Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిశువులు ఆహారాన్ని, తల్లినీ ఒకేసారి గుర్తిస్తున్నారు. తల్లిపాలు ఒక సంపూర్ణ పోషకాహారం. పిల్లల శరీరానికే కాదు మనసుకు కూడా. అమ్మ పాలకంటే అమృతం లేదు. అమ్మ ప్రేమకు మరేదీ సాటిరాదు. పసిపాపకు తల్లిపాలు దొరకటం ప్రకృతి ఇచ్చిన వరం. అమ్మలు తాగే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందుతుంది. అందుకే తల్లిపాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆగస్టు 1వతేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నారు.
జంతువుల్లో అన్నీ కూడా పిల్లలకు పాలిచ్చే పెంచుతాయి. మానవులు కూడా క్షీరదాల విభాగంలోని వారే. క్షేమకరమైన, పౌష్టికమైన ఆహారం పసిబిడ్డలకు అందడం కష్టం కాబట్టి ప్రకృతి ఇలాంటి ఏర్పాటు చేసింది. తల్లి వద్దే పాలు దొరికేలా అపూర్వమైన ఏర్పాటు జరిగింది. శిశువుకు తగినంత నులివెచ్చని వేడితో, సులభంగా జీర్ణమయేలా బిడ్డకు ఎలా అవసరమో అలా తయారు చేయబడి ఉంటాయి. ఇంకా తల్లిపాలు తాజాగా, బాక్టీరియా, వైరస్‌లతో కలుషితం కాకుండా, ఉచితంగా, స్వచ్ఛంగా బిడ్డ నోటికి అందుతాయి. తల్లిపాల వల్ల కల్తీని నివారించవచ్చు. తల్లిపాలు తాగే వాళ్ళకు అంటువ్యాధులు రావు.
వారికి పెద్ద సవాల్
అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాటిల్ ఫీడింగ్ అనేది పిల్లల పాలిట మృత్యువుగా మారింది. అనివార్యకారణాలతో మహిళలు ఉద్యోగులుగా మారడం వల్ల బిడ్డలకు పాలు పట్టటం సమస్యగా మారింది. పొలం పనులు చేసే రైతు కూలీలు పొలం గట్టున చెట్ల కింద ఉయ్యాలలు వేసి పిల్లలను పడుకోబెట్టేవాళ్ళు బిడ్డ ఏడ్చినపుడు వచ్చి పాలు పట్టేవాళ్ళు. ఆధునిక మహిళలకు బిడ్డలకు పాలిచ్చే అవకాశం లేకుండా పోతున్నది. ఇళ్ళకు, ఆఫీసులకు మధ్య దూరాలు ఎక్కువ ఉండటం వలన మధ్యలో ఇంటికి వచ్చి పాలు పట్టే అవకాశం కూడా లేదు. దాదాపుగా నగరాల్లో మహిళలంతా ఉద్యోగులు కావడం వల్ల పిల్లల పెంపకం వాళ్ళకు అత్యంత కష్టంగా మారింది. చాలామంది ఒక్క బిడ్డకే పరిమితమవటం ఇలాంటి కష్టాల కారణంగానే జరుగుతుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు పిల్లలకు పాలు పట్టటం పెద్ద సవాల్‌గా వారి ముందు నిలబడుతున్నది. ఇప్పటికి అమ్మమ్మలు పిల్లల్ని పెంచినా తర్వాతి తరానికి వాళ్ళ అమ్మమ్మలు ఉద్యోగస్తులుగా ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో తల్లిపాలు తాగిన బిడ్డలు అరుదుగా ఉండవచ్చు. తల్లి దగ్గరే పాలు తాగి పెరిగిన వారిని అద్భుతంగా, అపురూపంగా చూసే పరిస్థితులు రావచ్చు. బహుశ భవిష్యత్తులో పసిబిడ్డలకు వచ్చే వ్యాధులు పెరగటం, మరణాల రేటు పెరగటం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితులను ఊహించే శాస్త్రవేత్తలు తల్లిపాల ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆశించారు.
కొన్ని లక్ష్యాలతో...
