Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల్లో మెనోపాజ్ దశ సర్వసాధారణం. ఇది 40ల చివర్లో మొదలవుతుంది. ఈ సమయంలో హార్మోన్లలో వచ్చే తేడాల కారణంగా భావోద్వేగాల్లో మార్పులు, శారీరక ఇబ్బందులూ వస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశను సులువుగానే ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా..?
ఈ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయులు తగ్గుతాయి. దాంతో ఎముకల్లో బలం తగ్గుతుంది. కాబట్టి... విటమిన్ డి, కె, క్యాల్షియం, ఫాస్ఫరస్ ఉండే పాలు, పాల సంబంధిత పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎముకలు బలంగా ఉండటానికి ప్రొటీన్ అవసరం. ఇందుకు గుడ్లు, చికెన్, చేపలను తీసుకోవాలి.
గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, క్వినోవాల్లో ఫైబర్, బి విటమిన్ ఎక్కువ. ఫైబర్ ఆరోగ్యంగా ఉంచితే బి విటమిన్ ఉత్సాహంగా ఉంచడంతోపాటు అలసటను తగ్గిస్తుంది. పండ్లూ, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంతోపాటు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. గుండెనీ ఆరోగ్యంగా ఉంచుతాయి.
నువ్వులు, అవిసెలు, బీన్స్ల్లో ఫైటోఈస్ట్రోజన్ ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
ప్రాసెస్డ్, కారం, తీపి, కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్ని పదార్థాలతో భావోద్వేగాల్లో మార్పులు, వేడి చేయడం వంటివి కనిపిస్తాయి. అవేంటో గమనించుకుని దూరంగా ఉండాలి. ఇంకా.. రోజూ కొద్దిసేపు నడవాలి. విపరీతమైన ఆందోళన, కోపం వంటి సూచనలు కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించాలి. ఈ సమయంలో బరువు పెరిగే అవకాశమూ ఉంటుంది. అందువల్ల ఆరోగ్యకర ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.