Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ వయసు వారైనా వర్కవుట్స్‌ను ఎంచుకోవచ్చు. అయితే యాభై పైబడిన వారు తేలికైన వాటిని ఎంచుకోవాలి. ప్రతి రోజూ నియమిత సమయాన్ని కేటాయించుకుని చేసే వ్యాయామాలకు శరీరం స్పందిస్తుంది. ఇది ఫిట్నెస్ను పెంచడమే కాకుండా, అనారోగ్యాలను దరికి చేరకుండా చేస్తుంది. కొత్తగా వర్కవుట్స్‌ను ప్రారంభించిన వారు మొదట తక్కువ సమయం నుంచి మొదలుపెట్టి, క్రమేపీ పెంచుకుంటూ వెళ్లాలి. లేదంటే ఒకేసారి కండరాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురై మరుసటి రోజుకి శరీరం మొరాయిస్తుంది. ప్రతిరోజు అరగంట సేపు చేసే యోగా శరీరాన్నీ, మనసునూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
20 నుంచి 30 ఏండ్లలోపు మహిళలు ఆరుబయట వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటివి ఎంచుకోవాలి. ఇవి శరీరమంతటికీ వ్యాయామాన్ని అందిస్తాయి. ప్రతి కండరంలో రక్తప్రసరణ బాగా జరిగి, బలోపేతమవుతాయి. అలాగే పరుగు, ఈత, సైక్లింగ్, వేగంగా నడవడం, తాడాట వంటివన్నీ ఈ వయసు వారికి సరైనవి. వారంలో కనీసం ఆరు రోజులు వ్యాయామం చేయగలిగితే చాలు. వీటితోపాటు నృత్యం, మార్షల్ఆర్ట్స్ వంటివి ఫిట్‌గా ఉంచుతాయి. బరువులెత్తడం కూడా మంచి ఎంపిక.
సైక్లింగ్, మారథాన్‌తోపాటు ట్రెక్కింగ్ కండరాలను బలోపేతం చేస్తాయి. 40 ఏండ్లలోపు వారికి సరిపోయే వ్యాయామాలివి. హృద్రోగాలకు దూరంగా ఉంచుతాయి. వర్కవుట్స్‌తోపాటు ఖాళీ సమయాల్లో వీటిని ఎంచుకుంటే మంచిది. 50 ఏండ్లకు కండరాలు, ఎముకల్లో శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. మెనోపాజ్ కారణంగా ఎముకల సాంద్రత కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే తుంటి భాగంతోపాటు ఎముకలను బలోపేతం చేసే వ్యాయామాలను ఎంచుకోవాలి. వారంలో అయిదురోజులు అరగంటసేపు నడవాలి. ఒకేచోట ఎక్కువ సమయం కూర్చోకుండా అప్పుడప్పుడు నాలుగు అడుగులు వేయడం, శరీరానికి సరిపడే నీటిని తీసుకోవడం వంటి జాగ్రత్తలు 60లో పడినా ఆరోగ్యంగానే ఉంచుతాయి.