Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశపు మొట్టమొదటి ఫెన్సర్ (కత్తిసాము) భవానీ దేవి. తల్లి కోవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రి మంచంపై ఉండి కూడా కూతుర్ని ప్రోత్సహించింది. బుడాపెస్ట్ ప్రపంచ కప్‌లో ఆడి తన కలను నిజం చేసుకోవాలని ఆ తల్లి కోరుకుంది. ఆ తల్లి కలను నిజం చేసేందుకు అహర్నిశలూ శ్రమించింది. చివరకు 2021 ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ ఫెన్సింగ్‌లో పాతినిథ్యం వహిస్తున్న తొలి భారతీయురాలి పరిచయం నేటి మానవిలో...
భవానీ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో 1993 ఆగస్టు 27న పుట్టింది. ఆమె తండ్రి జీవించి ఉన్నప్పుడు ఓ గుడిలో పూజారిగా చేసేవారు. తల్లి గృహిణి. చెన్నైలోని మురుగ ధనుష్కోడి బాలికల పాఠశాలలో చదువుకుంది. తర్వాత చెన్నైలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. కేరళలోని తలాసేరిలోని ప్రభుత్వ బ్రెన్నెన్ కళాశాల నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది.
మొదటి టోర్నమెంట్...
భవానీ 2003లో తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. పాఠశాలో చదివేటప్పుడే భవానీకి ఈ ఫెన్సింగ్ క్రీడ పరిచయమయింది. 10 వ తరగతి పూర్తి చేసిన తర్వాత కేరళలోని తలసేరీలోని ఎస్ఐఐ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్లో చేరింది. తన 14 సంవత్సరాల వయసులో టర్కీలో జరిగిన మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంది. అక్కడ మూడు నిమిషాలు ఆలస్యమైనందుకు ఆమెకు బ్లాక్ కార్డ్ వచ్చింది. 2010లొ ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భవానీ కాంస్య పతకాన్ని సాధించింది.
సమాజం ప్రశ్నించేది
ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించడం ఆమె కల. ఈ కలను నిజం చేసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాన్ని ఎన్నో స్వరాలు వ్యతిరేకించాయి. మరికొన్ని స్వరాలు హేళన చేశాయిజ. ''ఆటల కోసం ఎందుకు ఇంత సమయం కేటాయిస్తున్నావు'' అని చాలా మంది నన్ను అడిగేవారు. ప్రజలు అడిగేవారు. ఓ మహిళ చదువుకోవచ్చు, ఉద్యోగం చేయవచ్చు కానీ ఆటలు ఆడకూడదు. సమాజం నుండి నాకు ప్రోత్సాహం రాలేదు. కాని మా అమ్మానాన్న దీని గురించి ఆలోచిస్తూ బాధపడొద్దుని ధైర్యం చెప్పేవారు. చింతించవద్దని చెప్పారు'' అంటూ తన క్రీడా జీవితం మొదలుపెట్టిన నాటి తొలి రోజులను గుర్తు చేసుకుంది.
ఇదే మొదటిసారి
2003లో వెదురు కర్రలతో ఫెన్సింగ్ శిక్షణ ప్రారంభించిన భవానీ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనే పట్టుదలతో కృషి చేసింది. ''మన దేశంలో చాలా మంది ఫెన్సింగ్ క్రీడను చూడటం ఇదే మొదటిసారి. కాబట్టి నేను వారి ముందు నా ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నా' అని ఆమె భవానీ అంటుంది.
కెరీర్లో మైలురాయి
ఫెన్సింగ్‌లో అగ్రగామిగా ఉన్న భవానీ 2014 అండర్ -23 విభాగంలో 2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మొదటి భారతీయురాలు. అందుకుగాను అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత రూ .3 లక్షలతో భవానీని సత్కరించింది. ఏప్రిల్ 2021 నాటికి ఆమె 37.0 పాయింట్లతో ప్రపంచంలో 42వ స్థానంలో నిలిచి తన కెరీర్లో ఓ మైలురాయిని తాకింది. ఈ సంవత్సరం టోక్యోలో జరగబోయే కమ్ సమ్మర్ ఒలింపిక్స్‌లో మొదటిసారి భారతదేశం తరపున అథ్లెట్ ఫెన్సింగ్‌లో పాల్గొనబోతున్న ఈమెకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.
అమ్మ ప్రోత్సాహమే...
నా తల్లి ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. ఆమె నాతో 'ఈ రోజు మనం అనుకున్నది జరగకపోవచ్చు. రేపు కచ్చితంగా జరిగితీరుతుంది. మనం 100 శాతం పట్టుదలతో కృషి చేస్తే కచ్చితంగా ఫలితాన్ని పొందవచ్చు' అనేది. అమ్మ కోవిడ్‌తో పోరాడుతూ ఆసుపత్రి మంచం నుండి కూడా నా కలపై దృష్టి పెట్టమనేది. ఇంటికి తిరిగి రావడానికి బదులు బుడాపెస్ట్ ప్రపంచ కప్‌లో ఆడాలని నాకు చెప్పేది. నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అధిగమించగలిగాను.
- సలీమ