తల్లిపాల వారోత్సవాలు జరపాలని ఎప్పుడు, ఎలా నిర్ణయించారు అని దాని చరిత్ర తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లుహెచ్‌ఓ), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్(యుఎన్ఐసీఇఎఫ్) రెండూ కలసి తల్లిపాల గురించి తెలియజెయ్యాలనే ఆలోచనతో 1990లో ఒక మెమొరాండం సమర్పించారు. తల్లిపాల ప్రాముఖ్యతనూ, ప్రయోజనాన్నీ జనంలోకి తీసుకెళ్ళాలని ఈ రెండు సంస్థలూ భావించాయి. 1991లో ద వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏర్పడి డబ్లూహెచ్ఓ, యుఎన్ఐసీఇఎఫ్ ల లక్ష్యాలను తీర్చాలని నిర్ణయించింది. 1992 నాటికి ఒక రోజు సరిపోదని మొత్తం వారం రోజులు దీనికి కేటాయించాలనీ నిర్ణయించారు. మొదట్లో ఈ తల్లిపాల సప్తాహానికి కేవలం 70 దేశాలు మాత్రమే ముందుకొచ్చాము. ఆ తర్వాత మరి కొన్ని దేశాలు ముందుకొచ్చాయి. బాలారిష్టాలు దాటి ప్రస్తుతం నూట డెబ్బయి దేశాలతో, వారి సహకారంతో ముందుకు నడుస్తున్నది.
మార్గదర్శక సూత్రాలతో...
వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది కొన్ని మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది. తల్లిపాలు పుట్టిన బిడ్డలకు అవసరం, పుష్టికరం. కనీసం ఆరునెలల పాటు తల్లి దగ్గర పాలు తాగటం వలన బిడ్డకు శ్రేయస్కరం. తల్లిపాలు తాగటం వలన శిశువు ఎన్నో అంటువ్యాధుల నుండి రక్షింపబడుతుంది. అంతేకాక బిడ్డ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా రూపొందుతుంది. ఫలితంగా బిడ్డ తన చుట్టూ ఉన్న బాక్టీరియా నుంచి తనను తాను రక్షించుకోగల్గుతుంది. తల్లిపాలలో బిడ్డకు కావలసిన నీరు కూడా ఉంటుంది. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్లు, ఎంజైములు, తెల్లరక్తకణాలు వంటివన్నీ తల్లిపాలలో లభ్యమవుతాయి.
మదర్ మిల్క్ బ్యాంక్
తల్లి నెలలు నిండక ముందే బిడ్డకు జన్మనిచ్చినపుడు వారికి పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. బిడ్డ కూడా పాలను తల్లి రొమ్ము నుంచి పీల్చే శక్తిని కలిగి ఉండడు. ఇలాంటి సమయాల్లో తల్లి దగ్గర పాలను పిండి బిడ్డకు ఉగ్గిన్నెతో చుక్కచుక్క పోస్తారు. ఒక వేళ తల్లి దగ్గర పాలు వచ్చే పరిస్థితి లేనప్పుడు మిల్క్‌బ్యాంక్ నుంచి పాలను తెచ్చుకోమంటారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు కావలసిన పాలకోసం ''హ్యూమన్ మిల్క్ బ్యాంక్'' లను ఏర్పాటు చేశారు. ఆధునిక నగరాల్లో, దేశాల్లో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. 2005లో మొదటిసారిగా ఇంటర్నేషనల్ మిల్క్ బ్యాంకింగ్ ఇనిషియేటివ్ స్థాపించబడింది. దీనిలో 33 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. కొందరు నర్సింగ్ తల్లుల వద్ద నుచి పాలను సేకరించి భద్రపరుస్తారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల మరణాల రేటును తగ్గించడానికి బాటిల్ పాల బదులు ఇలా మిల్క్ బ్యాంక్ నుంచి తెచ్చిన పాలను తాగిస్తారు. ఏ జబ్బులూ లేని, బిడ్డకు సంబంధం లేని ఆరోగ్యవంతమైన తల్లుల నుంచి సేకరించబడిన పాలను పాశ్చరైరజేషన్ ద్వారా శుద్ధి చేసి నిలవచేస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకల్ల అవసరాన్ని ఎప్పుడో గుర్తించారు. ప్రతివారూ పాలను దానం చేసేలా కూడా ప్రోత్సహిస్తున్నారు. పల్లెటూర్లలో తల్లిపాలు సరిపోక బిడ్డ ఏడుస్తుంటే పక్కింటి తల్లి తన పాలు పట్టి సాయం చేస్తుంది. అదే సహాయం ఇప్పుడు మదర్స్ మిల్క్ బ్యాంక్(ఎంఎంబీ) చేస్తున్నది.
