Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పన్నీర్ భోజన ప్రియులకు ఎంతో ఇష్టమైన పదార్థం. ఇక వెజిటేరియన్లకైతే మరీ ఎక్కువ. పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్, పాలక్? పన్నీర్? అబ్బబ్బో చాలా రకాలు. పన్నీర్ ను విడిగా తినొచ్చు.. కూరగాయగా కూడా తినొచ్చు. ఈ ప్రయోజనాలన్నీ నిజమైన పన్నీర్తోనే సాధ్యమవుతాయి. అదే నకిలీ పన్నీర్ తింటే మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది. పన్నీర్లో కల్తీ పన్నీర్లూ పుట్టుకొస్తున్నాయి. నకిలీ పన్నీరు తినడం వల్ల టైఫాయిడ్, అతిసారం, కామెర్లు, పుండ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు నకిలీ పనీర్ తిన్న తర్వాత కడుపు నొప్పి, తలనొప్పి, చర్మం మీద చికాకు, అజీర్ణం లాంటి సమస్యలు కూడా రావచ్చు. మరి ఇంత ప్రమాదకరమైన నకిలీ పన్నీర్‌ను గుర్తించడం ఎలాగో చూద్దాం...
పాలతో చేసే పన్నీర్: పాలతో చేసే పన్నీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పన్నీర్ ప్రోటీన్ కొవ్వు ప్రధాన వనరులలో ఒకటి. అంతేకాకుండా ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, శక్తి, క్యాల్షియం, భాస్వరం, విటమిన్ల వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కూడా పన్నీర్లో ఉన్నాయి. ఒకవైపు అనేక రకాల పోషకాలు కలిగిన నిజమైన పన్నీర్ మనకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంటే.. మరోవైపు హానికరమైన పదార్థాలను కలపడం ద్వారా తయారు చేసిన నకిలీ పన్నీర్ అనేక విధాలుగా అనారోగ్యానికి గురిచేస్తుంది. తినడం వల్ల భయంకరమైన వ్యాధులను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. అందువల్ల ఇంట్లో పన్నీర్ చేయడానికి ముందు దానిని గుర్తించడం చాలా ముఖ్యం. కానీ పన్నీరును గుర్తించడంలో అతి పెద్ద సమస్య ఏమిటంటే... నిజమైన పన్నీర్, నకిలీ పన్నీర్ చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పద్ధతులతో నకిలీ పన్నీరును గుర్తించొచ్చు.
రబ్బర్లా సాగుతుంది: జమైన పన్నీర్ మృదువుగా ఉంటుంది. అంటే.. పన్నీర్ గట్టిగా ఉంటే అది కల్తీ అయినట్టు అర్థం. నిజమైన పన్నీర్ సులువుగా తినొచ్చు. నకిలీ పన్నీర్‌ను సులభంగా తినలేం. నకిలీ పన్నీర్ తినేప్పుడు రబ్బర్ల సాగుతుంటుంది. అంతేకాకుండా నకిలీ పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు కూడా రబ్బర్లా అనిపిస్తుంది. నకిలీ పన్నీర్ పగిలిపోయినట్టు అవుతుంది. ఇమిటేషన్ పన్నీర్‌కు స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను కలిపితే ఒత్తిడి తట్టుకోలేక వెంటనే విరిగిపోతుంది. ఇక ఇంకో పద్ధతి ద్వారా కూడా నకిలీ పన్నీర్ గుర్తించవచ్చు. పన్నీర్‌ను నీటిలో మరిగించి చల్లబరచండి. చల్లారిన తర్వాత పన్నీర్ మీద రెండు మూడు చుక్కల అయోడిన్ టించర్ వేయండి. పన్నీర్ రంగు నీలం రంగులోకి మారితే అది కచ్చితంగా నకిలీ అని అర్థం చేసుకోండి.