Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో ఎన్ని రకాల చిరుతిండ్లు ఉన్నా పిల్లలు ఎప్పుడూ కొత్తవే కోరుకుంటారు. పైగా కరోనా వల్ల పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఏవేవో చేసిపెట్టమని పేచీ పెడుతుంటారు. అలాంటి అల్లరి పిల్లలు ఇష్టపడే కొన్ని రకాల స్నాక్స్ తయారీ ఈరోజు నేర్చుకుందాం.
చెగోడీలు
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి - కప్పు, నెయ్యి లేదా నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర - రెండు టీస్పూన్లు, నువ్వులు - రెండు టీస్పూన్లు, కారం - ఒకటిన్నర టీస్పూన్లు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పెసరపప్పుని ఓ గంట నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి పక్కన ఉంచాలి. గిన్నెలో రెండు కప్పుల నీళ్ల్లు పోసి వేడిచేయాలి. అందులోనే ఉప్పు, నెయ్యి లేదా నూనె, నానబెట్టిన పెసరపప్పు వేసి ఓ నిమిషం కలియతిప్పాలి. నీళ్లు మరగడం మొదలవగానే బియ్యప్పిండి, జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. పిండి బాగా కలిసిన తర్వాత మూతపెట్టి పది నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు కొంచెంకొంచెంగా పిండిని తీసుకుని గుండ్రని ఉండలా చేసి దాన్ని రెండు చేతులతో నలుపుతూ సన్నగా పాములా చేయాలి. ఇప్పుడు దాన్ని కావలసిన సైజులో చేసి చేగోడీల్లా చేత్తోనే చుట్టి అంచుల్ని అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి. అంతే కరకరలాడే చెగోడీలు రెడీ...
రిబ్బన్ పకోడా
కావల్సిన పదార్థాలు: సెనగపిండి - కప్పు, పుట్నాలపిండి - కప్పు, బియ్యప్పిండి - నాలుగు కప్పులు, కారం - టీస్పూను, జీలకర్ర - రెండు టీస్పూన్లు, నువ్వులు - ఆరు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి తురుము - రెండు టీస్పూన్లు, అల్లం తురుము - టీస్పూను, కాగిన నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బియ్యప్పిండిలో సెనగపిండి, పుట్నాలపిండి, కారం, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కాగిన నూనె కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చక్కిడాల పిండిలా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఇప్పుడు చక్కిడాలు వత్తే మౌల్డ్‌లో రిబ్బన్ పకోడా వత్తే ప్లేటు వేసి, పిండి మిశ్రమాన్ని పెట్టి బాణలి నిండుగా వత్తి ఎర్రగా వేయించి తీయాలి. ఇలాగే మొత్తం పిండి మిశ్రమాన్ని చేసుకోవాలి.
పెప్పర్ చికెన్
కావల్సిన పదార్థాలు: చికెన్ - అరకిలో, అల్లంవెల్లుల్లి - మూడు టేబుల్‌స్పూన్లు, పసుపు - టీస్పూను, ఉప్పు - సరిపడా, ఉల్లిగడ్డ ముక్కలు - కప్పు, మిరియాలపొడి - ఒకటిన్నర టీస్పూన్లు, కారం - నాలుగు టీస్పూన్లు, గరంమసాలా - టీస్పూను, కరివేపాకు - కట్ట, జీలకర్ర - అరటీస్పూను, యాలకులు -మూడు, దాల్చినచెక్క - అంగుళం ముక్క, లవంగాలు - నాలుగు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం: చికెన్ ముక్కలకి కాస్త ఉప్పు, టేబుల్‌స్పూను అల్లంవెల్లుల్లి, పసుపు పట్టించి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్ పాన్‌లో జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత మిగిలిన అల్లంవెల్లుల్లి వేసి వేగాక ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. కారం, గరంమసాలా, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలపొడి వేసి నూనె బయటకు వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా మరో నాలుగు నిమిషాలు వేయించి, మూతపెట్టి ముక్క పూర్తిగా ఉడికేవరకూ ఉంచి దించాలి.
చికెన్ పాప్‌కార్న్
కావల్సిన పదార్థాలు: చికెన్‌ముక్కలు - పావుకిలో, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్డు - ఒకటి, బ్రెడ్ పొడి - కప్పు, ఉప్పు - తగినంత, అల్లంవెల్లుల్లి - టేబుల్‌స్పూను, మిరియాలపొడి - పావుటీస్పూను, కారం - రెండు టీస్పూన్లు, గరంమసాలా - టీస్పూను, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో కారం, మిరియాలపొడి, అల్లంవెల్లుల్లి, మసాలా పొడి, ఉప్పు వేసి కలపాలి. చికెన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటిమీద కారం మిశ్రమం చల్లి ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు విడిగా ఓ గిన్నెలో గుడ్డు తెల్లసొన, మరో గిన్నెలో బ్రెడ్ పొడి వేయాలి. ఒక్కోముక్కనీ తెల్లసొనలో ముంచి బ్రెడ్‌పొడిలో దొర్లించి తీయాలి. ఇలాగే అన్నీ చేయాలి. ముక్కలు బాగా కరకరలాడాలంటే మరోసారి గుడ్డుసొనలో ముంచి బ్రెడ్ పొడి అద్దాలి. వీటిని ఓ పావుగంటసేపు పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక కొంచెం కొంచెంగా చికెన్ ముక్కలు వేసి వేయించి తీయాలి.
ఆలూ దాల్ టిక్కీ
కావల్సిన పదార్థాలు: ఆలు - అరకిలో, బ్రెడ్ స్లైసెస్ - మూడు, ఉప్పు - తగినంత, కారం - రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి - టీస్పూను, దనియాలపొడి - అరటీస్పూను, సెనగపప్పు - కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, నిమ్మరసం - కొద్దిగా, కొత్తిమీర తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఆలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. సెనగపప్పుని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉడికించి ఉంచాలి. బ్రెడ్ స్లైసెస్‌ని చిదమాలి. చిదిమిన ఆలూలో ఉడికించిన సెనగపప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి. తరవాత జీలకర్ర పొడి, దనియాల పొడి, కారం, ఉప్పు, రెండు చుక్కల నూనె వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని గుండ్రని బిళ్లల్లా చేసి కాగిన నూనెలో బంగారు రంగులోకి మారేవరకూ వేయించి తీయాలి.