Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో మనం తీసుకునే ముందు జాగ్రత్తలే మనల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి కాపాడతాయి. దీనిలో భాగంగానే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వర్షకాలంలో మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని చిరుజబ్బులు జలుబు, గొంతు బొంగురపోవడం, దగ్గు, ముక్కుదిబ్బడ మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. మరి ఇలాంటి సమస్యలను నివారించుకోవడానికి కొన్ని రకాల సూప్‌లు ట్రై చేయవచ్చు. మరి ఆ సూప్‌లు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం...
అల్లం క్యారెట్ సూప్
కావల్సిన పదార్థాలు: క్యారెట్లు- పెద్దవి రెండు, ఉల్లిగడ్డ -ఒకటి, అల్లం తురుము - రెండు టీ స్పూన్లు, ఆలివ్ నూనె- చెంచా, నీళ్లు- రెండు కప్పులు, మిరియాల పొడి- తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డను కూడా సన్నగా తరగాలి. తర్వాత పాన్ పొయ్యి మీద పెట్టి అందులో చెంచా ఆలివ్‌నూనె వేసి వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించు కోవాలి. అవి వేగాక అల్లం తరుగు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి తిప్పి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత కప్పు నీళ్లు పోసి స్టౌ సిమ్‌లో పెట్టి మూత పెట్టాలి. కొన్ని నిమిషాలకి క్యారెట్ ఉడికాక పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక ఓ అరకప్పు నీళ్లు కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేయాలి. ఆ తర్వాత మరో అరకప్పు నీళ్లు కలిపి పాన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి మిరియాల పొడి చల్లాలి. కాసేపు స్టౌవ్ మీద ఉంచి తిప్పి దించేస్తే సరి.
గుమ్మడి కాయ సూప్
కావల్సిన పదార్థాలు: గుమ్మడి కాయ- చిన్నది, ఉల్లిగడ్డ- ఒకటి, వెల్లుల్లి- నాలుగు రెబ్బలు, నీళ్లు- రెండు కప్పులు, వెన్న - రెండు చెంచాలు, ఎండబెట్టిన తులసి ఆకులు- కొన్ని, మిరియాల పొడి- కొద్దిగా, ఉప్పు- రుచికి తగినంత, పంచదార- అరచెంచా,
తయారు చేసే విధానం: గుమ్మడికాయ చెక్కు తీసి సన్నగా ముక్కలు తరగాలి. ఉల్లిగడ్డను తరిగి అందులో పొట్టు తీసిన వెల్లుల్లి, గుమ్మడి కాయ ముక్కలు, కప్పు నీళ్లు పోసి కుక్కర్లో ఓ పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. కాసేపటికి ఆ మిశ్రమం చల్లబడ్డాక మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత ఓ పాన్‌లో వెన్న వేసి పొయ్యి మీద పెట్టాలి. వెన్న కరిగాక గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసి అందులో మరో కప్పు నీళ్లు తులసి ఆకులు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, పంచదార వేసి బాగా కలియతిప్పాలి. సూప్ చిక్కబడ్డాక పొయ్యి కట్టేయాలి. వేడివేడిగా సిద్ధమైన గుమ్మడి సూప్పైన తురిమిన చీజ్‌తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.
పాలకూర సూప్
కావల్సిన పదార్థాలు: పాలకూర - రెండు కట్టలు, వెన్న- చెంచా, బిర్యానీ ఆకు- రెండు, వెల్లులి తరుగు- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు-రుచికి తగినంత, సెనగపిండి- చిటికెడు, నీళ్లు- రెండు కప్పులు, జీలకర్ర పొడి- చిటికెడు, మిరియాల పొడి- రెండు టీస్పూన్లు.
తయారు చేసే విధానం: ముందుగా పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో వెన్న వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. వెన్న కరిగాక బిర్యానీ ఆకు, వెల్లుల్లి తరుగు వేయాలి. అవి కాస్త వేగాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు, మిరియాల పొడి చేర్చి మూత పెట్టాలి. కూర మగ్గిపోయాక సెనగపిండి వేసి కలియ తిప్పి రెండు కప్పుల నీళ్లు పోయాలి. కొద్దిసేపయ్యాక జీలకర్ర పొడి చేర్చాలి. రెండు నిమిషాలకి అందులోని బిర్యానీ ఆకును తీసేసి పొయ్యి కట్టేయాలి. ఆ మిశ్రమం చల్లబడ్డాక మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. అందులో మరో టీస్పూను మిరియాల పొడి, పావు కప్పు నీళ్లు కలిపి పాన్‌లో పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఓ పొంగు వచ్చే వరకూ ఉంచి మంట కట్టేయాలి. ఈ సూప్‌లో కాస్త నిమ్మ రసం కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
చికెన్ మష్రుమ్ సూప్
కావల్సిన పదార్థాలు: బోన్ లెస్ చికెన్: 250 గ్రాములు, చికెన్ స్టాక్: నాలుగు కప్పులు(చికెన్ ఉడికించిన నీళ్ళు), మష్రుమ్ - 10 (ఒక మష్రుమ్ను రెండుగా కట్ చేసుకోవాలి), అల్లం - చిన్న ముక్క(సన్నగా తరిగిపెట్టుకోవాలి), చిన్న ఉల్లికాడలు - నాలుగు (పచ్చగా ఉన్నకాడలను వేరుగా కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి - రెండు(సన్నగా తరిగిపెట్టుకోవాలి), మిరియాలు: పది (పొడి చేసుకోవాలి), తులసి - నాలుగు ఆకులు, కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగి పెట్టుకోవాలి), బటర్: ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఐదు కప్పుల నీళ్ళుపోసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత చికెన్ సూప్ నుండి చికెన్ ముక్కలను వేరుగా తీసి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కరిగిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసి ఓ సెకను ఫ్రై చేసుకోవాలి. అందులో కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఐదు నిముషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. మష్రుమ్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. మీడియం మంట మీద మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు అందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి, గ్రీన్ ఆనియన్(ఉల్లికాడల) తరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత చికెన్ ముక్కలకు కూడా వేసి బాగా కలగలిసేలా మిక్స్ చేస్తూ రెండు నిమిషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో నాలుగు కప్పుల చికెన్ స్టాక్(చికెన్ సూప్), రెండు కప్పుల నీళ్ళు పోసి, ఉప్పు జోడించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి మరో పది నిముషాలు అతి తక్కువ మంట మీద ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే చికెన్ అండ్ మష్రుమ్ సూప్ రెడి.