Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దాంతో ఇంట్లోనే ల్యాప్‌టాప్ ముందు సమయం గడిపేవారి సంఖ్య చాలా పెరుగుతోంది. ఆఫీస్ మీటింగ్స్, ఇతరత్రా అవసరాల కోసం ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వరుస మీటింగ్, కాల్స్, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి సంగీతం వంటివన్నీ ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా మారేలా చేశాయి. గతంలో కేవలం టీనేజర్లు, యువత మాత్రమే ఇయర్ ఫోన్స్, ఇయర్ ప్లగ్స్ ఉపయోగించేవారు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వాటిని వాడుతున్నారు. దీనికి తోడు ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగించే సమయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో వీటి వాడకం గురించి డాక్టర్లు కొన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...
ఎక్కువ సమయం వాడితే
చెవి రంధ్రాలలోకి గట్టిగా ఫిట్ అయ్యే ఇయర్ ఫోన్స్ వల్ల చెవి లోపల పొడిబారిపోవడం, చర్మం రుద్దుకుపోవడం, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎదురవుతాయి. ఇయర్ ఫోన్లు తరచూ శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ సమయం పాటు ఎక్కువ సౌండ్‌తో శబ్దాలను వినడం వల్ల వినికిడి సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ జరుగుతుంది. 90 డెసిబెల్స్ అంటే చిన్న మెషీన్ల నుంచి వచ్చే శబ్దంలాంటిది అని చెప్పుకోవచ్చు. ఇంత శబ్దం రోజులో అత్యధికంగా ఎనిమిది గంటల పాటు వినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అంత కంటే పెద్ద శబ్దాలను రోజులో కేవలం పది నుంచి పదిహేను నిమిషాలకు మించి వినకపోవడం మంచిది.
తక్కువ సౌండ్‌తో
తప్పనిసరి అవసరం లేకపోతే ఇయర్ ఫోన్స్‌ను వాడకపోవడమే మంచిది. తప్పదు అనుకుంటే ఎక్కువ సమయం పాటు వీటిని ఉపయోగించకూడదు. ఇలాంటప్పుడు కూడా ఓవర్ హెడ్ ఫోన్స్ ఉపయోగం మంచిది. ఇయర్ ప్లగ్స్ కంటే వీటి వల్ల కలిగే హాని చాలా తక్కువ. ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వ్యాపించవు. ఒకవేళ ఇయర్ ప్లగ్స్ ఉపయోగిస్తుంటే వీలైనంత తక్కువ సౌండ్‌తో వినడానికి ప్రయత్నించాలి. అంతేకాదు.. వాటి రబ్బర్ టిప్స్ ని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఆల్కహాలిక్ సొల్యూషన్ తో శుభ్రం చేసి పొడిగా అయ్యాకే ఉపయోగించాలి. వాడని సందర్భాల్లో దీన్ని శుభ్రంగా ఉన్న డబ్బాలో భద్రపర్చాలి. ఒకవేళ చెవుల్లో దురదగా అనిపిస్తే కొబ్బరి నూనెతో రుద్దుకోవాలి.
విరామం ఇవ్వండి
ఎక్కువ సేపు మీటింగ్స్ అవుతుంటే కాసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం, ఆ తర్వాత వాటిని తీసేసి మామూలుగా కాసేపు వినడం వంటివి చేయడం మంచిది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు వీలైనంతగా వాల్యూమ్ తక్కువగా ఉంచి వినడం మంచిది. వాల్యూమ్ సడన్‌గా ఒకేసారి పెంచకుండా కొద్దికొద్దిగా పెంచడం లేదా కొద్దికొద్దిగా తగ్గించాలి.