Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయం సాధించడమే అంతిమ లక్ష్యం కావాలి. దీనికి ఓ సజీవ నిదర్శనం మోక్షిల్ గార్మెంట్స్ వ్యవస్థాపకురాలు రేఖా భార్గవి. తెలంగాణలో హర్ అండ్ నౌ ప్రాజెక్టుతో అనుబంధంగా ఉన్న ఎంట్రప్రెన్యూయర్లలో ఆమె ఒకరు. కృషి, పట్టుదలతో ఎంట్రప్రెన్యూర్‌గా మారిన ఈ హౌం ప్రెన్యూర్ స్ఫూర్తిదాయక విజయ గాథను మనమూ తెలుసుకుందాం...
భారతదేశంలో కొనసాగుతున్న 'ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ అండ్ స్టార్ట్ అప్స్ టై ఉమెన్ (హర్ అండ్ నౌ) ప్రాజెక్టును జర్మనీ కేంద్ర ప్రభుత్వ ఎకనామీక్ కో ఆపరేషన్ అండ్ డెవలెప్మెంట్ (బీఎం జెడ్) తరపున భారత ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ భాగస్వామ్యంతో అమలు చేస్తున్నది. తెలంగాణలో ఈ ప్రాజెక్ట్ వి హబ్ భాగస్వామ్యంతో నడుస్తోంది.
ఆన్లైన్ రిటెయిలింగ్లో
హర్ అండ్ నౌ ప్రోగ్రామ్‌లో చేరిన తర్వాత పెరిగిన అవగాహనతో రేఖ ఇప్పుడు తన వ్యాపార కార్యకలాపాల స్థాయిని పెంచాలని భావిస్తున్నారు. మరింత పెద్ద మెషినరీ సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు. తయారీ కేంద్రంలో ఉత్పత్తి అధికం చేయాలని సంకల్పించారు. ఆరు నెలల్లో ఆమె ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ ద్వారా ఆన్లైన్ రిటెయిలింగ్లో తన ఉత్పాదనలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
ఇల్లే ఆమె ప్రపంచం
ఖమ్మంజిల్లాకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు రేఖ. అనివార్య కారణాల వల్ల పదో తరగతి తర్వాత చదువు ఆపేశారు. చిన్న వయసులోనే వివాహమైంది. పెండ్లి తర్వాత ఏడేండ్ల వరకు ఇంటికే పరిమితమయ్యారు. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. అప్పటి వరకు భర్త, తల్లి, కొడుకు మాత్రమే ఆమె ప్రపంచంగా ఉండేవారు. అలాంటి సమయంలోనే ఏదైనా చేయాలనే తపన కూడా ఆమెలో పెరిగిపెద్దదైపోయింది. 2018లో ఆమె తన భర్తతో కలసి స్థానికంగా బ్రాడ్ బాండ్ కనెక్షన్లు ఇచ్చే వ్యాపారం ప్రారంభించారు. అందులో పది లక్షల రూపాయల వరకు నష్టం వచ్చింది. కష్టాలు పెరిగిపోయాయి. అయినా ఆ జంట వెనకడుగువేయలేదు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో చేరారు. రేఖ తాను సైతం ఏదైనా చేయాలని భావించారు.
పర్యావరణ పరిరక్షణకు
అప్పటికే రేఖ స్థానిక సహాయక బృందంతో అనుబంధం కలిగి ఉన్నారు. అప్పట్లో ఆ బృందం ఖమ్మం జిల్లా మున్సిపల్ కమిషనర్ ఓ వర్క్ షాప్ నిర్వహించింది. దాంట్లో రేఖ పాల్గొన్నారు. జూట్‌తో పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే ఉత్పాదనలు ఎలా తయారు చేయవచ్చో నేర్చుకున్నారు. అదే వర్క్‌షాప్ బ్యాచ్‌లో ఐదుమంది ట్రైనీలను ఎంచుకొని మోక్షిల్ పేరిట చిన్నగా జూట్ ఉత్పాదనలు తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పుడది సుమారు 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల మాస్క్‌ల తయారీని కూడా అధికం చేశారు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. చేస్తున్న వ్యాపారంతో దానికి సంబంధించిన వారంతా సంతోషంగా ఉంటే, ఆ వ్యాపారం కచ్చితంగా వృద్ధి చెందుతుంది. దేశంలో స్టార్టప్ లీడర్షిప్ వ్యవస్థకు రేఖ ఓ చక్కని ఉదాహారణగా నిలిచారు.
ఎన్నో నేర్చుకున్నా
కరోనా కష్టకాలంలో హర్ అండ్ నౌ నా జీవితంలోకి ఆశారేఖ మాదిరిగా వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగం కావడం వ్యాపార కార్యకలాపాలు, మార్కెటింగ్‌లపై నా అవగాహనను గణనీయంగా పెంచింది. ఎంఎస్ఎంఇ రిజిస్ట్రేషన్ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందడం, సోషల్ మీడియా ఖాతాలు తెరవడం నుంచి సాంకేతికతను వ్యాపారం కోసం వినియోగించుకోవడం వరకు వివిధ అంశాలను అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. హర్ అండ్ నౌ కు నా ధన్యవాదాలు.
- రేఖా భార్గవి