Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువుకునే కాలేజీలో రాజుకు ఓ అమ్మాయి పరిచయమైంది. ఆమెతో ప్రేమలో పడ్డాడు. కాని ఆ అమ్మాయి ఇంట్లో వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు.పైగా బలవంతంగా వేరే పెళ్ళి చేశారు. దాంతో ప్రేమించిన అమ్మాయి రాజుకు దూరమయింది. ఆ అమ్మాయిని మర్చిపోలేక రాజు చాలా బాధపడేవారు. కొడుకు బాధను చూడలేక కమలమ్మ దిగులుపడేది. కొడుకు ఆ అమ్మాయిని మర్చిపోయి సంతోషంగా ఉండాలని కమలమ్మ చేయని ప్రయత్నమంటూ లేదు. అందుకే కొడుక్కి పెండ్లి చేయడానికి ఎన్నో సంబంధాలు చూసింది. కాని రాజు ఒప్పుకునేవాడు కాదు. కొడుకుని ఎలాగైనా ఒప్పించాలని చివరికి కమలమ్మ మొండికేసింది. చివరకు ఎలాగో ఒప్పుకున్నాడు.
కొడుకు పెండ్లికి ఒప్పుకోవడంతో వెంటనే పిల్లని వెదకడం మొదలుపెట్టింది. తెలిసిన వారి ద్వారా ఓ అమ్మాయి ఉందని తెలుసుకొని పెండ్లి చూపులు ఏర్పాటు చేసింది. రాజు అమ్మాయిని చూసి నచ్చిందని చెప్పడంతో వెంటనే ముహుర్తాలు చూసి ఘనంగా పెండ్లి చేశారు. అమ్మాయి పేరు గౌరి.
పెండ్లయిన మొదటి రోజే గౌరి మాటలకు రాజు షాకయ్యాడు. తనకు ఈ పెండ్లంటే ఇష్టం లేదని, తను వేరే అబ్బాయిని ప్రేమించానని, ఇష్టం లేకపోయినా బలవంతంగా పెండ్లి చేశారని చెప్పింది. అసలే ప్రేమించిన అమ్మాయి దక్కక బాధపడుతున్న రాజు, ఇప్పుడు పెండ్లి చేసుకున్న అమ్మాయి అలా మాట్లాడడంతో భరించలేకపోయాడు. ఆ రాత్రే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. పదిహేను రోజుల వరకు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.
తల్లిని వదిలి ఉండలేని రాజు మళ్లీ ఇంటికి చేరాడు. రాజు వచ్చిన రోజు గౌరి తండ్రి అతన్ని నిలదీశాడు. 'కొత్తగా పెండ్లయిన అమ్మాయిని అలా వదిలి వెళ్ళిపోతావా' అంటూ పంచాయితీ పెట్టాడు. రాజు అతనికి ఎంత నచ్చజెప్పినా అర్థం చేసుకోకపోవడంతో చివరికి గౌరి, తనతో అన్న మాటలన్నీ రాజు పంచాయితీ పెద్దలకు చెప్పాడు. కాని గౌరి తండ్రి మాత్రం 'నా కూతురు అలాంటిది కాదు, కావాలనే నా కూతురిపై నిందలు వేస్తున్నారు' అంటూ పెద్ద గొడవ చేశాడు. చివరికి గౌరిని అడిగితే తను అన్న మాటలు నిజమేనని ఒప్పుకుంది. దాంతో పెద్దలు ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోయి ఇద్దరూ జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపారు.
అయినా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తూనే ఉన్నాయి. దాంతో రాజు, గౌరితో ప్రేమగా ఉండేలేక పోయేవాడు. సరిగా ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. కొడుకు పరిస్థితి చూసి కమలమ్మ దిగులుపడేది. ఓపక్క గౌరి చీటికీ మాటికీ పుట్టింటికి వెళ్ళేది. మరోపక్క మామ, రాజును ప్రతి విషయానికీ నిలదేసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే గౌరి గర్భవతయింది. రాజు మాత్రం గౌరిని సరిగా పట్టించుకునేవాడు కాదు. దాంతో గౌరి పుట్టింట్లోనే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గౌరి తండ్రి, కూతుర్ని తీసుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు.