ముర్రుపాలు ముఖ్యం
సాధారణంగా బిడ్డ పుట్టిన గంటా రెండు గంటలలోపే పాలు తాగగలిగే సామర్ధ్యం కలిగి ఉంటాడు. ప్రసవం జరిగిన వెంటనే తల్లి దగ్గర లభించే ముర్రుపాలు బిడ్డకు పట్టడం ఆరోగ్యకరం. ముర్రుపాలల ఉండే 'కొలెస్ట్రమ్' వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుంది. ముర్రుపాలలో బాక్టీరియల్, వైరల్ యాంటీబాడీస్ ఉంటాయి. తల్లిపాలలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతుంది. డయేరియా వంటి వ్యాధులు కూడా సంక్రమించకుండా రక్షిస్తుంది. పిల్లల భావి జీవితంలో బి.పి, షుగర్, ఎథిరోస్క్లిరోసిన్, ఒబేసిటీ వంటి వ్యాధులు తల్లి పాలు తాగిన వారికి తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
బాటిల్ పాలతో నష్టం
బాటిల్ పాలు పట్టటం వల్ల తల్లికీ బిడ్డకూ ఏర్పడే అనుబంధం తక్కువగా ఉంటుంది. బాటిల్ ఫీడింగ్‌లో పాలసీసాలు, పాలపీకలు వేడి నీళ్ళల్లో స్టెరిలైజ్ చేయడం, తల్లి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఎన్నో సమస్యలుంటాయి. నీళ్ళు వేడి చేసి, పొడివేసి, పంచదార కలిపి పాలు తయారుచేసి, వాటిని బిడ్డ తాగగలిగే నులివెచ్చని పాలుగా చల్లార్చి పెట్టటం ఎంతో శ్రమతో కూడుకున్నపని. అదీ రాత్రిపూట బిడ్డకు పాలు తాగించాలంటే ఎంతో కష్టం. చాలా ప్రాంతాలలో పరిశుభ్రమైన నీరే లభించదు. నీటిని కాచి పాలు తయారు చెయ్యటం నిరక్షరాస్యులకు ఎంతో కష్టం. ఒక వేళ తెలిసినా ఎన్ని నీళ్ళకు ఎంత పొడి కలపాలి అన్న అవగాహన చాలా మందికి ఉండదు. ఒకవేళ అవగాహన ఉన్నా చాలా మంది ఉద్యోగాల్లో బిజీగా ఉండి పిల్లలను పని మనుషులకు అప్పగించేస్తున్నారు. బాటిల్ ఫీడింగ్‌లో పాల పొడులు ఎలర్జీ సమస్యలు ఎన్నో వస్తుంటాయి. చాలా మందికి సెరిలాక్ వంటి ఉగ్గులు కూడా పడక విరోచనాలు అవుతుంటాయి. పోతపాలను బిడ్డకు ఎన్ని గంటలకోసారి తాగించాలో తెలియక లేదా డాక్టర్ చెప్పిన రేషియో ప్రకారం పాలు కలిపితే బిడ్డకు అరగవు అని ఎక్కువ నీళ్ళు కలిపి తాగించేస్తుంటారు. ఫలితంగా బిడ్డ పాలు తాగుతుంటాడు కానీ బరువు పెరగడు. ఆరోగ్యంగా ఉండడు. పోతపాలు తాగిన శిశువుకు సూక్ష్య జీవుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాటిల్ ఫీడింగ్ వలన ఇన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి తల్లులు తన శిశువుకు తన పాలు ఇవ్వటానికే ఆసక్తి చూపిండండి. బాటిల్ ఫీడింగ్ వల్ల మరొక నష్టం కూడా ఉన్నది. పాలపీక రంధ్రం పెద్దదయినప్పుడు ఒకేసారి పాలు ఎక్కువగా నోట్లోకి వెళ్ళటం వల్ల ఉక్కిరి బిక్కిరై మరణించే అవకాశం ఉన్నది. అలా కాక మనం బాటిల్‌ను పట్టుకున్నప్పుడు కొద్దిగా పక్కకు జరిగి ముక్కులోకి పోయి తద్వారా ఊపిరితిత్తుల్లోనికిపోయి హఠాత్తుగా మరణం సంభవించే అవకాశం ఉన్నది. తల్లి దగ్గర పాలు తాగటం వల్ల శిశువు పీల్చినంత పాలే నోట్లోకి పోతాయి. అదనంగా పాలు నోట్లోకి వెళ్ళవు. ఒక వేళ బిడ్డ కడుపు నిండిపోతే నోట్లోంచి రొమ్మును తీసేస్తాడు. తల్లిపాలు శిశువుకు క్షేమకరం.
