Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుఫాను ముందరి ప్రశాంతతలాగా ప్రస్తుతం వాతావరణం మామూలుగా ఉన్నది. లాక్డౌన్ లేదు కాబట్టి అంరదూ ఆనందంగా టూర్లు వేసుకుంటున్నారు. హౌటళ్ళలోనూ, షాపింగ్ మాల్స్‌లోనూ జనం కిక్కిరిసి ఉంటున్నారు. ఆదివారం నాడు భాగ్యనగరంలో గమనిస్తే ఎప్పటిలా హౌటళ్ళ ముందు పడిగాపులు గాస్తూ డిన్నర్ కోసం మెయిటింగ్ లిస్ట్‌లో పేరుండి ఎదురు చూస్తున్నారు. బోనాలు వంటి పండుగలు గాలి కూడా దూరలేని జన సమూహాల మధ్య జరుపుకుంటున్నారు. ఆగస్ట్‌లో థర్డ్‌వేవ్ వస్తుంది కాబట్టి ఇప్పుడే పెళ్ళిళ్ళు, పేరంటాలు చేసేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఫిష్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు జనంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. అంతేగానీ ఎవరూ కరోనా గురించి ఆలోచించట్లేదు. ఇలా సందళ్ళు, కోలాహాలాల వల్ల కరోనాను రారమ్మని ఆహ్వానం పలికినట్టే కదా! మనం బయటికి వెళ్ళి రెచ్చగొట్టకుండా ఇంట్లో ఉండి పిస్తా, బాదం లాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకుందాం. తిన్న తర్వాత పారవేసే పిస్తా పొట్టుతో మంచి బొమ్మలు తయారు చేసి పటాలు కట్టించుకుని పదిలంగా దాచుకుందాం.
నెమలి
పిస్తాపప్పు బలవర్ధకమైన ఆహారం. దీనిలో బిటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఒలియానోలిక్ ఆమ్ల సమ్మేళనాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పనితీరు మెరుగవుతుంది. ఈ పిస్తా పప్పును స్వీట్లలోనూ, బిస్కెట్లను అలంకరించడానికి ఉపయోగిస్తారు. ఈ గింజలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. పిస్తా గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. రోజూ ఒక ఔన్సు తినవచ్చు. మామూలుగా మనకు బజర్‌లో వేయించిన పిస్తా పప్పులు దొరుకుతాయి. రెండు రెక్కల లాంటి పొట్టు మధ్యలో పిస్తా పప్పు ఉంటుంది. 30 గ్రాముల పిస్తా తింటే 87 కాలరీల శక్తి వస్తుంది. పిస్తాలు తిన్నాక మిగిలే రెండు షెల్స్‌తో ఎన్నో రకాల బొమ్మలు చేసుకోవచ్చు. వీటిని రంగులు వేసి కూడా ఉపయోగించవచ్చు. నేను వీటితో నెమలిని తయారు చేశాను. ఇవి ఎక్కువగా గడ్డి మైదానాలలో నివసిస్తుంటాయి. వర్షం కురిసినపుడు పురివిప్పి నాట్యమాడతాయి. నెమలిని చూడగానే ముందుగా మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది వాటి ఫించాలే. ఇవి శాకాహారాన్ని, మాంసాహారాన్ని తింటాయి. దీని శాస్త్రీయనామం పావోక్రిస్టేటస్. నెమళ్ళు గుంపులుగా నివస్తాయి. ఈ నెమళ్ళ గుంపును ఇంగ్లీషులో పార్టీ అంటారు.
బొద్దింక
పిస్తా పప్పులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందున గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తాయి. మిగిలిన డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే పిస్తా పప్పులో కాలరీలు ఎక్కువ. ఇవి కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. ఈ పప్పుల్లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. పొటాషియం వలన శరీరంలోని ద్రవాల నియంత్రణ జరుగుతుంది. వీటిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని అధికంగా కూడా తినకూడదు. వారానికి 15 నుంచి 20 గ్రాములకు మించి తీసుకోకూడదు. అయితే మిగతా డ్రైఫ్రూట్స్ కన్నా పిస్తా పప్పులో ప్రోటీన్‌శాతం ఎక్కువ. ఇంట్లో పిస్తా పప్పును తిన్న తర్వాత దాన్ని కప్పినట్లుండే రెండు షెల్స్‌ను దాచి పెట్టాను. అలా దాచిన షెల్స్‌తో రకరకాల బొమ్మలు చేశాను. ఇప్పుడు ఇళ్ళలోని వంటింట్లో తిన్న పళ్ళాలపై రాజ్యం చేస్తూ ఉండే బొద్దింకను తయారు చేశాను. ఇంటర్ మీడియట్లో బైపీసీ తీసుకున్న ప్రతి విద్యార్థి బొద్దింకను డిసెక్షన్ చేస్తారు. అలా సైన్స్ విద్యార్థులు బొద్దింక, కప్పలను డిసెక్షన్ చేసి వాటిలోని జీర్ణాశయ భాగాలు, నాడీ వ్యవస్థను తెలుసుకుంటారు. ఈ బొద్దింకను 'పెరిప్లానేటా అమెరికానా' అంటారు. ఇవి నిశాచర జీవులు. వంటిళ్ళలో పగటి పూట దాగి ఉండి రాత్రి పూటే బయటికొస్తాయి. మొత్తం 4,600 జాతులు ఉన్నాయి. ఇవి చాలా పురాతన జీవులు. దాదాపుగా 3000-350 మిలియన్ సంవత్సరాల కిందట నుంచి ఉన్న ప్రాచీన జీవులు. దీని ఉదరం పది ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. మనలో చాలా మందికి బొద్దింకలంటే భయపడతారు.
