Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ఒక మహమ్మారి రోగం అని మనందరం అనుకుంటున్నాం కదా! ఈ కోవిడ్ - 19 జబ్బు కూడా మిగతా అంటు వ్యాధులలాగే అంతమవుతుంది. మహమ్మారి రూపంతో ప్రపంచాన్ని భయపెట్టిన ఎన్నో జబ్బులు కాల క్రమంలో అంతమయిపోయాయి. 1346-1353ల మధ్య కాలంలో 'బ్లాక్ డెత్' అని పేరుగాంచిన 'బ్యుటోనిక్ ప్లేగ్' కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు తీసింది. కఠినమైన క్వారంటైన్‌తో, పరిశుభ్రత పాటిస్తూ ఈ వ్యాధిని నివారించారు. 20వ శతాబ్దంలో మశూచి బారినపడి 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. మానవజాతి సాధించిన అతి గొప్ప విజయం మశూచి అంతం. అలాగే కలరా వ్యాధి 1817లో అతిపెద్ద మహమ్మారిగా మారి కొన్ని లక్షల మంది ప్రాణాలు వదిలారు. కలరాకు వ్యాక్సిన్, చికిత్స ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో కలరా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. 1918లో వచ్చిన 'ఫ్లూ' జబ్బు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 5 నుంచి 10 కోట్ల మరణాలు సంభవించాయి. అదే విధంగా 1981లో తొలిసారిగా గుర్తించిన ఎయిడ్స్ జబ్బు కూడా మూడు కోట్ల మందిని బలి తీసుకుంది. మనం చెప్పుకున్న ఈ మహమ్మారులన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా అంతమయాయి. అలాగే కరోనా కూడా అంతమవుతుంది. అప్పటి దాకా మనం మాస్క్, శానిటైజర్ వాడాలి. ఇంట్లో నుంచి రాకుండా సృజనాత్మకంగా గడపుదాం.
మిరియాల ఈగ
మన చిన్నతనంలో ఒక ఈగ కథ ఉండేది. ఒక ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరేమిటో తనే మర్చిపోయింది. దాని పేరు తెలుసుకోవడానికి అన్ని జంతువులనూ అడగటం, చివరకు గుర్రం పిల్ల దగ్గరకు వెళ్ళి అడిగితే అది 'హిహి' అని నవ్విందట. అప్పుడు ఈగ ఓ గుర్తొచ్చింది ''హిహి ఈఈ ఈగ' అని తన పేరుగుర్తు తెచ్చుకొని వెళ్ళిందని మనం చదువుకున్న కథ. నేను ఈగ గురించి ఒక కవిత రాస్తున్నపుడు ''ఈగా ఈగా: నువ్వీసారి నీ పేరు మర్చిపోకు. నీవు వ్యాప్తి చేసే జబ్బులు మరిచిపో'' అని చెప్పాను. ఇంతకు ముందు ఇంటి నిండా ఈగలు ముసురుతుండేవి. ''బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత'' అనే సామెత బయట ఎంతో గొప్పగా ఉండి, ఇంట్లో ఏమీ లేని వాళ్ళ గురించి చెప్పేవారు. నేను ఈ రోజు మిరియాలతో ఈగను తయారు చేశాను. మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి రంగు సరిపోతుందని అనుకున్నాను. తర్వాత మిరియాలు ఒక మసాలా దినుసు కాబట్టి దీని గురించి వివరాలు చెప్పవచ్చని తయారు చేశాను. మిరియాల చారు, మిరియాల కషాయం అంటూ మనం ఎన్నో చేసుకుంటాం. మిరియాల మొక్క 'పైపరరేసి' కుటుంబంలో 'పూపర్' ప్రజాతికి చెందిన మొక్క. ఇది పొదలుగా పెరుగుతుంది. ఆయుర్వేదంలో దీనిని 'కృష్ణ మరీచం' అటారు. మిరియాల్లో ఉండే పిపరైన్, చావిసైన్ అనేవి ఇవి గాటుగా ఉండటానికి తోడ్పడతాయి. వంద గ్రాముల మిరియాల్లో 304 కాలరీల శక్తి లభిస్తుంది. వీటిలో 49గ్రా. పిండి పదార్థాలుంటాయి. మాంసకృత్తులు 10.5గ్రా. ఉంటాయి. మిరియాన్ని ''కింగ్ ఆఫ్ స్పైసెస్'' అంటారు. మిరియం ఘాటుగా ఉంటుంది.