అవగామన అవసరం
ఆగస్టు 1వతేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరుపుతున్నారు. 'ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్' (ఐసిడిఎస్) ద్వారా దేశ వ్యాప్తంగా అమ్మ పాల వారోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మలు తాగే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందుతుంది. ఇంతటి విశిష్టత గలిగిన పాలను బిడ్డ ఎంత వయసు వచ్చే వరకు ఇవ్వాలి? రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? తల్లికి పాలు సరిపోయినంత రావాలంటే ఏం చేయాలి? ఎక్కువ కాలం బిడ్డకు పాలివ్వాలంటే తల్లి ఎలాంటి ఆహారం తినాలి? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి? ఎలా పట్టాలి? ముర్రుపాల విశిష్టత ఏమిటి? వగైనా అంశాలపై అవగాహన కల్పించటమే ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. బిడ్డ పుట్టిన గంట నుంచి ఆరునెలల వరకు బిడ్డకు తల్లి పాలు తప్ప మరేమీ ఇవ్వకూడదు. పల్లెల్లో తక్కువ వయసులో తల్లులు అయిన వారికి అవగాహనా లేమి ఉంటుంది. శిశువుకు తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి. తల్లి దగ్గర పాలు పుష్కలంగా ఉంటే రెండేళ్ళ పాటు వరకు బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. బిడ్డకు పాలు ఇచ్చేటపుడు బిడ్డ తల ఎత్తుగా పెట్టుకొని మాత్రమే పాలు పట్టాలి. అందుకే వైద్యులు బిడ్డను కూర్చున్న పొజిషన్లో ఉంచి పాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. పాలిచ్చే కాలంలో తల్లి ఆహారనియమాలు పాటించాలి. కాఫీలు, కూల్ డ్రింక్‌లు తాగటం వలన బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. వ్యాధులు రాకుండా ముర్రుపాలు జీవిత కాలం కాపాడుతాయి. తల్లులు చనుబాలు ఇవ్వడంతో రక్తస్రావం త్వరగా తగ్గుతుంది. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో తల్లి పాలవారోత్సవాలను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మపాలు బిడ్డకు రక్ష. బిడ్డకు పాలివ్వడం తల్లికి రక్ష.
తల్లికి కూడా మంచిది
తల్లిదగ్గర పాలు తాగటం వలన శిశువుకు మాత్రమే ఉపయోగాలున్నాయి అనుకుంటే పొరపాటే. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికికి కూడా భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ పాలు తాగకపోవడం వల్ల తల్లి రొమ్ముల్లో గడ్డలు ఏర్పడతాయి. వాటిని గంట రెండు గంటలకోసారి పిండి పారబొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా బిడ్డ చక్కగా పాలు తాగటం వలన తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రొమ్ముల్లో వచ్చే గడ్డలు ఎక్కువ నొప్పిని కలగజేస్తాయి. తల్లిపాల వలన తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమకరం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్
సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్, సిరిసిల్ల