Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నేహను బంధానికి అనిర్వచనీయ అనుబంధం వుంటుంది. అదే బాల్యాను బంధమైతే ఆ అనుభూతులు ఎప్పటికీ అనిర్వచనీయాలే. ఆ బంధం అనుబంధం దశాబ్దాల నుంచి కొనసాగుతూ.. ఇప్పటికీ ప్రేమాను బంధమై పెనవేసు కుంటే అంతరంగాలలో సుస్థిరమై, మధుర భావనలు, ఇప్పటికీ హృదయ పూర్వకంగా పలకరించుకుంటుంది. ఆ హృదయ భాష ఎప్పటికీ సుస్థిరమే.. సుమధురమే.
స్నేహం అనే మాట వినగానే నాకు 'పాప' మెదిలింది. పాపంటే అందరికీ శారద. కోట్లాది అభిమానులకు ఊర్వసి శారద. నాకు మాత్రం పాప. ఇద్దరం తెనాలి మున్సిపల్ గరల్స్ హైస్కూల్లో చదువుకున్నాము. ప్రేమానురాగాలను ఇచ్చిపుచ్చుకున్నాము. స్కూల్ నాటకాలలో పాత్రధారులమయ్యాము. నృత్యాలు కూడా చేశాము. మా టీచర్స్ అందరికీ మేమిద్దరమంటే ప్రత్యేకమైన అభిమానం. మా సంగీతం టీచర్ శకుంతలగారు. మమ్మల్ని పిలిచి ''ఎల్లుండి అక్కినేని నాగేశ్వరావుగారు మన స్కూల్‌కి వస్తున్నారు. మీరు నృత్యం చేయాలి'' అని అడిగినప్పుడు ఆనందంగా అంగీకరించాము. నేను పదవ ఏట నుండే కలం పట్టడం వల్ల ఆరోజు నృత్యం తాలూకు పాటకు మెరుగులు దిద్దాలను. 'నాట్య కళా మహౌధరా - కళా ప్రపూర్ణ సుధానిధ'' అంటూ ఆ మహానాయకుని (చలనచిత్ర) ఆహ్వానిస్తూ 'కలకాలము వర్ధిల్లు సాధణ'' అంటూ హృద్యంగా ముగించాము. అందరూ ముగ్ధులయ్యారు. అన్నమయ్య అక్కినేని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. మా స్కూల్లో ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినా మేమిద్దరం వుండవల్సిందే. మాతోపాటు ''భీష్మ సుజాత'' కూడా తప్పని సరిగా పాలు పంచుకునేది. స్కూల్లో వార్షికోత్సవానికి ''శకుంతల'' నాటకానికి అత్యద్భుతంగా రూప కల్పన జరిగింది. ఆ నాటకంలో పాపా(శారద), సుజాత, నేను నటించాము. ఆనాటకాన్ని చాలాకాలం ఎవ్వరూ మరచిపోలేక పోయేవాళ్ళు. మాతో కలసి అలనాటి సుప్రసిద్ధ నటలు సూరిబాబు గారు, ఈలపాట రఘరామయ్యగారి అమ్మాయిలూ, సాంస్కృతిక కార్యక్రమాలలో నర్తించేవారు.
మొదటి నుండి పాప వ్యక్తిత్వం ప్రత్యేకంగా, ఉన్నతంగా కన్పించేది. ఆ కండ్లల్లో వినూత్న భావాలు, ఆ ముఖ కవళికలలో విచిత్ర రసస్పందనలు, ఆ ఆలోచనల్లో భావ గాంభార్యం, ఆ మాటలలో భావోద్వేగం, చిన్నతనంలోనే నన్ను అమితంగా ఆకట్టుకునేది. నా ఊహలలో పాప స్థాయి, భవిష్యత్‌లో అత్యున్నతంగా అన్పించేది. శారదకి నటనంటే ఎంతో ఆసక్తి. అవకాశాలు వస్తే నటనాపరంగా తన వంతు పేరు ప్రఖ్యాతులను అందుకోగలదన్న నమ్మకం నాకుండేది. అవకాశాలు అర్హతలను బట్టే వెతుక్కుంటూ వస్తాయి. నాగభూషణం గారి రక్తకన్నీరు నాటకంలో హీరోయిన్గా ఆహ్వానం అందింది. సహజ సిద్ధమైన నటన ఎందరి ప్రశంసలనో అందుకుంది. అలాగే 'కన్యా శుల్కం'లో నాట్యాన్ని అభినయించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలా అలా చిత్రరంగంలోనికి దూసుకుపోయింది.
