Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత రోజుల్లో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అసలు ఎవరిలో ఎందుకు వ్యాధులు వస్తున్నాయో వైద్యులకే అంతుచిక్కడం లేదు. అలా ఉంది పరిస్థితి. అందుకు మన జీవన శైలి కూడా ఓ కారణం కావచ్చు. పూర్వపు రోజుల్లో ఇలా రకరకాల వ్యాధులు వచ్చేవి కావు. ఎప్పుడో ఓసారి జ్వరమో, జలుబో వస్తే అది కూడా ఇంట్లో ఉన్న చిట్కాలతో తగ్గిపోయేదని పెద్దలు చెప్తుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చిన్న తలనొప్పి వచ్చినా సరే వైద్యులను సంప్రదిస్తున్నాం. వేలల్లో డబ్బులను ఖర్చు చేసుకుంటున్నాం. ఇలా ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సరే ఏదో ఒక రోగం బారిన పడుతూ అనేక అవస్థలు పడుతున్నాం. విలువైన సమయంతో పాటు డబ్బులను వథా చేసుకుంటున్నాం. ఇక గర్భిణులు, బాలింతల విషయంలో అయితే చాలు మన పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వానాకాలంలో అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఇలాంటి వ్యాధులు వచ్చినపుడు ఎలా అధిగమించాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు. వానాకాలంలో తల్లులు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం...
మహమ్మారి కంగారు పెట్టిస్తున్న ప్రస్తుత పరిస్థితులు... మరోపక్క వానాకాలం... ఈ కాలంలో తరచూ వచ్చే జ్వరాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. వానాకాలంలో సర్వ సాధారణంగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఇక ఈ భయానక పరిస్థితుల్లో వ్యాధులు సులభంగా దాడి చేస్తూ ఉన్నాయి. వానాకాలంలో జ్వరం, జలుబు, శరీర ఉష్ణోగ్రతలు మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కాలంలో దోమల వ్యాప్తి కూడా జబ్బులు వచ్చేందుకు దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తల్లులు తమ ఆరోగ్య సంరక్షణ గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. వారు కేవలం పుట్టిన బిడ్డ గురించి మాత్రమే కాకుండా తమ గురించి కూడా ఆలోచించాలి.
వ్యాక్సిన్ తప్పనిసరి...
చాలా రోజుల పాటు గర్భవతులు, చిన్న పిల్లల తల్లులు వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో ప్రభుత్వాలు, వైద్యులు ఎటూ తేల్చలేదు. కానీ ప్రస్తుతం గర్భవతులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని వైద్యులు ప్రకటించారు. ప్రభుత్వం కూడా చిన్న పిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేస్తుంది. దీంతో అందరూ తల్లులు వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకునే ముందు మీ గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఇలా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల తల్లికీ, శిశువుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
డీ హైడ్రేట్ కాకుండా
వానాకాలంలో వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. దాంతో చాలా మంది మంచినీరు సరిగా తాగరు. దాంతో బాడీలో నీటి నిల్వలు తగ్గిపోతుంటాయి. అయితే అలా జరక్కుండా ఉండేందుకు తరుచూ పానీయాలు తాగుతూ బాడీని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందువల్లే గర్భిణులు, బాలింతలు పానీయాలు తీసుకోవడంలో అధిక శ్రద్ధ వహించాలి. చిన్న పిల్లలు ఉన్న తల్లులు తప్పనిసరిగా రోజులో 2.5 లీటర్ల లిక్విడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనం తీసుకునే పానీయాలలో నీరు, వేడి టీ, వేడి సూప్ లాంటివి ఉన్నా పరవాలేదు. ఇలా తీసుకోవడం వల్ల మనలో తలనొప్పి, గొంతు తడారిపోవడం లాంటి సమస్యలు రావు. ఇలా పానీయాలు తీసుకోవడం కేవలం మీకు మాత్రమే కాదు... మీ కడుపులో ఉన్న బేబీని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బేబీ చుట్టూ తగినంత ఉమ్మ నీరు ఉండేలా చేస్తుంది. కావున గర్భవతులు తమ బాడీ డీ హైడ్రేట్ కాకుండా తరచూ పానీయాలు తీసుకుంటూ ఉండాలి.
మంచి ఆహారం..
చాలామంది ఏది పడితే అది తింటూ ఉంటారు. కానీ వైద్యులు సూచించిన ప్రకారంగా తినేముందు తప్పనిసరిగా చూసుకోవాలి. మనం తినే ఆహారంలో విటమిన్లు ఏ మేర ఉన్నాయో సరి చూసుకోవడం వలన విటమిన్లు సరిగా లేకపోతే మనం విటమిన్లు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకునే వీలుంటుంది. విటమిన్ సి మనలో ఇమ్యూనిటీని పెంచేందుకు సాయపడుతుంది. శ్వాస సమస్యలతో బాధపడుతూ ఉన్నపుడు సిట్రిక్ ఆమ్లాలు ఉండే పండ్లు, జ్యూస్లు తీసుకోవడం చాలా మంచిది. మన చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన ఆహార పదార్థాలు పాడయ్యే ప్రమాదం ఉంది. కావున చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసే ముందు కూరగాయలను నీటిలో బాగా కడగండి.
వ్యాయామాలు...
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వ్యాయామాల వలనే మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడుకోవచ్చు. ఎన్ని పనులున్నా వ్యాయామాలు చేయడం మాత్రం మరిచిపోకూడదు. ప్రస్తుత భయానక పరిస్థితుల్లో వ్యాయామాలు శరీరానికి చాలా అవసరం. కసరత్తులు చేయడం వీలు కాకపోతే కనీసం వాకింగ్ చేసినా సరిపోతుంది. వాకింగ్ చేసే ముందు కొన్ని విషయాలను గమనించాలి. వాకింగ్ చేయాలని నిర్ణయించుకున్నపుడు యాంటీ స్కిడ్ ఫుట్ వేర్ను ధరించే విధంగా చూసుకోవాలి. పొడి ప్రాంతాల్లో సాధ్యమైనంత ఎక్కువ సేపు నడిచేందుకు ప్రయత్నించాలి. అలా వీలు కాకపోతే మీ ఇంటి పరిసరాల్లో కూడా శుభ్రంగా ఉంటే నడవొచ్చు.
ఇవి చాలా ముఖ్యం...
శానిటైజేషన్, మాస్కు, సోషల్ డిస్టెన్స్. ఈ కరోనా పరిస్థితుల్లో అందరూ ఈ రక్షణ సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఏదైనా సరే తినే ముందు శానిటైజర్, లేదా సబ్బుతో మీ చేతులను పరిశుభ్రంగా కడుక్కోండి. బయటకు వెళ్లే ముందు తప్పని సరిగా మాస్కు ధరించాలి. మాస్కు ధరించడం అంటే చాలా మంది ఏదో మొక్కుబడిగా ధరిస్తున్నారు. కానీ అలా కాకుండా మొత్తం నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్కును ధరించాలి. మరో విషయం భౌతిక దూరం పాటించడం. ప్రస్తుత రోజుల్లో భౌతిక దూరం అనేది చాలా ముఖ్యం. చాలా మంది ఈ నియమాన్ని పాటించకుండా మహమ్మారి వ్యాప్తి కారణమవుతున్నారు. కానీ మనం ఏదేని పని మీద బయటకు వెళ్లినపుడు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలి.