాడుతూ ''నేను తాగుడు మానేస్తాను. కుమారిని రమ్మని చెప్పండి. అలాగే నాపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోమనండి'' అన్నాడు. దానికి సభ్యులు ''ముందు నీలో మార్పు వచ్చిన తర్వాతే కేసు వినక్కు తీసుకునేది. ఈ విషయాలన్నీ నువ్వు రిజిస్టర్లో రాసి సంతకం చేయాలి. అలా చేస్తేనే కుమారి నీతో వస్తుంది. మేము ఆమెతో కూడా మాట్లాడతాం'' అని చెప్పారు.
కుమారితో ''ఏదైన సమస్య వస్తే పరిష్కరించుకోవాలి. అంతేకానీ పుట్టింటికి వెళ్ళి కూర్చుంటే పరిష్కారం దొరకదు. ఇకపై మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా ఇక్కడికే రండి. కూర్చొని మాట్లాడుకుందాం'' అని ఇద్దరికీ సర్దిచెప్పారు.
సభ్యులు చెప్పిన వాటన్నింటిని అంగీకరిస్తూ ఇద్దరూ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళారు. తర్వాత రెండు వారాలపాటు ఇద్దరూ కలిసి లీగల్‌సెల్‌కు వచ్చారు. మూడోవారం కుమారి ఫోన్ చేసి సభ్యులతో మాట్లాడింది. ఇప్పటి వరకు భర్త వల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదని, ఒక వేళ ఏమైనా ఇబ్బంది వస్తే లీగల్‌సెల్‌కు వస్తానని సంతోషంగా చెప్పి ఫోన్ పెట్టేసింది.
- సలీమ