Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోతుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..
కాఫీలో జుట్టు రంగును మార్చే గుణం కూడా ఉంది. కాఫీ మంచి డైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీన్ని తరచూ వాడడం వల్ల జుట్టు నల్లగా మారడం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. దీనికోసం ముందుగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ (ముదురు రంగులో ఉన్నది, ఎలాంటి ఫ్లేవర్స్ కలపనిది) తీసుకొని దానికి 150 మిల్లీలీటర్ల నీళ్లు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముదురు రంగు వచ్చే వరకూ స్టౌ మీద మరిగించుకోవాలి. దాన్ని చల్లార్చి జుట్టుకు పట్టించుకోవాలి. 45 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.
ఎన్నో రకాల హెయిర్డైలలో ఉసిరిని ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు. జుట్టును నల్లగా మార్చేందుకు ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జుట్టు తెల్లబడే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో పాటు జుట్టును ఒత్తుగానూ మార్చుతుంది. కాస్త ఉసిరి పొడిని తీసుకొని దాన్ని కొబ్బరి నూనెలో కలిపి కొద్దిగా వేడిచేసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు రాసుకొని అరగంట పాటు ఉంచుకొని చల్లని నీటితో తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా మారుతుంది.
మనం కూరలు వండినప్పుడు ఆలూ తొక్కను చెక్కేసి లోపలి భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. అయితే ఈ తొక్కలు సహజసిద్ధమైన రంగుని అందించేందుకు ఎంతో తోడ్పడతాయి. ఆలూను తొక్కలు తీసుకొని వాటిని రెండు కప్పుల నీటిలో వేసి ఉడికించుకోవాలి. పది నిమిషాలు, పావుగంట ఉడికిన తర్వాత నీటిని వడకట్టుకోవాలి. ఈ ద్రావణాన్ని జుట్టుకు అప్త్లె చేసి అరగంట పాటు ఉంచుకోవాలి. ఆపై నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే ఈ నీటిలో పెరుగు కలుపుకొని మాస్క్లాగా చేసుకొని ఉపయోగించుకున్నా ఫలితం ఉంటుంది.
నెయ్యి.. చాలామందికి ఈ పేరు చెప్పగానే నోరూరిపోతుంది. ఆహారపదార్థాలకు రుచిని అందించడానికి మాత్రమే కాదు.. నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. నెయ్యి వేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడంలోనూ నెయ్యి తన వంతు పాత్ర పోషిస్తుంది. జుట్టు నల్లబడడంలోనూ నెయ్యి పాత్ర చెప్పదగినదే.. నెయ్యిని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారడమే కాదు.. మెరుస్తూ కనిపిస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఆవు నెయ్యితో మన తలను చక్కగా మసాజ్ చేసుకొని ఓ గంట ఆగి తలస్నానం చేయడమే.. ఇలా కనీసం వారానికి రెండుసార్లయినా చేస్తే మంచి ఫలితాలుంటాయి.