Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఒక పని విజయ వంతంగా చేయాలంటే కృషి, దీక్ష, పట్టుదల అవసరం. అయితే వీటితో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఉద్యోగం.. వ్యాపారంలో సక్సెస్ సాధించాలన్నా సంపూర్ణ ఆరోగ్యం తప్పనిసరి. అయితే మన దినచర్య ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం. మరిలాంటి హెల్దీ లైఫ్‌స్త్టెల్ కోసం ఏం చేయాలి...
రోజూ ఉదయాన్నే లేచి కాసేపు వ్యాయామాలు చేయండి. ఎక్సర్సైజంటే తెగ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు.. రోజూ ఓ అరగంట నడవడమో, యోగా లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయడమో చేస్తే సరిపోతుంది. దీనికోసం మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకొని ఓ అరగంట సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది.
ఇల్లూ, ఆఫీసు రెండింటి బాధ్యతలూ మీ మీదున్నాయి. ఆ పనులన్నీ చేసేసరికే సమయం చాలదు. అలసిపోతారు. అయితే భోజనం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. 'ఏదో ఒకటి ఉంది కదా తినేద్దాం' అనే పద్ధతి మానేయండి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహార పదార్థాలకు ప్రాముఖ్యమివ్వండి. ఫాస్ట్‌ఫుడ్ తగ్గించి సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి. తినే ఆహారమూ మితంగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెగ్యులర్‌గా బరువు, బీపీ, షుగర్ చెక్ చేసుకోండి
భోజనంతో పాటు మీ జీవనశైలిలో కూడా చిన్నపాటి మార్పులు తీసుకురండి. టీవీ చూసే బదులు ఆ సమయాన్ని మీ కుటుంబంతో కలిసి గార్డెనింగ్‌లో గడపండి. దీని వల్ల ఒత్తిడితో పాటు బరువూ తగ్గుతుంది. అలాగే ఆఫీసులో పై ఫ్లోర్‌కి వెళ్లడానికి మెట్లెక్కేసేయండి. మంచినీళ్ల బాటిల్ టేబుల్ పైన పెట్టుకోవడం కాకుండా వాటర్‌ఫిల్టర్ దగ్గరికే వెళ్లి తాగి రండి. కనీసం అలాగైనా మధ్యమధ్యలో సీట్లోంచి లేచే అవకాశం ఉంటుంది.
ఆఫీసులో పనుల ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఒంట్లో నీటి శాతం తగ్గితే త్వరగా అలసిపోతారు. కాబట్టి రోజుకు సరిపడినంత మంచినీటిని తాగితే మంచిది. బయటకు వెళ్లిన ప్రతిసారీ మంచినీళ్ల బాటిల్‌ను వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అలాగే ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగండి.
ఊపిరి సలపని పనులున్నాయని నిద్రపోయే సమయాన్ని కట్ చేస్తే కుదరదు. రోజంతా పని చేసి అలసిపోయిన మీ శరీరానికి అప్పుడేగా విశ్రాంతి దొరికేది. కొందరికి ఆరుగంటల నిద్ర సరిపోతే.. మరికొందరికి ఎనిమిది గంటల నిద్ర ఉండాల్సిందే. శరీరం అలుపును తీర్చుకోవడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో ఎవరికి వారికే అవగాహన ఉంటుంది. కాబట్టి అన్ని గంటలు తప్పనిసరిగా నిద్రపోవాల్సిందే. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. నిద్రపోయే ముందు మీ ఒత్తిళ్లన్నీ మర్చిపోవాలంటే గోరువెచ్చటి నీటితో స్నానం చేసి, గోరువెచ్చని పాలు తాగి మంచి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకోండి.