Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇలా మిత్రా... అత్యంత ప్రతిభావంతులైన అథ్లెట్. 1940 ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించినా ఆ నాటి పరిస్థితుల రీత్యా పాల్గొనలేకపోయారు. ఆ తర్వాత బెంగాల్లో జరిగిన ప్రసిద్ధ తెభాగా రైతుల తిరుగుబాటులో చేరి జైలు శిక్ష అనుభవించారు. తీవ్రమైన చిత్రహింసలకు గురైనా ఓ అథ్లెట్‌గా తాను తీసుకున్న శిక్షణే తనను మళ్ళీ శారీరకంగా, మానసికంగా దృఢం చేసిందని ప్రకటించుకున్న ఆమె గురించి నేటి మానవిలో...
1940లో హెల్సింకి 12వ వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. మరోపక్క యూరోప్ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నాగేంద్రనాథ్ సేన్ తన 15 ఏండ్ల కుమార్తె ఇలాను ఒలింపిక్స్ కోసం ఎంపికైనట్టు వలస పరిపాలకుల ద్వారా వార్తలు అందుకున్నారు. ఆమె అప్పట్లో బ్రిటిష్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1937 నుండి ఇలా కలకత్తాలోని బెంగాలీ, ఇంగ్లీష్ వార్తాపత్రికల స్పోర్ట్స్ పేజీలలో నిత్యం కనిపిస్తూండేవారు.
తండ్రి ప్రోత్సాహంతో...
సేన్ ఆరుగురు పిల్లలలో ఇలా పెద్దది. సేన్ తన కుమార్తెను క్రీడల్లో ఎంతో ప్రోత్సహించేవారు. ఈత ప్రాక్టీస్‌కి, అనేక పోటీలకు దగ్గరుండి తీసుకుపోయేవారు. కుమార్తె గురించి వచ్చిన వార్తా కథనాలను కత్తిరించి దాచిపెట్టేవారు. 1938లో బెంగాలీ జర్నల్ సచిత్ర ద్వారా 13 ఏండ్ల ఇలా సీనియర్ క్రీడాకారుల కోల్లెజ్‌లో బ్రిటీష్ ఇండియన్ హాకీ జట్టులో, టిబెట్‌కు పర్వతారోహకురాలిగా, 10 మైళ్ల నడక ఛాంపియన్‌గా ఉన్నట్టు తెలుసుకోవచ్చు. బెంగాల్ ప్రెసిడెన్సీలో అత్యుత్తమ అథ్లెట్లలో ఓ అమ్మాయి నిలిచారు. అప్పట్లోనే 47 ట్రోఫీలను గెలుచుకున్నారు.
అధికారిక ప్రకటన లేదు
పెండ్లి తర్వాత ఇలా... ఇలా మిత్రగా మారిపోయారు. ఇంటి పేరుగా మారినప్పుడు అనేక స్థానిక వార్తాపత్రికలు, పత్రికలు ఆమెను ఒలింపిక్స్ నుండి పిలుపు అందుకున్న మొదటి బెంగాలీ మహిళగా వర్ణించాయి. అయితే దీని గురించి ప్రభుత్వం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. బహుశా రెండవ ప్రపంచ యుద్ధ సమయం కావడంతో ఒలింపిక్స్ రద్దు చేయబడతాయని ప్రభుత్వం ప్రకటించి ఉండొకపొవచ్చు.
భయంకరమైన కరువు
1940 బెంగాల్‌కు వినాశకరమైన దశాబ్దం. ఓ వైపు ఆహార కొరత మరోవైపు పెరుగుతున్న ధరలు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం రెండవ ప్రపంచ యుద్ధం కోసం సిద్ధమవుతోంది. 1942 శీతాకాలంలో భయంకరమైన తుఫాను మేడినిపూర్ జిల్లాను అతలాకుతలం చేసింది. తుఫాను, యుద్ధం కలిసి వినాశకరమైన ఆహార కొరతను రేకెత్తించాయి. 1943-44 లోని కరువులో అధికారిక లెక్కల ప్రకారం 30 లక్షల మంది మరణించారు. బెంగాల్ కరువు వినాశనం 1940లో చాలా మంది రాజకీయ జీవితాన్ని రూపొందించింది. వారిలో ఇలా కూడా ఒకరు.
పాఠశాలే కారణం
1942లో ఇలా బెథూన్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలయ్యారు. బెథూన్ కాలేజీలో బెంగాలీలో బ్యాచిలర్ డిగ్రీ కోసం చేరారు. బెథూన్ అనేది ఆనాటి మహిళా సంస్థ. ఇది బెంగాలీ సంస్కర్త ఈశ్వర్ చంద్ర బాంద్యోపాధ్యాయ (విద్యాసాగర్) ద్వారా నిర్వహించబడింది. అతను బాలికల విద్య, వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల రద్దును సమర్థించాడు. ఇలా అప్పట్లో అసాధారణమైన పనులు ఏమైనా చేస్తే దానికి కారణం ఆమె చదువుకున్న పాఠశాల.
మహిళల భాగస్వామ్యం
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సిపిఐ) 'మహిళా ఆత్మ రక్షా సమితి' 1942లో స్థాపించబడింది. మొదట్లో ఇది మహిళల అక్రమ రవాణా నుండి రక్షణ కల్పించడం కోసం ఏర్పడి తర్వాత కాలంలో ఆత్మ రక్ష (స్వీయ రక్షణ) ఆలోచన, ఆకలి, పేదరికం, హింసకు విస్తరించబడింది. ఎంఏఆర్ఎస్ సహాయక చర్యల కోసం బెంగాల్ అంతటా ప్రయాణించేది. మహిళలను రక్షించడానికి రాత్రిపూట జాగరూకతతో నిలబడింది. ఆకలితో ఉన్నవారిని పోషించడానికి లంగాఖానాలు (కమ్యూనిటీ కిచెన్స్) ఏర్పాటు చేయడం, వ్యక్తిగత హక్కులు, సమాజ చర్యలపై వాదించడం వీరి పని. ఆధునిక భారతదేశంలో బహుశా మొదటిసారిగా మహిళలు ప్రజా సహాయక కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యారు.
రాజకీయ నేపధ్యంతో...
1944లో ఇలా తండ్రి కుమార్తెకు కాబోయే వరుడి కోసం రామచంద్రపూర్హాట్లో జమీందారీ కుటుంబ కుమారుడైన రామేంద్రనాథ్ మిత్రాను కలవడానికి వెళ్లారు. అతను సిపిఐ కార్యకర్తగా మారి ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇలా వరుడి రాజకీయ నేపధ్యం కారణంగా అతనితో వివాహానికి అంగీకరించింది.
తెభాగ రైతు ఉద్యమంలో
ఇలా, రామేంద్రనాథ్ రైతు కౌలుదారులతో కలిసి పని మొదలుపెట్టారు. భూస్వాములకు పంటలో సగం కాకుండా మూడింట ఒక వంతు చెల్లించడానికి వారిని సమీకరించారు. ఇది తెభాగ (మూడింట ఒక వంతు) ఉద్యమ ప్రధాన డిమాండ్. రైతుల వాటాను పెంచడం వారిని పేదరికం, ఆకలి నుండి రక్షించడం వారి లక్ష్యం. ఆ సమయంలో కరువు జ్ఞాపకం స్పష్టంగా ఉంది. మిత్రులు చాలామంది రైతులకు మద్దతు ఇచ్చారు. కానీ ఇతర జమీందార్లు ఉద్యమాన్ని అణిచివేయాలని కొత్త పరిపాలనపై ఒత్తిడి చేశారు. ఈ జంట పని చేయడానికి, అరెస్టు నుండి తప్పించుకోవడానికి రైతుల మధ్య నివసించేవారు. జనవరి 5, 1950న నాచోల్లో పోలీసుల దాడిలో నలుగురు పోలీసులు చనిపోయారు. ఈ కేసు నుండి బయటపడేందుకు ఇలా రైతు సహచరులతో కలిసి శాంతల్ వేషం ధరించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. నాచోల్ రైల్వే స్టేషన్లో పోలీసులు ఇలా చేతి గడియారాన్ని గుర్తించి నలుగురు అరెస్టు చేశారు.
