Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం కంటి సమస్యలు కామన్ అయిపోయాయి. పిల్లలకు చిన్నప్పటి నుంచి దృష్టి లోపాలు వస్తున్నాయి. దీంతో తప్పనిసరిగా కండ్లద్దాలను వాడాల్సి వస్తోంది. అయితే పిల్లలకు చిన్నప్పుడే దృష్టి లోపాలు వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు తగిలేలా ఉండకపోవడం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం.. వంటి కారణాల వల్ల పిల్లలకు చిన్నప్పుడే దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇక కొందరు పిల్లల్లో జన్యులోపం వల్ల, వంశ పారంపర్యంగా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయాలై కంటి చూపును కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్బాల్లోనూ దృష్టి లోపాలు వస్తుంటాయి. అయితే పిల్లలకు చిన్నప్పుడే కండ్లద్దాలను వాడే స్థితి రాకుండా ఉండాలంటే అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- పిల్లలకు రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను ఇవ్వాలి. వారికి దృష్టి లోపాలు చాలా వరకు పోషకాహార లోపాల వల్లనే వస్తాయి. కనుక అన్ని విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాలను వారికి రోజూ ఇవ్వాలి. ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు విటమిన్ ఎ ను అందించాల్సి ఉంటుంది. విటమిన్ ఎ ఎక్కువగా యాపిల్స్, కోడిగుడ్లు, టమాటాలు, నట్స్ వంటి ఆహారాల్లో లభిస్తుంది. అలాగే పాలను కూడా తాగించవచ్చు.
- పిల్లలు రోజూ కొంత సేపు అయినా సరే వెలుతురు లేదా ఎండలో గడిపేలా చూడాలి. ఫోన్లు, కంప్యూటర్లను ఎక్కువగా ఉపయోగించనివ్వకూడదు. అలా యూజ్ చేయాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి. ఇక టీవీలను కూడా ఎక్కువగా చూడనివ్వకూడదు.
- చదువులతోపాటు పిల్లలకు క్రీడలు కూడా అవసరమే. క్రీడల వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దృష్టి సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక పిల్లలను రోజూ కనీసం గంట సేపు అయినా ఆడుకోనివ్వాలి.
- పిల్లలకి ఓ వస్తువుగానీ, అక్షరాలుగానీ చూపించి వాటిని గుర్తించమని, చదవమని చెప్పాలి. వారు ఎంత దూరంలో ఉంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేది గమనించాలి. దీంతో వారికి దృష్టి లోపం వస్తే ముందుగానే పసిగట్టేందుకు అవకాశం ఉంటుంది.
- ఎక్కువగా కండ్లు నలపడం, కండ్లు ఎర్రగా మారడం, కండ్ల నుంచి తరచూ నీరుగారడం ఇలాంటివి ఏవైనా గమనించినట్టయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇలా చిన్నారుల కండ్లను సంరక్షించాలి. దీంతో వారికి చిన్న వయసులోనే కండ్లద్దాలను వాడే పరిస్థితి తప్పుతుంది.