నేను, నాకత్యంత అభిమాన, ఆరాధ్య పాత్రయైన వైద్య, రచనా రంగంలో స్థిరపడిపోయాను. మా దారులు వేరయాయి. అయినా ఆత్మీయతలు అతి దగ్గరగానే వుండేవి. ఒకరోజు తెనాలిలో అనుకోకుండా కల్సుకున్నాము. చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నాము. ఆ నేపథ్యంలోనే పాప చిన్నగా అంది ''కృష్ణా! 'ఇద్దరు మిత్రులు' చిత్రంలో నేను మా అన్నయ్య అక్కినేని గారికి చెల్లెలుగా నటిస్తున్నాను'' అని. ముందు కొంత ఆనందం కన్పించినా, తర్వాత నా మనస్సు చివుక్కు మంది. కారణం మా ఇద్దరి అన్నా చెల్లెళ్ళ బంధం అపురూపమైనది అనూహ్యమైనది. నన్నెవరైనా చెల్లి అన్నా.. తననెవరైనా అన్నా అన్నా మా ఇద్దరి మనస్సులూ అదోలా అయిపోయేవి. ''కృష్ణా! మీ అన్నయ్య పక్కన హీరోయిన్గా నటిస్తున్నానని శారద అని వుంటే ఎంతగానో పొంగిపోయేదాన్ని. అక్కినేని ఇంటి ఆడపడుచుగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నేను.
శారద నటనలో శిఖరాగ్రాలను అధిరోహించింది. ముందుగా మళయాళంలో ఎవ్వరూ ఉహించలేని సాధించలేని విజయాలను సొంతం చేసుకుంది. మూడు సార్లు తన అద్భుత అభినయానికి అందరికన్నా ముందుగా 'ఊర్వసి' పురస్కారాలను అందుకోవటం చలన చిత్ర చరిత్రలోనే అత్యద్భుతం.
మేము ఎక్కడున్నా ఫోన్ల ద్వారా పలకరించుకుంటూనే ఉండేవాళ్ళం. శారద రాజకీయల్లోకి అడుగు పెట్టి ఎం.పిగా ప్రజలకు ఎన్నో సేవలు చేసి అందరి మన్నలను పొందింది. శారదలో మంచి, మానత్వం, దానగుణం అధికం. తను చేసిన గుప్తదానాల గురించి నాకు తెలుసు. పసివారిని తన పిల్లలుగానే భావించి అక్కున చేర్చుకోవటం, వృద్ధులకు మమతాను రాగాలను పంచటం శారదకు వెన్నతో పెట్టిన విద్య. ఆరోగ్యం సహకరించకపోయినా అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఆవేదన చెందుతుంది. అందరూ తనవారే నన్న భావనతో దగ్గరకు తీసుకుంటుంది. ఈ స్వార్ధ సమాజంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా స్థిరత్వంలో ముందుకు సాగిపోతోంది. ఎన్నో దశాబ్దాల మా అనుబంధంలో శారద అని సంబోధించటం ఇదే మొదటిసారి. కృష్ణా అన్న పిలుపులోని ఆత్మీయతా, పాప అనే నా పలకరింపులోని ప్రేమ పూరిత స్పందనా అప్పటికీ... ఇప్పటికీ... ఎప్పటికీ సుస్థిరం.. సుస్థిరం.. సుస్థిరం.
- డా||కె.వి. కృష్ణకుమారి