Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు స్వాతంత్య్రం సిద్ధించి స్వేచ్ఛావాయువులు పీల్చడం మొదలుపెట్టి 75 సంవత్సరాలు అయింది. స్వతంత్ర భారతంలో కార్గిల్ యుద్ధాలు, సరిహద్దు దేశాలతో రణాలు, కరోనా లాంటి వైరస్ల దండయాత్రలు ఎన్నో చూసింది. ఎంతో ధృడచిత్తంతో వచ్చిన ఆపదల్ని, సమస్యల్ని పారద్రోలిన ఘనత మన దేశానికి ఉన్నది. ఎంతో క్లిష్టపరిస్థితుల్లో కూడా అందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను పరిష్కరించుకున్నారు. భారతదేశం భిన్న మతాల దేశం. భిన్న భాషలతో ఏకతాటిపై నిలబడే భారతదేశాన్ని భయపెట్టడానికి కరోనా వైరస్ వచ్చింది. అదృశ్యరూపంలో ఉండే ఈ భయంకర శత్రువును అంతమొందించడానికి భారతీయ శాస్త్రవేత్తలు టీకాలను కనిపెట్టారు. ఈ టీకాలను ప్రజలందరూ వేసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. స్ఫూర్తివంతమైన, చైతన్యవంతమైన భావజాలం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించాలి, మాస్క్‌లు వేసుకోవడం, శానిటైజర్లు వాడటం మూలంగా కరోనా వైరస్‌ను పారద్రోలవచ్చు. ప్రస్తుతం ఈ ఆగస్టులో కరోనా థర్డ్‌వేవ్ రాబోతుందని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. రాబోయే ప్రమాదాన్ని అంచనా వేసి తగిన ఆయుధాలతో మట్టుబెట్టాలి. ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాల కోర్చి సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో అక్రమంగా, అదృశ్యంగా చొరబడిన కరోనా వైరస్‌ను అంతమొందించడమే ప్రస్తుత లక్ష్యం. అమృతోత్సవాలు ఆనందంగా జరుపుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి.
పూల భారతం
నేను భారతదేశం బొమ్మల్ని చాలా తయారు చేశాను. అందులో పూల భారతదేశం ఒకటి. ఈ సంవత్సరానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతుండడంతో అమృతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు ఇండియా మ్యాపులతో బొమ్మలు చేసుకుందాం. నేను ప్రతి ఆగస్టు 15వ తేదీ నాడు బొమ్మలు వేయడమో, ఇండియా ముగ్గులు వేయడమో, దేశభక్తి పాటలు పాడటమో, దేశభక్తి గేయాలు రాయడమో ఏదో ఒకటి చేస్తుంటాను. మా అమ్మానాన్న స్వాతంత్య్ర సమరయోధులు కావడం వలన మాకు చిన్నప్పటి నుంచీ ఆగస్ట్ 15ను పండుగలా జరపటం నేర్పించారు. దేశభక్తి భావనలు ఉగ్గుపాలతో రంగరించి పోశారు అని చెప్పవచ్చు. నేను ఒక స్వాతత్య్ర దినోత్సవం నాడు కొత్తగా ఇండియాను చెయ్యాలని నిశ్చయించి పాలపీకలతో మొదలుపెట్టాను. పాలపీకలు రంగు రంగులతో ఉండే ప్లాస్టిక్ వస్తువులు. ప్లాస్టిక్ వినయోగం కూడా జరుగుతుందని ఇంట్లోని హాల్లో పెద్దగా ఇండియా బొమ్మను వేశాను. చాలా బాగా వచ్చింది. మధ్యలో త్రివర్ణ పతాకాన్ని వేశాను. ఈ జెండాను ఇంజక్షన్ సీసాల మీద ఉండే ప్లాస్టిక్ మూతలతో చేశాను. బాగా నిండుగా అనిపించలేదు. పెరట్లో ఉన్న పచ్చగన్నేరు పూలను, బంతిపూలనూన కోసుకొచ్చాను. పచ్చగన్నేరు పూలను ఇండియా పై భాగాన అమర్చాను. బంతిపూలను విప్పి రెక్కలుగా తుంపి ఇండియా కింది భాగాన పరిచాను. ఇప్పుడు కళ్ళకింపుగా కనిపించింది. ఇలా ఆరోజు పూల భారతదేశం తయారయింది.
