Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా తల్లి అయిన మహిళలు నిద్రలేమితో బాధపడుతుంటారు. పుట్టిన బిడ్డ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించడమే ఇందుకు కారణం. ఈ నిద్రలేని రాత్రులన్నీ తమ దీర్ఘాయుష్షును తగ్గిస్తాయని బాలింతలు వాపోతుంటారు. అయితే బాలింతల బాధలో నిజముందని చెబుతున్నారు యూనివర్సిటీ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ పరిశోధకులు. ఈ అధ్యయనం స్లీప్ హెల్త్ జర్నల్లో ప్రచురితమయ్యింది.
శాస్త్రవేత్తలు మొత్తం 33 మంది తల్లులపై ఈ అధ్యయనం చేశారు. తల్లుల గర్భధారణ సమయంతో పాటు బిడ్డకు జన్మనిచ్చిన తొలి ఏడాది వరకు పరిశోధన కొనసాగించారు. రక్త నమూనాల నుంచి తల్లుల డీఎన్ఏని విశ్లేషించి వారి ''బయోలాజికల్ ఏజ్''ను గుర్తించారు. ఆరు నెలల పాటు రాత్రి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయిన తల్లుల బయోలాజికల్ ఏజ్ మూడు నుంచి ఏడు సంవత్సరాలు ఎక్కువగా కనిపించినట్టు గుర్తించారు. ఏడు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిద్రపోయిన తల్లులతో పోల్చితే వీరి బయోలాజికల్ ఏజ్ మూడు నుంచి ఏడు సంవత్సరాలు పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు.
ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే తల్లులు తెల్ల రక్తకణాలలో టెలోమీర్ల పొడవు తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడైంది. టెలోమీర్లు కుచించుపోవడం వల్ల క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మరణాల ముప్పు అధికంగా ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎదుర్కొనే నిద్రలేమి వల్ల శారీరక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుందని అధ్యయన బృంద సభ్యులు, సైకోబయాలజీ ప్రొఫెసర్ జుడిత్ కారోల్ చెప్పారు.
ఒక గంట ఎక్కువగా నిద్రపోయిన బాలింతలలో బయోలాజికల్ ఏజ్ తగ్గిందని తాము కనుగొన్నట్టు సైకోన్యూరో ఇమ్యునాలజీ శాస్త్రవేత్త కారోల్ వెల్లడించారు. వ్యాయామం, పోషకాహారం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని ఇతర స్లీప్ సైంటిస్టులు కూడా పరిగణించారని చెప్పారు.
ఈ అధ్యయనంలో 23-45 సంవత్సరాల వయసు ఉన్న తల్లులు పాల్గొన్నారు. వారంతా బిడ్డలకు జన్మనిచ్చిన ఆరు నెలల తర్వాత అధ్యయనంలో పాల్గొన్నారు. అయితే తాము కేవలం చాలా తక్కువ మంది మహిళలపై అధ్యయనం చేశామని.. దీర్ఘకాలిక ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెప్పారు. నిద్రలేమికి ఏ ఇతర కారకాలు దారితీస్తాయి? జీవసంబంధమైన వృద్ధాప్య ప్రభావాలు శాశ్వతమా లేదా వాటి ప్రభావాల నుంచి బయటపడొచ్చా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం మరిన్ని అధ్యయనాలు చేయాలని పరిశోధకులు చెప్పుకొచ్చారు.