Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రావణ మాసం వచ్చిందంటే చాలామంది ఇంట్లో రకరకాల వంటకాలు చేస్తుంటారు. వాటిలో పాయసం కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుత కరోనా వల్ల ఏది పడితే అది తినేకాలం పోయింది. అందరం ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు వహిస్తున్నాం. వండుకునే పదార్థాలు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉండాలి కదా... అందుకే ఈసారి ఈ స్పెషల్ పాయసాలు ట్రై చేయండీ. క్యారెట్, బీట్రూట్, జామకాయ, చెరుకురసంతో చేసిన పాయసం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం...
చెరకురసంతో
కావల్సిన పదార్థాలు: చెరుకు రసం - 500 మిల్లీ.లీ, బియ్యం - పావు కప్పు, పాలు - నాలుగు టేబుల్ స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు - గుప్పెడు.
తయారు చేసే విధానం: బాండీని పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. తర్వాత వాటిని ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో చెరకు రసాన్ని పోసి వేడి చేయాలి. తర్వాత అందులో కొన్ని పాలు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో బియ్యం వేసి బాగా కలపాలి. బియ్యం మెత్తగా ఉడికేంతవరకు అంటే పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. బియ్యం ఉడికిన తర్వాత ఈ మిశ్రమంలో వేయించిన జీడిపప్పులు వేసి అలంకరించుకోవాలి. అంతే షుగర్ కేన్ పాయసం సిద్ధమైనట్టే. పాయసాన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా ఆరగిస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
జామకాయతో
కావల్సిన పదార్థాలు: జామకాయలు - మూడు, పాలు - రెండు వందల మిల్లీ లీటర్లు, బెల్లం - కప్పు, యాలకుల పొడి - కొద్దిగ, నీళ్ళు - సరిపడా, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, ఎండు ద్రాక్ష - పది లేదా పదిహేను, జీడిపప్పు - పది.
తయారు చేసే విధానం: జామకాయలపై ఉండే తొక్కను, అందులోని విత్తనాలను తీసివేయాలి. తర్వాత జామకాయను గుజ్జు వచ్చేలా చిన్నసైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత అందులో బెల్లం వేసి కరిగించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరే పాన్ తీసుకుని పొయ్యిపై పెట్టి అందులో నెయ్యి పోసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక అందులో జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఎండుద్రాక్ష కూడా వేసి నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇదే పాన్‌లో జామ గుజ్జు పేస్ట్ వేసి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా పాలు కలుపుతూ గరిటెతో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో యాలకుల పొడి, బెల్లం కలిపిన నీరు పోసి అన్ని పదార్థాలు కలిసేలా గరిటెతో కలియతిప్పాలి. ఈ మిశ్రమాన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. అంతే సర్వ్ చేసుకుని వేడివేడిగా జామ పాయసాన్ని ఆరగించవచ్చు.
బీట్రూట్తో
కావల్సిన పదార్థాలు: బీట్ రూట్ - నాలుగు, పాలు - కప్పు, చక్కర - ముప్పావు కప్పు, యాలకుల పొడి - కొద్దిగా, జీడిపప్పు - అవసరాన్ని బట్టి, నెయ్యి - కప్పు.
తయారు చేసే విధానం: పాన్ పొయ్యి మీద పెట్టుకుని అందులో నెయ్యి పోసుకుని వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ను వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ తురుమును బాండీలో వేసి బాగా కలపాలి. బాండీలో మరికొంత నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమానికి యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసి కాసేపు మీడియం మంట మీద ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పాలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించాలి. కావాలంటే అదనంగా పాలు కలుపుకోవచ్చు. బీట్రూట్ మిశ్రమం సాఫ్ట్‌గా వచ్చింది అన్నప్పుడు ఈ మిశ్రమంలో పంచదార కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి పోసి కలుపుకోవాలి. అంతే వేడి వేడి బీట్రూట్ పాయసం రెడీ. దీనిని కప్పుల్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
క్యారెట్ పాయసం
కావల్సిన పదార్థాలు: క్యారెట్ - రెండు (మీడియం సైజ్‌వి), పాలు - లీటరు, నెయ్యి - కప్పు, జీడిపప్పు - కొన్ని, ఎండు ద్రాక్ష - కొన్ని, యాలకుల పొడి - పావు స్పూను, చక్కెర - నాలుగు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం: ముందుగా క్యారెట్‌ని శుభ్రంగా కడిగి తురిమి పక్కనపెట్టాలి. ఓ పాన్ తీసుకుని అందులో నెయ్యి పోసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో జీడిపప్పులు, పిస్తాపప్పులు, ఎండు ద్రాక్షలు వేసి రెండు నిమిషాల పాటు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో క్యారెట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. క్యారెట్ బాగా వేగిన తర్వాత అందులో పాలు పోసి పది నిమిషాల వరకూ ఉడికించాలి. క్యారెట్ దగ్గరపడేవరకూ ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో చక్కెర వేసి మొత్తం కరిగేవరకూ ఉడికించాలి. అందులో నెయ్యి వేసి కలపాలి. చివరిగా డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి వేసి స్టౌ ఆపివేయాలి. ఈ పాయసం వేడిగానైనా తినేసేయొచ్చు.. ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత తినొచ్చు.