Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హౌం చాలామందికి ఈ ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పచ్చు. అయితే ఓవైపు ఇంటి నుంచి చేసే ఆఫీస్ పని, మరోవైపు ఇంటి పని చేసుకోవడం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్ చేయాలంటే కత్తి మీద సామే! అలాగని మరీ ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన పనిలేదు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం..
- వంట చేయడమే పెద్ద పని అనుకుంటే.. ఇక వంటంతా పూర్తైన తర్వాత కిచెన్ శుభ్రం చేయాలంటే చుక్కలు కనిపించక మానవు. మరి ఈ బాధ తప్పాలంటే ఈ సింపుల్ చిట్కాను పాటించి చూడండి. అందుకోసం.. కిచెన్‌లో పని మొదలుపెట్టేముందే కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ లాంటివి పరచండి.. మీ కటింగ్ లేదా పిండి కలపడం లాంటివి చేస్తున్నప్పుడు చెత్తంతా పేపర్‌పై పడుతుంది. మీ పని పూర్తైన వెంటనే పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ని చుట్టి చెత్తడబ్బాలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చాలా వరకు క్లీనింగ్ పని తప్పించుకున్నట్టే.
- అందరూ ఇంట్లో ఉండడం వల్ల రుచికరమైన వంటకాలు కావాలని కోరుకుంటారు. అలాగని మనం వంట చేస్తూ కూర్చుంటే మన ఆఫీస్ పని కోసం గడిచే సమయం ఆగదు. కాబట్టి ఇలాంటి సమయంలో అటు రుచితో పాటు.. ఇటు మీ సమయాన్ని ఆదా చేసే సింగిల్ పాట్ వంటకాల్ని ఎంచుకోండి. అంటే క్యారట్ రైస్, పుదీనా రైస్, పులిహోర, వెజిటబుల్ రైస్.. ఇలాంటివి చేయండి. వీటి వల్ల ప్రత్యేకంగా కూర వండాల్సిన పని ఉండదు. విభిన్న రుచిని మీ కుటుంబ సభ్యులకు అందించిన వారవుతారు. అలాగే పాత్రల వాడకం కూడా తగ్గి గిన్నెలు తోమడం కూడా సులువవుతుంది. మరి మీకు ఉదయాన్నే సమయం సరిపోనప్పుడు ఇలాంటి తరహా వంటకాల్ని ట్రై చేసి చూడండి.. కచ్చితంగా అందరూ మారు మాట్లాడకుండా తినడం ఖాయం.
- కూరగాయల్ని ముందురోజే కట్ చేసి పెట్టుకోండి.. ఇది అందరూ కామన్‌గా చేసేదే అనుకోండి.. కానీ కొందరు బద్ధకం కొద్దీ రేపు ఉదయమే కట్ చేసుకోవచ్చులే అనుకుంటారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడంతో ఇక పని అయినట్టే. కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని రాత్రే కూరగాయలు కోసి పెట్టుకోండి. అయితే క్యారట్స్, బీన్స్, చిక్కుడు, బీట్రూట్, బెండకాయ.. వంటివి కట్ చేసి పెట్టుకుంటే పర్లేదు. కానీ వంకాయ, ఆలూ.. వంటివి రాత్రి కట్ చేసుకుంటే మరుసటి రోజుకి పాడైపోతాయి.. అలాగే కట్ చేసుకున్న కాయగూరల్ని ఫ్రీజర్ బాక్స్‌లు లేదా జిప్పర్ బ్యాగ్స్‌లో పెడితే రెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి.
- బాగా జిడ్డుగా, మురికిగా ఉండే పాత్రల్ని ముందుగానే కాస్త సోప్ నీటిలో వేసి నానబెట్టండి. అలా ఓ గంటపాటు ఉండనిచ్చి.. మీరు మిగతా గిన్నెలు తోమే లోపు అవి నానిపోతాయి. తద్వారా వాటి జిడ్డు, మురికి త్వరగా వదిలిపోయి గంటల తరబడి అంట్లు తోమడానికి సమయం వృథా కాదు.