పిస్తా పొట్టు ఈగ
కరోనా కాలంలో అందరూ పుష్టికరమైన ఆహారం తినాలని చెబుతున్నారు కదా! అందుకే అందరూ డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్నట్స్, అంజీర వంటి ఎన్నో డ్రైఫ్రూట్లను ఇంట్లో విరివిగా వాడుతున్నారు. మిగతా డ్రైఫ్రూట్స్‌కు తొక్కలేవీ ఉండవు కానీ పిస్తా పప్పులకు మాత్రం రెండు తొక్కలు ఉంటాయి. రెండు తొక్కల మధ్య పిస్తా పప్పు జాగ్రత్తగా ఉంటుంది. నేను ఇంట్లో పిస్తా పప్పుల్ని తిన్న తర్వాత వాటి తొక్కల్ని దాచి ఉంటాను. ఈ పొట్టుతో రోజూ కొన్ని బొమ్మలు చేస్తున్నాను. ఈరోజు ఈగ అంశంగా బొమ్మలు చేస్తున్నాను. కాబట్టి పిస్తా ఈగ తయారయింది. ఈగలు మానవులకు ఎన్నో జబ్బుల్ని కలగ జేస్తాయి. ప్రధానంగా కలరా జబ్బును వ్యాపింపజేస్తుంది. కలరా వ్యాధి 'విబ్రియో కలరే' అనే బాక్టీరియా వలన వస్తుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. సరైన సమయాలలో ట్రీట్మెంట్ జరగకపోతే రోగి మరణిస్తాడు. 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా కలరా వల్ల లక్షల మరణాలు సంభవించాయి. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రబలుతుంది. అమీబియాసిస్, గియార్డియాసిస్, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులు ఈగల వలన వ్యాప్తి చెందుతాయి. జబ్బు సోకిన వ్యక్తి మల మూత్రాలపై వాలి అక్కడ నుంచి మంచి నీరు, ఆహారపదార్థాలపై వాలడం వలన జబ్బులు సోకుతాయి. కలరా వ్యాధికి వాక్సిన్లు కనుక్కోవడంతో ప్రస్తుతం 1 శాతం మాత్రమే రోగులు ఉన్నారు. పిస్తా పొట్టుతో ఈగ బావుందా!
చింతగింజలతో
వంటింట్లో ప్రతిరోజూ చింతపండు వాడకం తప్పనిసరి. పప్పు, పచ్చడి, పప్పుచారుల్లో చింతపండును వాడతాము. చింతపండులో చింత గింజలుంటాయి. మామూలుగా పడేస్తాం. నేను ఈ గింజల్ని దాచి పెట్టి బొమ్మలు చేస్తారు. ఈ చింతగింజలతో శ్రావణ మాసంలో అధికంగా వచ్చే ఈగల్ని తయారు చేయవచ్చు. ఈగలు వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి. ఒక్కొక్క ఈగ వంద వరకు గుడ్లను పెడుతుంది. ఈగలు చాలా దూరం ప్రయాణం చేస్తుంటాయి. చెత్తకుప్పలు, మురికి కాల్వల దగ్గర ఈగలు తన గుడ్లను పెడతాయి. గుడ్లు లార్వాలుగా మారి ప్యూపాలు అయి పూర్తి ఈగగా మారడానికి ఏడు నుంచి పది రోజులు పడుతుంది. ఈగలు, దోమల జీవిత చరిత్రను అందరూ హైస్కూలు స్థాయిలోనే చదువుకుంటారు. ఒక సంవత్సర కాలంలో ఈగకు పన్నెండు తరాల పిల్లలు వచ్చేస్తాయి. ఈగలు వాటి నోటిలోనూ, కేశాల మీద, విసర్జితాలోనూ ఎన్నో పదార్థాలు ఉంటాయి. వాటిలో బాక్టీరియా ఉండడం వల్ల ఈగలు ముసిరిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. ఈగలు తీసుకొచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు ఈ ఈగల బొమ్మల్ని చేస్తున్నాను.
