Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయి కెరీర్ పరంగా నష్టపోయారు. అయితే వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిభ ఉన్నా, ఉన్నత స్థానాల్లో ఉన్నా.. పురుషాధిపత్యం, లింగ అసమానతలు మహిళల కెరీర్‌కు మధ్యలోనే గండి కొడుతున్నాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకోవడానికి కొన్ని మార్గాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. కరోనా సంక్షోభాన్ని, ఇతర ప్రతికూలతల్ని ఎదిరించి మనం కెరీర్లో అభివద్ధి సాధించాలంటే అందుకు కొన్ని వ్యూహాలు రచించాలని అంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
కొత్త ఉద్యోగం వెతుక్కోవాలన్నా, వేరే జాబ్‌లోకి మారాలన్నా.. అందుకోసం ముందుగా మనం చేయాల్సింది దరఖాస్తు చేసుకోవడం. మరి, అప్లై చేయాలంటే సదరు కంపెనీకి సంబంధించిన జాబ్ అప్లికేషన్ ఫారమ్ నింపడమే కాదు.. మనలోని నైపుణ్యాలతో కూడిన రెజ్యూమ్‌ను కూడా దీనికి అనుసంధానించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మన పనితనం గురించి కూడా వారికి తెలియాలి. ఈ విషయంలో కీలక పాత్ర కవర్ లెటర్దే అంటున్నారు నిపుణులు. ఇది ఎంత ఆకర్షణీయంగా రూపొందిస్తే సదరు కంపెనీలో ఉద్యోగావకాశాలు అంతలా మెరుగుపడతాయంటున్నారు. అందుకే అభ్యర్థి తన గురించి క్లుప్తంగా వివరిస్తూ, తనలోని నైపుణ్యాలు, తనకు ఆఫర్ చేసే ఉద్యోగాన్ని తాను ఎంత సమర్థంగా నిర్వర్తించగలుగుతారు.. అనే విషయాల గురించి కూడా సంక్షిప్తంగా వివరించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే షార్ట్ అండ్ స్వీట్‌గా కవర్ లెటర్ ఉండాలంటున్నారు నిపుణులు. అయితే దీని గురించి పూర్తిగా అవగాహన లేని వారు రెజ్యూమ్, కవర్ లెటర్లను రూపొందించే విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
మిమ్మల్ని మీరు గుర్తించండి
ప్రతి ఒక్కరిలో తమకంటూ ప్రత్యేకమైన నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. అయితే చాలామంది వీటిని గుర్తించలేక లేదంటే వీటిని తేలిగ్గా తీసుకుంటూ పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి ఈ స్కిల్సే మిమ్మల్ని కెరీర్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇలా మీలోని నైపుణ్యాల్ని ప్రదర్శించడానికి మీకు మీరే బ్రాండ్ అంబాసిడర్ కావాలంటున్నారు. ఇందుకోసం ఎలాగూ సోషల్ మీడియా ఉండనే ఉంది.. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం.. ఈ దిశగానే మీరు ఓ మంచి ఫ్యాషన్ డిజైనర్ దగ్గర చేరి మీ స్కిల్స్‌కి మరింత పదును పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి.. మీరు రూపొందించిన కొత్త కొత్త డిజైన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని మరింతమందికి షేర్ చేయమని అడగొచ్చు. దాంతో పాటే మీరు వ్యాపార, ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నట్టు కూడా సందేశం పంపొచ్చు. మీరు పంపిన వాటిని చూసి డిజైనర్లు మెచ్చి మీకు వారి దగ్గర అవకాశమివ్వడం లేదంటే మీరు స్వయంగా రూపొందించిన డిజైన్లను విక్రయించడం, మీరు వారి బ్రాండ్స్‌ని అడ్వర్టైజ్ చేయడం.. ఇలా ఆలోచిస్తే బోలెడన్ని ఐడియాలొస్తాయి. ఇవన్నీ మీ కెరీర్ ఉన్నతికి సోపానాలే.
పరిచయాలు పెంచుకోండి
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో మనం కమ్యూనికేషన్‌ని ఎంతలా పెంచుకుంటే కెరీర్ పరంగా మనకు అంత ఉపయోగం అంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు ఇప్పటికే పని చేస్తోన్న సంస్థలోని సహౌద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం, ఇదివరకు పనిచేసిన కంపెనీలోని కొలీగ్స్‌తో నిరంతరం టచ్‌లో ఉండడం.. టెక్నాలజీ విషయంలో వస్తోన్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు వారితో చర్చించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం.. ఇవన్నీ ముఖ్యమే! ఇలా నలుగురితో మీరు మమేకమవడం వల్ల మార్కెట్లో ఉన్న కొత్త ఉద్యోగావకాశాల గురించి వారంతట వారే మిమ్మల్ని సంప్రదించి మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. దాంతో మంచి ఉద్యోగావకాశాల్ని అందుకుంటూ, కొత్త కొత్త నైపుణ్యాల్ని అలవర్చుకుంటూ కెరీర్లో ఉన్నతి సాధించచ్చు.
సవాళ్లను స్వీకరించాలి
సాధారణంగా పైఅధికారులు ఏదైనా పని చెప్పినప్పుడు అది మన వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తాం.. తటపటాయిస్తూనే చేస్తామనో లేదంటో మా వల్ల కాదనో చెబుతాం.. కానీ నిజానికి ఆ పని మన వల్ల సాధ్యమైనా కాకపోయినా ఇలాంటి సవాళ్లు స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే కెరీర్లో అభివద్ధి సాధ్యమంటున్నారు. ఇలా మనం ప్రతి విషయంలో చూపించే ఉత్సాహం ఒక్కోసారి అసాధ్యమనుకున్న పనిని కూడా సాధ్యమయ్యేలా చేస్తుంది. అంతేకాదు.. పనిలో ఇలాంటి చురుకుదనం ఉన్న వారికే సంస్థలు ఓటేస్తాయని, పదోన్నతులు-ఇతర సౌకర్యాల విషయంలో వారికే అధిక ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. అందుకే సవాళ్లనే సవాల్ చేయడమనేది కెరీర్ ఉన్నతికి ఓ సూచికగా భావించాలంటున్నారు. ఇది మనకు వత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగా మనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది.
గర్వం పనికిరాదు
ఉద్యోగంలో పదోన్నతి వచ్చినా, ప్రస్తుతం ఉన్న ఉద్యోగం కంటే గొప్ప అవకాశం వచ్చినా.. ఇక మమ్మల్ని మించిన వారు లేరనుకోవడం చాలామందిలో ఉండే గుణం. అయితే కెరీర్ విషయంలో ఇలాంటి గర్వం పనికిరాదంటున్నారు నిపుణులు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, ఎంత తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకోవడం.. ఈ రెండూ మనల్ని వత్తిపరంగా మరింత ముందుకెళ్లేలా చేస్తాయి. అందుకే ఓ గైడ్‌ను నియమించుకొని.. వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మరీ మంచిదట.