ఇంజక్షన్ మూతలతో
కరోనా ప్రభావంతో ఇండియాలో లాక్డౌన్ విధించబడింది. ఆ సమయంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ముందుడి కరోనాతో పోరాడారు. ఈ సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా తలవంచక కరోనా వైరస్‌తో పోరాటానికి ముందుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడారు. ఈ పరిస్థితినంతా ఒక బొమ్మలో వివరించాలని భావించాను. ఆ సందర్భంగా ఈ ఇండియా పురుడు పోసుకున్నది. ఇంజక్షన్ సీసాల మూతలతో ఇండియా బొమ్మను చేశాను. ఇండియా అవుట్‌లైన్ గీయడానికి ఎరుపు రంగు మూతల్ని వాడాను. ఎందుకంటే భారతదేశం అపాయంలో ఉందని చెప్పడానికి. ఆ తర్వాత ఇండియాకు మాస్క్ పెట్టాను. ఈ కరోనా వైరస్ కోసం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్లు, క్యాప్స్యూల్స్ ఉపయోగించాను. తర్వాత వైద్యులను చూపించడానికి స్టెతస్కోపును వేశాను. అదే విధంగా పోలీసులను రిప్రజెంట్ చేయడానికి పోలీస్ టీపీని పెట్టాను. పారిశుద్ధ్య కార్మికులను చూపడానికి చీపురును చూపించాను. స్టెతస్కోపు, టీపీ, చీపుర్లు కూడా టాబ్లెట్లతోనే తయారు చేశాను. లాక్డౌన్ సమయంలో నేను కరోనా వైరస్‌నూ, ఇండియాలో జరిగిన రకరకాల పరిణామాలనూ ఆసుపత్రి వ్యర్థాలతో తయారు చేశాను. వీటితో మా ఆసుపత్రిలో ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టి ఆసుపత్రికి వచ్చే రోగులకు అవగాహన కల్పించాను.
వెంటిలేటర్ వేస్టుతో
కరోనా వైరస్ విబృంభించి మానవులపై దాడి చేయడంతో విషమ పరిస్థితి ఎదుర్కోంది ఇండియా. ఎవ్వరికీ తెలియని వెండిలేటర్లు, ఎకోమిషన్లు అనే పరికరాల పేర్లు అందరికీ తెలిసిపోయినాయి. మా ఆసుపత్రిలో వెంటిలేటర్ మిషన్లలో వాడే ప్లాస్టిక్ గొట్టాలకు ఉండే మూతల్ని ఈ బొమ్మలో ఉపయోగించాను. ఆసుపత్రి సిబ్బందికే తెలిసిన వెంటిలేటర్లను కరోనా మామూలు జనానికి తెలియజేయడంతో నేను వాటితో బొమ్మల్ని తయారు చేసి మరింతగా జనంలోకి తీసుకురావాలనుకున్నాను. ప్లాస్టిక్ గొట్టాల మూతలతో ఇండియాను చేశాను. దీనికి జెండా రంగులను వేయాలనుకుని, ఆయా రంగుల్లో ఉన్న క్యాప్స్యూల్స్‌ను ఉపయోగించాను. ఆకుపచ్చని రంగులోని క్యాప్స్యూల్స్‌ను ఉపయోగించి జెండా కింది రంగును నింపాను. మధ్య రంగులోని తెలుపు దనాన్ని నింపడానికి ప్లాస్టిక్ మూతల్ని వాడాను. పైనున్న కాషాయ రంగుకు ఆ రంగులో ఉండే టాబ్లెట్లు, క్యాప్స్యూల్స్ పెద్దగా దొరకలేదు. అప్పుడు కింద ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఆరెంజ్ రంగులో ఉంది. కాబట్టి అదే సరిపోతుందనుకున్నాను. మధ్యలో చక్రానికి కొన్ని బులుగు రంగు ప్లాస్టిక్ మూతలు, పుల్లలు ఉపయోగించాను. సాంబ్రాణి కడ్డీలు వెలిగించాక చివర మిగిలే పుల్లలు కూడా దీనికి వాడాను. ఎలా ఉందీ భారతదేశం.