తాబేలు
పిస్తాపప్పు శాస్త్రీయనామం ''పిస్తాసియావేరా'' ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది కాబట్టి సాయం సమయాల్లో పకోడీలు, మిర్చీలు వంటి వేపుడు పదార్థాల జోలికి పోకుండా పిస్తా పప్పును తింటే ఆరోగ్యం, సౌందర్యం కూడా వస్తుంది. నేను వీటితో తాబేలును తయారు చేశాను. తాబేళ్ళు సరీసృపాలు. వీటికి ఏ ఆపదవచ్చినా, శత్రువు వస్తున్నాడనగానే తలను దాని డిప్పలో దాచుకుంటుంది. దృఢమైన టెంక లాంటి పైకప్పు దీని శరీరంపై డిప్పలాగా అమరి ఉంటుంది. వీటిని ఎక్కువకాలం జీవించే జీవులకు ఉదాహరణగా చెప్పవచ్చు. ట్రయాసిక్ యుగం నుంచి కూడా ఎలాంటి మార్పులు లేకుండా ఈనాటికీ జీవించి ఉన్నాయి. వీటిలో కొన్ని నేలమీద నివసిస్తాయి. కొన్ని నీటిలో మాత్రమే నివసిస్తాయి. వీటి శరీరం పొట్టిగా, విశాలంగా అండాకృతిలో ఉంటుంది. వీటికి నాసికా రంధ్రం ఒకటే ఉంటుంది.
కప్ప
ఈ రోజు అన్ని బొమ్మలూ పిస్తాపొట్టతోనే చేసుకుంటున్నాము కదా! ఇప్పుడు కప్పను చేద్దామనుకున్నాను. మామూలు కప్పను కాకుండా కార్టూను బొమ్మలలోని కప్పను చేద్దామని నిర్ణయించుకున్నాను. దీనికోసం నేల మీదనే అంటే బండల మీదే కప్ప బొమ్మను వేసుకొని దాని ప్రకారం పిస్తా పొట్టును అమర్చాను. మధ్యలో కలర్ కాంబినేషన్ కొరకు చింతగింజల్ని ఉపయోగించాను. చాలా బాగుంది. ఈ కప్ప గెంతుతూ నవ్వుతోంది. చిన్నప్పుడు స్కూళ్ళలో కప్పలా గెంతమని పోటీలు పెట్టేవాళ్ళు. అలా గెంతేటపుడు బెకబెక అంటూ ఆడుకునేవాళ్ళు. ఇందాక బొద్దింక గురించి చెప్పుకున్నట్టుగా కప్పను కూడా ప్రయోగశాలల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నేను కూడా అలాగే కప్పలో జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నీ డిసెక్షన్ చేసి తెలుసుకున్నాం. కప్ప యొక్క లార్వాను 'టాడ్‌పోల్' అంటారు. చిరుకప్పకు తోక ఉంటుంది. ప్రౌఢ జీవిగా మారేసరికి తోకను కోల్పోతుంది.
కుందేలు
తక్కువ కాలరీలతో శరీరానికి తక్షణ శక్తి సమకకూరుతుంది. పిస్తా పప్పు తిన్నందు వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం కరోనా మానవులపై విరుచుకుపడుతున్న వేళ అందరూ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారమే తినాలి. అందుకే వాటి వివరాలతో పాటు పిస్తా పొట్టుతో బొమ్మలు కూడా చూపిస్తున్నాను. కుందేలు అనగానే తెల్లని వూలుతో చేసినట్టు మెత్తగా ఉండి పొడవైన చెవులతో కళ్ళను అటూఇటూ భయంతో తిప్పే జీవిగా గుర్తు వస్తుంది. వీటిని కూడా కొంతమంది పెంపుడు జీవులుగా పెంచుకుంటారు. మేము డిగ్రీ చదివేటపుడు కుందేలు ఎముకల్ని పరీక్షల్లో స్పెసియన్గా పెట్టి వాటిని కనుక్కోమనేవారు. ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు, కారెట్లు తింటుంది. ఇవి ఒకేసారి చాలా ఎక్కువ పిల్లల్ని పెడతాయి. కుందేలు బావుంది కదూ!
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్