ఘోరమైన చిత్రహింసలు
నాచోల్ జైల్లో ఐలాను ఒంటరి గదిలో నగంగా ఉంచారు. ఆహారం, నీరు ఇవ్వలేదు. రాత్రి సబ్-ఇన్స్పెక్టర్, ఇతర పోలీసులు ఆమె సెల్‌లోకి ప్రవేశించి వారి రైఫిల్స్‌తో ఆమె తలపై కొట్టారు. ఆమె ముక్కు, తల నుండి రక్తస్రావం. ఆ రాత్రి తర్వాత ఆమెను వారి వ్యక్తిగత క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె కాళ్లు రెండు లాఠీల మధ్య నలిగిపోయాయి. నోటి చుట్టూ రుమాలు కట్టేశారు. తర్వాత పోలీసులు మళ్ళీ ఆమెను సెల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ వేచి ఉన్నాడు. అతను తాజాగా ఉడికించిన నాలుగు గుడ్లను ఆర్డర్ చేశాడు. ''ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది'' అని అతను చెప్పాడు. గుడ్లు వచ్చేటప్పటికి నలుగురు పోలీసులు ఆమెను నేలమీద ఉంచారు. వారిలో ఒకరు వేడి గుడ్డును ఆమె యోని లోపలికి తోసేశారు. ఇలా స్పృహ కోల్పోయింది. మేల్కొన్న తర్వాత ఎస్ఐ సహోద్యోగులు ఆమెను కడుపులో తన్నారు. కుడి చీలమండను గోరుతో పొడిచారు. తర్వాత ఐదుగురు వ్యక్తులు ఆమెను పట్టుకున్నారు. ఓ పోలీసు ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె మళ్లీ స్పృహ కోల్పోయింది. జ్వరంతో కాలిపోతున్న ఇలాను నవాబ్‌గంజ్ జైలుకు తీసుకెళ్లే ముందు ఇది నాలుగు రోజుల పాటు కొనసాగింది. అక్కడి జైలు వార్డెన్ ఓ.సి. రెహమాన్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆమె బ్యాచ్‌మేట్. కరువు ఉపశమన తీవ్రమైన రోజులలో వారు కలుసుకున్నారు. అతను డాక్టర్ కోసం ఏర్పాటు చేశాడు. ఆమె 105 డిగ్రీల జ్వరంతో ఇబ్బంది పడుతుంది. తర్వాత తాను నిర్బంధ హింస నుండి బయటపడ్డానని, అథ్లెట్‌గా శిక్షణ పొందినందున 1956 నాటికి మళ్లీ నడవగలిగానని చెప్పారు. జీవితాంతం ఆ హింస ఆమెను కొద్దిగా కుంగదీసిందనే చెప్పాలి.
బహిరంగా వివరించి...
జనవరి 1951లో ఇలా రాజ్షాహి కోర్టులో తనపై జరిగిన లైంగిక దాడిని బహిరంగంగా వివరించించారు. తనపై జరిగిన దాడిని బయటకు చెప్పిన మొదటి మహిళ ఇలా అయ్యారు. తూర్పు బెంగాల్ పౌరులు ఆమె జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేశారు. సరిహద్దు వెంబడి ఉన్న బెంగాలీ కవులు, పశ్చిమ బెంగాల్లో సుభాస్ ముఖర్జీ, తూర్పు బెంగాల్లో గులాం ఖుద్దూలు ఆమె గౌరవార్థం కవితలు రాశారు. సాక్ష్యం లేనందున ఇలా హత్యకు పాల్పడినట్టు నిర్ధారించబడలేదు. కానీ నలుగురు పోలీసుల మరణానికి దారితీసిన హింసకు ఏడేండ్లు జైలు శిక్ష విధించారు. 1953లో ఇలా ఆరోగ్యం బాగా క్షీణించడంతో చనిపోతుందని భావించి పోలీసులు ఆమెను ఢాకా ఆసుపత్రికి తరలించారు. 1954లో చికిత్స కోసం కలకత్తాకు తిరిగి రావడానికి ఆమెకు పెరోల్ దొరికింది.
ఎమ్మెల్యేగా ఎన్నికై...
కలకత్తాలో ఆమె ఒకరి సహాయంతో నడవగలుగుతున్న సమయంలో 1956లో ఆసుపత్రి నుండి విడుదలైంది. 1962 నాటికి దృఢ సంకల్పం, రోజువారీ వ్యాయామంతో ఇలా తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. శివనాథ్ శాస్త్రి కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. అలాగే మణిక్తల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె 1977 వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1950-1960లలో ఖాద్య ఆందోళన్‌లో శక్తివంతంగా పాల్గొన్న ఆమె 2002 అక్టోబర్ 13న తన తుదిశ్వాస విడిచారు. తన జీవితంలో ఒలింపిక్స్ తప్పిపోయినా ఇలా మిత్రా ఆదర్శ వంతమైన జీవితాన్ని గడిపారు. సరిహద్దుకు ఇరువైపులా బెంగాల్ పౌరుల గౌరవం కోసం, రైతుల కోసం పనిచేసిన ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.
- సలీమ