Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి వేసినప్పుడు మనం ఏదో ఒకటి తినడం కరెక్టు కాదు... మనకు ఏ ఆహారం అవసరమో అదే తినాలి. ఉదాహరణకు... శరీరంలో రక్తం సరిగా లేనివాళ్లు... క్యారెట్, బీట్రూట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడూ నీరసంగా ఉండేవాళ్లు... గుడ్లు, పాలు వంటివి తింటే మంచిది. అదే బ్యాలెన్స్డ్ డైట్ అంటే. మనకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఆహారాలేంటో తెలుసుకుందాం. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పౌష్టికాహారం కోసం మనం లక్షలకు లక్షలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. రోజువారీ తినే ఆహారంలోనే ఎక్కువ పోషకాలు, ప్రోటీన్స్ ఉన్నవి తింటే మేలు. పౌష్టికాహారం తింటే అధిక బరువు లేకుండా ఉండటమే కాదు... కండరాలు బలంగా మారతాయి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అందువల్ల ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలేంటో తెలుసుకుందాం.
పాలు: గ్లాస్ పాలలో ఎన్నో పోషకాలుంటాయి. బి గ్రూప్ విటమిన్స్ సముృద్ధిగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ లభిస్తాయి. ఉత్తినే పాలు తాగడం మీకు ఇష్టం లేకపోతే పాలలో ఫ్రూట్స్ కలుపుకొని తాగండి. ఇంట్లోనే మిల్క్ షేక్ తయారుచేసుకోండి.
గుడ్లు: బయో ప్రోటీన్స్ కావాలంటే ఎగ్స్ తినాల్సిందే. గుడ్లతో రకరకాల వంటలు వండుకోవచ్చు. ఆమ్లెట్లు వేసుకోవచ్చు. కూర రుచికరంగా చేసుకోవచ్చు. ఎగ్స్ శాండ్ విచ్ కూడా ఆరోగ్యదాయకమే. అందువల్ల రోజూ కనీసం రెండు గుడ్లు మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి.
చేపలు, చికెన్: సాల్మన్, ట్యూనా లాంటి ఖరీదైన చేపలు తింటే మంచిదే. అవి కాకపోయినా మామూలు చేపలు కూడా ప్రోటీన్స్ ఇస్తాయి. చికెన్ కూడా ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉన్నదే. చికెన్ ఓ మోతాదులో తింటే బరువు తగ్గుతారు కూడా. రెడ్ మీట్ కూడా మంచిదే కానీ అందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.
బాదం: బాదం పప్పులు బ్రెయిన్‌కి ఎంతో మేలు చేస్తాయి. ఓ గుప్పెడు బాదం పప్పులను వారం పాటూ రోజూ కొద్దికొద్దిగా తినవచ్చు. ఫలితంగా ప్రోటీన్స్ బాగా అందుతాయి. బాదం పప్పులను నీటిలో నానబెట్టి కూడా తినొచ్చు.
కూరగాయలు: తాజా కూరగాయలు కూడా రకరకాల పోషకాలు కలిగివుంటాయి. ముఖ్యంగా బ్రకోలీలో విటమిన్ కే, సీ, ఫోలిక్ యాసిడ్, పొటాషియం లభిస్తాయి. ప్రోటీన్స్ కూడా ఇందులో ఉంటాయి.
పెసరపప్పు: చాలా మంది పెసరపప్పును ఫ్రై, స్నాక్స్ రూపంలో తింటారు. అలా తింటే బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు చేరుతుంది. అది మంచిది కాదు. చక్కగా పెసరపప్పును వండుకొని తింటే ఎంతో మేలు. పెసర లడ్డూలు కూడా మేలు చేస్తాయి. అయితే పెసరపప్పు ఎక్కువగా తింటే లావు అవుతారు. కాబట్టి కొద్ది మొత్తాల్లో తీసుకుంటే... ప్రోటీన్స్ లభించడమేకాక... ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.