ఐస్‌క్రీం పుల్లలతో రాట్నం
గాంధీజీ రాట్నం నూలును తీసి స్వదేశీ వస్త్రాలను ధరించాలని చెప్పడమూ, విధేవీ వస్త్ర బహిష్కరణమూ స్వాతంత్య్ర సమరంలో ఎంతో ప్రధాన పాత్ర వహించిన ఘట్టాలు. మా ఇంట్లో కూడా మానాన్న టెరికాట్ ప్యాంట్లు వేసుకునేవాడల్లా ఉద్యమంలో పాల్గొన్నాక ఖాదీ బట్టలు కట్టడం మొదలుపెట్టాడు. ఆనాడు ధరించిన ఖద్దరు పంచె, లాల్చీలను ప్రాణం పోయే దాకా వదల్లేదు. అదీ దేశభక్తి అంటే. నేను ఐస్‌క్రీం పుల్లతో ఎన్నో బొమ్మలు చేశాను. కానీ ఎప్పుడూ రాట్నం చెయ్యాలనే ఐడియా రాలేదు. రెండేండ్ల కిందట స్వాతత్య్రదినోత్సవానికి నేను హైదరాబాదులో ఉండి పోవల్సి వచ్చింది. ఆ సమయంలో ఏం చేద్దామా అని ఆలోచించి ఈ రాట్నాన్ని చేశాను. ఈ అమృతోత్సవాల సమయాన స్వాతంత్య్ర సమర ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఈ బొమ్మని చేశాను.
కుంకుమతో గాంధీజీ
బ్రిటిష్ వారి బానిస సంకెళ్ళలో ఇరుక్కున్న భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవటానికి ఎన్నో ఏండ్ల సమర ఉద్యమాలు సాగించారు. 1857లో మొదటిసారిగా సిపాయిల తిరుగుబాటుతో బ్రిటిష్ వారిపై సమరం మొదలుపెట్టారు ఝాన్సీలక్ష్మీ బాయి, నేతాజీ, చాచాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్ వంటి ఎందరో వీరుల, శూరుల త్యాగఫలమే ఈనాటి మన స్వేచ్ఛా భారతం. మరి గింధీజీ తన అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలు మాత్రమే ప్రయోగించి భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించారు. మన డబ్బుల నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించి మన గౌరవాన్ని చూపాము. గాంధీజీ చూపిన ఆలోచనా పటిమ, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని చిన్నప్పటి నుంచీ పుస్తకాలలో చదువుకుంటూనే ఉన్నాం. నేను గాందీజీ చిత్రాలు ఎన్నో పెన్సిల్, పెన్నుతో వేసినా ఈసారి వెరైటీగా చెయ్యాలనుకున్నాను. మహిళలు కుంకుమను ఉపయోగించి గాంధీ చిత్రాన్ని వేశాను. ఒక ప్లేట్లో నిండుగా కుంకుమను పోసి దాని మీద ఒక పుల్లతో గాందీ చిత్రాన్ని వేశాను. అలవాటు లేక కొద్దిగా కష్టం అనిపించింది. అయినా అమృతోత్సవ వేళ గాంధీజీ లేకుండా ఎలా సంపూర్ణమౌతుంది. అందుకే ఈ గాంధీగారి చిత్రం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్