Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్యకు, సురేష్‌కు పెండ్లయి పదమూడేండ్లు. మొదటి నుండే భార్యతో ప్రేమగా ఉండడు. నవ్వుతూ పలకరించడు. ఇద్దరి మధ్య చిన్న కీచులాట జరిగినా వారం పదిరోజులు భార్యతో మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. ఆ నిశ్శబ్దాన్ని సంధ్య భరించలేకపోయేది. ఆమె ఏమైనా గట్టిగా మాట్లాడితే ''నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కట్టబెట్టారు. నేను ఇంతే ఉంటా..ఉంటే ఉండూ లేకపోతే పో'' అంటూ కఠినంగా మాట్లాడతాడు.
సురేష్ ఏం చేసినా పిల్లల కోసం సంధ్య మౌనంగా ఉండేది. అయితే అతని ప్రవర్తనలో రోజు రోజుకు చాలా మార్పు వస్తుంది. ఆఫీస్‌లో తనతో పాటు పని చేసే ఓ అమ్మాయితో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్థరాత్రి వరకు ఉండి వస్తాడు. ఈ విషయం గురించి సంధ్య ఆరా రీస్తే ''నన్ను అనుమానిస్తున్నావు'' అంటూ నెల రోజుల వరకు ఒకే ఇంట్లో ఉన్నా ముఖం చూసేవాడు కాదు.
సంధ్య ఎప్పుడైనా అలా పుట్టింటికి వెళ్ళగానే ఆఫీస్‌లో పని చేసే అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటాడు. ఓసారి వారిద్దరిని సంధ్య తన కండ్లతో చూసింది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి సురేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సంధ్యపై కోపంతో ఇంటి లోన్ కట్టడం ఆపేశాడు . సంధ్య ఎంత బతిమలాడినా ఇంటికి రావడం లేదు. ఓవైపు బ్యాంక్ వాళ్ళు లోన్ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీసులు పంపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంధ్య తన పిల్లలను తీసుకొని న్యాయం చేయమంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
సంధ్య సమస్యంతా విన్న సభ్యులు సురేష్‌ను రమ్మనమని లెటర్ పంపారు. అయితే సభ్యులు రమ్మన్న రోజు సురేష్ రాలేదు. దాంతో సభ్యులు అతనికి ఫోన్ చేశారు. అప్పుడు తన స్నేహితుడిని తీసుకొని వచ్చాడు. సురేష్ మాట్లాడుతూ ''మేడమ్ నేను చాలా సెన్సిటివ్. నన్ను ఆమె అనవసరంగా అనుమానించింది. నలుగురిలో నా పరువు తీసింది. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. నేను స్వతహాగానే మనసుకు చిన్న బాధ అనిపించినా రోజుల తరబడి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటాను. మేము ఒకటే ఇంట్లో ఉన్నా నెలల తరబడి మాట్లాడుకోని రోజులు చాలా ఉన్నాయి. మరి అన్యాయంగా నన్ను అనుమానిస్తే ఆ ఇంట్లో ఎలా ఉంటాను. అందుకే వెళ్ళిపోయాను.
పైగా ఈ విషయంపైనే ఓసారి పంచాయితీ పెట్టింది. దానికి మా అమ్మానాన్నలు కూడా వచ్చారు. పంచాయితీలో పెద్దలు మమ్మల్ని మా ఊరు వెళ్ళి ఉండమన్నారు. మేమందరం కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆరోజు ఆమె రానంది. కోపం వచ్చి మా అమ్మ వాళ్ళను ఊరు పంపించేశారు. ఇక అప్పటి నుంచి ఆమెపై నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నాకు ఆమెతో కలిసి ఉండాలని లేదు'' అని చెప్పుకొచ్చాడు.
నువ్వు ఇలా మాట్లాడటం కరెక్టు కాదు. సమస్య వస్తే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. నువ్వేమో అసలు మాట్లాడనని చెబుతున్నావు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా మౌనంగా, భార్యతో మాట్లాడకుండా ఉంటే ఆమె ఎంత నరకం అనుభవిస్తుందో నీకు అర్థం కావడం లేదు. నీ భార్య నిన్ను అనుమానిస్తుందంటే నీవైపు నుంచి ఏమైనా పొరపాటు ఉందేమో చూసుకోవాలి. అలా చేయకుండా ప్రతి దానికీ ఆమెనే తప్పుపడుతున్నావు. అసలు నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఉంటున్నావు. వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. పైగా ఇంటికి కట్టాల్సిన లోన్ కూడా కట్టడంలేదు. కనీసం మీరు మీ పిల్లల గురించైనా ఆలోచించాలి. మీ ప్రవర్తన మార్చుకోవాలి'' అన్నారు సభ్యులు.
దానికి సురేష్ ''అయితే ఆమెను ఊరికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో కలిసి ఉండమనండి. నా మనసు మారినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా'' అన్నాడు. ''నీ మనసు ఎప్పుడు మారుతుంది'' అడిగారు సభ్యులు. ''ఏమో చెప్పలేను, సంవత్సరం పట్టొచ్చు, ఆరునెలలు పట్టొచ్చు. ఆమె మారిందని మా అమ్మవాళ్ళు చెబితే అప్పుడు తెచ్చుకుంటా'' అని మొండిగా సమాధానం చెప్పాడు.