'పెడిగ్రీ'ఈగ
'పెడిగ్రీ' అనేది కుక్క పిల్లల ఆహారం. మనుషుల్లో పసి పిల్లలకు బలవర్ధకంగా వాడే నెస్టమ్, సెరిలాక్లకు మల్లే కుక్కలకు 'పెడిగ్రీ' అనేది బలవర్ధక ఆహారం. మేం ఈ మధ్య తెచ్చుక్నున 'సెయింట్ బెర్నార్డ్' జాతి కుక్కపిల్లకు పెట్టేందుకు ఇది తెచ్చుకుంటాయి. రాయల్ కెనైన్ వారి పెడిగ్రీ గ్రాన్యూల్స్ రకరకాల ఆకారాల్లో దొరుకుతాయి. ఎముక ఆకారంలో, త్రికోఆకారంలో, గోళాకారంలో ఉంటాయి. నేను త్రికోణాకారంలో, ముదురు గోధుమ వర్ణంలో ఉన్న కుక్కల ఆహారంతో ఈగను చేశాను. వీటి రంగు ఈగల దేహనిర్మాణానికి సరిపోతుందని చేశాను. ఈగలు 6 నుంచి 7 మిల్లిమీటర్ల పొడవు ఉంటాయి. ఈగల శరీరం కన్నా రెక్కల పొడవు ఎక్కువగా ఉంటుంది. వీటికి రెండు పెద్ద కాంపౌండు నేత్రాలు ఉంటాయి. ఈగల దృష్టి మానవుల దృష్టి కన్నా ఏడురెట్లు ఎక్కువగా ఉంటుంది. మగ ఈగల కన్నా ఆడ ఈగల రెక్కలు ఎక్కువ పొడవుగా ఉంటాయి.
చేగోడీలతో ఈగ
ఈగల వలన ఆహార పదార్థాలు కలుషితమవుతాయి కదా! ఇప్పుడు అదే ఆహార పదార్థాలతో ఈగను చేశాను. ఆమధ్య వచ్చిన ఈగ సినిమాలో ఈగ దేహ భాగాలకు రక్షణ ఏర్పాట్లు చేసినట్టు, అది పగబట్టి విలన్‌ను చంపటం బాగా చూపించారు. వీటి తల మీద ఒక జత యాంటిన్నే ఉంటాయి. ఇవి ఎప్పుడూ వాటి కాళ్ళను ఒకదాని కొకటి కలిపి రుద్దుకుంటుంటాయి. వీటి కాళ్ళ చివర చిన్న స్పాంజి ముక్కల్లాంటి నిర్మాణాలుంటాయి. ఎర్రటి కళ్ళు, మూడు జతల కాళ్ళు కలిగి ఉంటాయి. శరీరం రంగు బూడిదరంగు నుంచి నలుపురంగు దాకా మధ్యన ఉండే షేడ్స్‌లో ఉంటుంది. రెక్కలు ట్రాన్సపరెంట్గా ఉండి మొదట్లో కొద్దిగా పసుపురంగు కనిపిస్తుంది. ఈగలు పాత్రధారులుగా సాహిత్యంలో ఎన్నో కథలు. ఈసప్ కథల్లోనూ ఈగలున్నాయి. 1794లో విలియం బ్లేక్స్ ఈగల గురించి ''ద ఫ్లై'' అనే కవితను రాశాడు. ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయినట్టు నేను ఈ వ్యాం రాస్తూ ఈగ శాస్త్రీయనామం రాయడం మర్చిపోయాను. ఈగ శాస్త్రీయ నామం ''మాస్కా దోమెస్టికా''.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్