Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ కామక్షమ్మ, ప్రభుత్వ ఉద్యోగి. నాన్న జొన్నలగడ్డ రాధకృష్ణ డాక్టర్. నాన్నది నెల్లూరు. అమ్మది కడప. వారికి మేము ముగ్గురం సంతానం. నాకు ఓ అక్క, అన్నయ్య. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు ఇందులేఖ. తను హోమియో పతి డాక్టర్. తనది తిరుపతి. మేము 25 సంవత్సరాలుగా స్నేహితులం. నాకు ఓ విధంగా గురువు కూడా. ఎందుకంటే నాకు ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చిన, బాధకలిగిన తనతోనే పంచుకుంటాను. తను నాకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడమే కాక వాటి అన్నింటి నుంచి బైటకు వచ్చే మార్గం కూడా చెప్తుంది. ఇంత మంచి స్నేహితులం అయిన పొట్లాడుకుంటాం, ఆడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అలుగుతాం. అప్పుడప్పుడు మిస్ అండర్ స్టాండింగ్స్ కూడా. అయినా సరే మా స్నేహం 25 వసంతాలు నింపుకుంది.
మా స్నేహం ఎలాంటిది అంటే తినే పదార్ధాల దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు ఒకరిని ఒకరం సంప్రదించు కుంటాం. ఇద్దరం ఓ చోట చేరితే అల్లరే అల్లరి. మేము ఇద్దరం జంతు ప్రేమికులం కూడా. నేను ఏమాత్రం డల్‌గా కనిపించినా తను ఊరుకోదు. నన్ను సంతోష పెట్టడానికి, నా సంతోషం కోసం ఏమైనా చేస్తుంది. స్వతహాగా నేను చాలా చాలా అల్లరి పిల్లని. ఎంత అల్లరి చేస్తానో ఇందు అంత నెమ్మదస్తురాలిని. ఎప్పుడో కానీ తాను నాతో కలిసి అల్లరి చేస్తుంది. ఓ సారి ఏమైందంటే మేము జలవిహార్కి వెళ్ళాము. అక్కడ అన్ని వాటర్ గేమ్స్. అక్కడ పడవ లాగా ఉండి పైనుంచి కిందకి వచ్చేది ఒకటి ఉంది. అది చూసి మిగిలిన ఫ్రెండ్స్ ఎక్కుదామని అన్నారు. కానీ అది ఎక్కాలంటే మాకు కొంచం భయంగానే ఉంది. ఎందుకంటే అందులో ఎక్కిన వాళ్ళు ఒకటే అరుపులు, కేకలు. అది చూసీ నేను, ఇందు కొంచం వెనకడుగు వేశాం. కానీ మిగతా ఫ్రెండ్స్ ఊరుకోలేదు. బాగా రెచ్చ గొట్టారు. సరే అని వెళ్లి కూర్చున్నాం. అది స్టార్ట్ అవగానే మా భయానికి తగ్గట్టుగా బాగా పైకి ఎగిరింది. ఒక్క 3 నిమిషాల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, భయంతో వణికిపోయాం. అంతపైకి ఎగిరిన బోట్ తిరిగి సరైన ట్రాక్ మీదకు వచ్చి నీళ్ళల్లో పడింది. అది అలా పడగానే వెనుక ఉన్న జనాలు మా మీద పడ్డారు. దాంతో నీళ్ళల్లో పడ్డాం. ఇంకా ఎక్కడైనా పడి ఉంటే ఏమయ్యేదో చెప్పలేక పోయేవాళ్ళం. ఇక అప్పటి నుంచి నీళ్లు, వాటితో ఆడే గేమ్స్ గురించి విన్నమంటే చాలు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళం కాదు.
క్రికెట్ అందరూ నేల మీద ఆడతారు. మేము మాత్రం మిద్దెల మీద ఆడేవాళ్ళం. ఎందుకంటే మమ్మలి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి. ఇక మా టార్గెట్ వాళ్ళ కిటికీలు, తలుపులే. బాల్ వెళ్లి అవి బద్దలు కొట్టేవి, బాలు విసరటం వరకే మేము అక్కడ ఉండేది. తర్వాత జంప్.. విహార యాత్రలకు వెళ్తే ఇక మా అల్లరి చెప్పనవసరం లేదు. అందరూ జామ పళ్ళు కొనుక్కుని తింటారు. మేము మాత్రం తోటల్లో దొంగతనం చేసి తినేవాళ్ళం. తర్వాత తోట వాళ్ళతో బాగా తిట్లు తినే వాళ్ళం. తిట్లు తిన్నాక వాళ్లకు డబ్బులిచ్చి వెళ్లిపోయేవాళ్ళం. డబ్బులు ఎందుకు ఇచ్చేవాళ్ళం అంటే వాళ్ళ మాటల్లో బాధ కనిపించేది. పాపం వాళ్లకు కష్టాలు ఉన్నాయి, ఇలా చేయకూడదు అనిపించేది.
ఎంత అల్లరి చేసినా మన సంస్కృతి, సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తాము. పెద్దల దగ్గరనుంచి నేర్చుకున్న సంప్రదాయాలు మేము ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న మరువలేదు. తల్లి తండ్రులతో, తోడ బుట్టిన వారితో పంచుకోలేనివి ఒక్క స్నేహితులతోనే పంచు కోగలం. కాబట్టి ఎప్పుడు వారిని దూరం చేసుకో కూడదు. అయితే అన్ని మన చేతుల్లో ఉండవు. కాబట్టి పాజిటివ్ దృక్పధంతో జీవితంలో ముందుకు వెళ్తుండలి. మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాం. ఆస్తి కంటే గొప్పది స్నేహమని నా అభిప్రాయం.
- పూజిత, నటి