''భర్తలేకుండా భార్య అక్కడ ఎందుకు ఉంటుంది. నువ్వు మాట్లాడే విధానం మంచిది కాదు. అయినా నువ్వు చాలా మొండిగా చేస్తున్నావు. భార్యా పిల్లల పట్ల మా ముందే ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నావంటే, ఇక ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించగలం. అయినా అక్కడికి వెళుతుందో లేదో నిర్ణయించుకోవల్సింది సంధ్య. ఆమెను అడిగి తన అభిప్రాయం కూడా తీసుకుంటాం. మీరు కాసేపు బయట కూర్చోండి'' అని సభ్యులు సురేష్‌ను బయటకు పంపారు.
సంధ్యను పిలిచి జరిగిందంతా చెప్పారు. ''నేను చచ్చినా అక్కడికి వెళ్ళను. మా అత్తమామలు నన్ను హింసిస్తారు. అప్పుడు పంచాయితీ పెట్టినప్పుడు రెండు రోజలు ఇక్కడ ఉండి, మా అందరికీ ఇష్టమైతేనే ఊరికి వెళ్ళమన్నారు. అయితే ఆ రెండు రోజుల్లోనే మా అత్త నాకు నరకం చూపించింది. నన్ను నా భర్తతో మాట్లాడనిచ్చేది కాదు. గది దాటి బయటకు రానిచ్చేది కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే పది బూతులు తిట్టేది. ''నీ ముఖం నా కొడుక్కి చూపించకు, నిన్ను చూస్తే వాడికి పిచ్చెక్కిద్ది. నీ వల్లే మా కుటుంబం రోడ్డున పడింది'' అని నానా మాటాలు అనేది. ఇక నేను ఆయన లేకుండా అక్కడ ఉంటే చంపినా చంపుతారు. ఆయన వస్తేనే నేను కూడా అక్కడ ఉంటాను'' అని సమాధానం చెప్పింది.
దాంతో సభ్యులు బాగా ఆలోచించుకొని రెండు వారాల తర్వాత రమ్మన మని చెప్పి పంపారు. మళ్లీ రెండు వారాల తర్వాత ఇద్దరూ వచ్చారు. ఎంత చెప్పినా సురేష్ మాత్రం సంధ్యను ఊర్లోనే ఉండమంటున్నాడు. ఆమె మాత్రం భర్త లేకుండా అక్కడ ఉండనంటుంది. సంధ్య చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉందని సభ్యులు అర్థం చేసుకున్నారు. అయితే సంధ్య ఇక్కడే ఉంటే బ్యాంక్‌లోన్ కట్టనని, పిల్లల ఖర్చులు చూసుకోనని తెగేసి చెప్పి సురేష్ వెళ్ళిపోయాడు.
సంధ్య మాత్రం ''మేడమ్ అతను నాతో ఉన్నా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు. పోనీ ఆలాగే ఉందామంటే ఆయన మాత్రం సిటీలో ఉండి నన్నూ, పిల్లల్ని మాత్రం ఊర్లో ఉండమంటున్నాడు. నాకు ఇదేదీ ఇష్టం లేదు. ఎలాగైనా ఆయనతో నెలనెల లోన్ కట్టించండి. మిగిలిన ఖర్చులకు ఎలాగో నా పుట్టింటి వాళ్ళు సహకరిస్తారు'' అన్నది.
''చూడు సంధ్య... నీ భర్త కావాలనే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నువ్వు ముందు నీ భర్తకు ఊర్లో ఉన్న ఆస్తి వివరాల గురించి తెలుసుకో. తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అతనిపై కేసు పెట్టు. ఆ కేసు కాపీ తీసుకొని బ్యాంక్‌కి వెళ్ళు. బ్యాంక్ వాళ్ళను కలిసి నీ సమస్య వివరించు. నీ భర్తకు ఊర్లో ఉన్న ఆస్తిల గురించి కూడా వాళ్ళకు చెప్పు. ఒకవేళ సురేష్ లోన్ కట్టకపోతే ఊర్లో ఉన్న అతని ఆస్తులను జప్తు చేసుకోమని లెటర్ పెట్టుకో. దీనికి మేం కూడా నీకు సహాయం చేస్తాం. మరో విషయం ఏమిటంటే నువ్వు పూర్తిగా నీ పుట్టింటి వాళ్ళపై ఆధారపడడం మంచిది కాదు. చదువుకున్నావు కాబట్టి ఏదైనా ఉద్యోగం చూసుకో. ధైర్యంగా నీ బతుకు నువ్వు బతుకుతుంటే అప్పుడు నీ భర్త నీ దారికి వస్తాడు'' అని సభ్యులు సంధ్యకు ధైర్యం చెప్పారు.
సభ్యులు చెప్పిందంతా విన్న సంధ్య ''అతని వల్ల పదమూడేండ్ల నుంచి నరకం అనుభవిస్తున్నాను. అతని మౌనంతో పిచ్చిదాన్నై పోయాను. ఇక నా వల్ల కాదు. మీరు చెప్పినట్టే చేస్తాను. నేనూ ఉద్యోగం చూసుకుంటా. పిల్లల్ని బాగా చదివిస్తా. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కేసు పెడతా. బ్యాంక్ వాళ్ళను కూడా కలిసి నా సమస్య చెప్పుకుంటా. ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కలుస్తా'' అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది.
- సలీమ