Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మోసుకొస్తుంది. అయితే వాటితో పాటు చర్మ సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ప్యాచీ, స్కేలీ స్కిన్, చర్మ రంధ్రాలు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. జిడ్డు చర్మం వారికి కూడా మొటిమలు రావడం, వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వీటన్నింటి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు.
నీళ్లు తాగండి: మీ చర్మ తత్వం ఎలాంటిదైనా దాన్ని తేమగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అందుకే వర్షా కాలంలో నీళ్లు తాగాలనిపించకపోయినా తాగుతూ ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ మీ చర్మం పొడిబారిపోయి స్కేలీగా మారేందుకు దారి తీస్తుంది. అందుకే రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి.
మాయిశ్చరైజేషన్ తప్పనిసరి: వర్షాకాలంలో నీళ్లు పడుతూ ఉండడం వల్ల చర్మం తేమగా ఉంటుందని భావించి చాలామంది మాయిశ్చరైజర్ పెట్టుకోరు. కానీ ఇది చాలా తప్పు. ముఖంపై చర్మం చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దాన్ని రోజూ మాయిశ్చరైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే వర్షాకాలంలో జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఉపయోగిస్తుండాలి. మీ చర్మం బాగా పొడిబారిపోయేలా ఉంటే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ కూడా ఉపయోగించవచ్చు.
వేడి నీళ్లు వద్దు: చాలామంది వర్షాకాలం చలి పెడుతుందని బాగా వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. కానీ దీన్ని పూర్తిగా మానేయడం మంచిది. అయితే చల్లనీళ్లు లేదా గోరు వెచ్చని నీటితో మాత్రం స్నానం చేయాలి. ఎందుకంటే వేడి నీరు మీ చర్మం నుంచి మరింత తేమను లాగేస్తాయి. అంతేకాదు.. మీ చర్మం చివరలో ఉన్న రక్తనాళాలను కూడా దెబ్బతినేలా చేస్తాయి. అందుకే వేడి నీళ్లతో స్నానం చేయకపోవడం మంచిది.
మేకప్ రిమూవర్ అవసరం: వర్షాకాలంలో వీలైనంతగా మేకప్ తక్కువగా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో వర్షపు నీరు, చెమట వంటివి ఎక్కువగా ఉంటాయి. మేకప్ వేసుకోవడం వల్ల అది మీ చర్మ రంధ్రాల్లో ఉండిపోతుంది. అందుకే మరీ అవసరమైతే తప్ప మేకప్ వేసుకోకపోవడం మంచిది. అంతే కాదు వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటారు కాబట్టి మంచి క్లెన్సర్ సాయంతో మేకప్‌ని రోజూ తొలగించడం అత్యవసరం. ఇలాంటప్పుడు కూడా మీరు ఎంచుకునే పదార్థాలు మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడేవిగా ఉండేలా చూసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారం: మనం పై నుంచి ఎంతగా మాస్క్ చేసినా చర్మంలో మెరుపు అనేది లోపలి నుంచి మాత్రమే వస్తుంది. అందుకే మీరు తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఎంతో అవసరం.