Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె మాటలు గోదావరి. ఆమె రచనలు నిశ్శబ్ద ప్రవాహాలు. ఆమె సభా నిర్వహణ హుందాతనానికి ప్రతీక. రాజ్ భవన్ నుండి రవీంద్ర భారతి దాకా ఏ కార్యక్రమమైనా ఆమె పాత్ర ఉండాల్సిందే. తాను రాయడమే కాదు వందలాదిమంది రచయిత్రులను కూడగట్టి 'అక్షరాయాన్ మహిళా రచయిత్రుల వేదిక'ను నిర్మించి ప్రోత్సహిస్తున్న అరుదైన వ్యక్తి అయినంపూడి శ్రీలక్ష్మి.
సాహితీ వేదికలకు వీరు సుప్రసిద్ధులు. కవిత్వం, కథలు, అనువాదాలు, డాక్యుమెంటరీల నిర్మాణం, సభల నిర్వహణ ఇలా విభిన్న రంగాల్లో తెలంగాణలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఒక వెలుగు అయినంపూడి శ్రీలక్ష్మి. అర్థవంతమైన మాటలకు, అర్థం-సందర్భోచితం అయిన రచనలకు ఈమె పెట్టింది పేరు.
పాజిటివ్ దృక్పథంతో...
1967 ఆగస్ట్ 15న బోధన్‌లో జన్మించిన ఈమె ఎం.ఏ., బి.ఎడ్. చేసి ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా ఉద్యోగంలో చేరారు. వీరి ఉద్యోగ జీవితంలో ఎంతోమంది సాహిత్య కారులను ఇంటర్వ్యూ చేసారు. ఎన్నో సాహితీ కార్యక్రమాలను ప్రసారం చేసిన అనుభవజ్ఞులు. కరోనా నేపథ్యంలో జాతికి భరోసానిస్తూ వీరు రాసిన 'ఏ రిటర్న్ గిఫ్ట్ టు కరోనా' కవిత మన రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ఆకర్షించింది. స్వయంగా వారు శ్రీలక్ష్మికి ఫోన్ చేసి మరీ అభినందించారు. ఒక పాజిటివ్ దృక్పథంతో సాగే వీరి రచనలు సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.
కొత్త ప్రక్రియకు శ్రీకారం
శ్రీలక్ష్మికి చిన్నతనం నుండే సాహితీ సంస్కారం అబ్బింది. పాఠశాలలో చదువుకున్న రోజుల్లోనే వార్షిక సంచికలకు సంపాదకత్వం వహించింది. 'ప్రజాశక్తి', 'యోజన' వంటి పత్రికల్లో రచనలు, సమీక్షలు చేసారు. 2001లో 'అలల వాన', 'దృక్కోణం' వంటి కవితా సంపుటాలు వెలువరించారు. 2011లో 'లైఫ్ ట చార్మినార్' వంటి దీర్ఘ కవితను రాయడం ద్వారా డాక్యూ పోయెం అనే కొత్త సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ డాక్యూ పోయెం కపిసో ఐదవ జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది.
ప్రతిభకు మెచ్చి
2012లో ఈమె రాసిన 'వెన్నెల దుఃఖం' కవితకు రంజని-కుందుర్తి పురస్కారం లభించింది. అలల వాన, దృక్కోణంలతో పాటు 'దర్వాజా మీద చందమామ', 'కవిత్వమే ఓ గెలాక్సీ' వంటి కవితా సంపుటాలు వెలువరించారు. శ్రీలక్ష్మి రాసిన 'మోనోలాగ్ ఆఫ్ ఏ వూండెడ్ హార్ట్' దీర్ఘ కవిత ఆంగ్లంలోకీ, కన్నడంలోకీ అనువాదం చేయబడింది. కవిత్వమే కాదు ఖలీల్ జిబ్రాన్ రచనలనూ అనువాదం చేసారు. 'కొత్త ప్రేమలేఖలు', 'ఇట్లు మీ కరోనా' వంటి లేఖా సాహిత్య రచనలు చేసారు. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. శ్రీలక్ష్మి రచనలను మెచ్చిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరికి 2013లో 'కీర్తి పురస్కారం' 2014లో 'ప్రతిభా పురస్కారం' అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం'ను 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసింది.
తెలుగు రచయిత్రుల కోసం
శ్రీలక్ష్మి 2019లో 'అక్షరయాన్' అనే సాహిత్య వేదికను తెలుగు రచయిత్రుల కోసం 500 మందితో స్థాపించారు. దానికి వీరే వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో భిన్నమైన కార్యక్రమాల వేదికగా వెలుగొందుతున్న ఈ సంస్థలో వేయిమందికి పైగా రచయిత్రులు సభ్యులుగా వున్నారు. ఈ సంస్థలో సుప్రసిద్ధులైన రచయిత్రులు, వర్ధమాన రచయిత్రులు, ఇప్పుడిప్పుడే రచనా రంగంలోకి ప్రవేశిస్తున్నవారూ ఉన్నారు. సంస్థ మార్గదర్శనంలో వీరంతా ఊత్సాహంతో ఉరవడిగా పరుగెడుతున్నారు. శ్రీలక్ష్మి తన రచనలే కాకుండా ఇతర రచయిత్రుల పుస్తకాలనూ అచ్చు వేయించి ప్రచారంలోకి తీసుకొస్తుంటారు అది వీరి నైజం. మహిళగా, ఇల్లాలిగా, తల్లిగా, ఉద్యోగినిగా, కవయిత్రిగా, కార్యక్రమ నిర్వాహకురాలిగా నిత్యం భిన్నమైన పాత్రలు పోషిస్తూ అందరి అభిమానాన్నీ చూరగొంటున్న అరుదైన సాహిత్య వారధి అయినంపూడి శ్రీలక్ష్మి. వీరి సాహిత్య ప్రస్థానాన్ని గమనించి తెలంగాణ సాహిత్య పరిషత్ వంటి ఉత్తమాభిరుచి, చరిత్ర కలిగిన సాహిత్య సంస్థ సుప్రసిద్ధ రచయిత్రి, పరిశోధకురాలు, ఆచార్య పాకాల యశోదారెడ్డి పేర శ్రీలక్ష్మికి ఈరోజు పురస్కార ప్రదానం చేస్తున్నారు. ఈ గౌరవాన్ని అందుకుంటున్న అయినంపూడి శ్రీలక్ష్మి మరింత ఉత్సాహంతో రచనలు చేస్తూ ఉంటారని ఆశిద్దాం.
- కోట్ల వనజాత, 8008301480