జరిగిందంతా తెలుసుకున్న లీగల్‌సెల్ సభ్యులు రాజుని, అతని తల్లిని రమ్మని కబురు పంపారు. కాని రమ్మన్న రోజు వాళ్ళు రాలేదు. దాంతో సభ్యులు రాజుకు ఫోన్ చేశారు. అయితే రాజు నెంబర్ కలవలేదు. దాంతో రాజు తల్లికి ఫోన్ చేశారు. ఆమె ఈ వారం రాజు వేరే పనిలో ఉండటంతో రాలేక పోయామని, వచ్చే వారం కొడుకుని తీసుకొని కచ్చితంగా వస్తానని చెప్పింది.
ఆపై వారం రాజు, తల్లిని తీసుకొని వచ్చాడు. రాజు మాట్లాడుతూ 'గౌరి పెండ్లి జరిగిన మొదటి రోజే ఇష్టం లేకుండా పెండ్లి చేసుకున్నానని చెప్పడంతో నాకు చాలా బాధగా అనిపించింది. అసలే నేను ప్రేమించిన అమ్మాయి దక్కక బాధలో ఉన్నాను. మా అమ్మ బలవంతం చేడయంతో పెండ్లి చేసుకున్నా. అయినా గౌరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. కాని గౌరి ఇలా మొదటి రోజే నా గుండెను ముక్కలు చేసింది. ప్రేమించడం తప్పుకాదు. పెండ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోకుండా, అసలు నాతో కాపురం చేయడమే ఇష్టం లేదని చెప్పడంతో నా మనసు విరిగిపోయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయా. ఇక అప్పటి నుండి మా మామ నాపై కోపం పెంచుకున్నాడు. ప్రతి దానికీ నన్నే తప్పుపడతాడు. కూతురు చేసిన విషయాలను మాత్రం దాచేస్తాడు. ఆమె రాత్రి పూట ఎవరితోనో గంటల కొద్ది ఫోన్లో మాట్లాడేది. ఈ విషయం చెప్పినా ఆయన పట్టించుకోడు. ప్రతి దానికీ మాపై గొడవ పెట్టుకుంటాడు. అసలు ఆయనకు కూతురు కాపురం చేయాలని ఉందో లేదో తెలుసుకోండి' అన్నాడు రాజు.
కమలమ్మ మాట్లాడుతూ 'అమ్మా, నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఇలా కష్టపడడం చాలా బాధగా ఉంది. గౌరికి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. కాని వాళ్ళ నాన్ననే ఇదంతా చేస్తున్నాడు. ఈ మధ్య గౌరి కూడా చాలా మారింది. మావాడు కూడా గౌరిని జాగ్రత్తగా చూసుకుంటాడు. తండ్రికి ఇష్టం ఉంటే కూతుర్ని మాతో పంపమనండి' అంటూ చెప్పుకొచ్చింది.
తల్లీ, కొడుకులు చెప్పింది విన్న సభ్యులు గౌరి తండ్రిని పిలిచి 'మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుని మీ కూతకురి కాపురాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై రాజు, గౌరిని ప్రేమగా చూసుకుంటానంటున్నాడు. కాబట్టి మీరు కూడా ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు. గౌరికి ఇప్పుడు తొమ్మిదో నెల వచ్చింది. డెలివరీ అయిన తర్వాత గౌరిని ఇక్కడికి తీసుకురండి. తనతో కూడా మేం మాట్లాడతాం.వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధల వల్లనే ఇన్ని సమస్యలు. అర్థమయ్యేలా చెబితే సరిపోతుంది. మీరు అనసవరంగా ఎక్కువగా ఊహించుకొని సమస్యను ఇంకాస్త పెంచకండి.
మీ అమ్మాయి వేరొకరి ప్రేమిస్తే మీరు బలవంతంగా రాజుకిచ్చి పెండ్లి చేశారు. ఇది పెద్ద పొరపాటు. మీరు ఇలా చేయడంతో గౌరి ఆ బాధను భరించలేక తనకు ఇష్టం లేదని రాజుకు చెప్పేసింది. అప్పటికే ఒక అమ్మాయిని ప్రేమించి బాధలో ఉన్న రాజుకు ఈ విషయం ఇంకా బాధగా అనిపించింది. దాంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండే ఇద్దరి మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకునే సమయమే లేకుండా పోయింది. వాళ్ళ మధ్య సమస్యలు ఇలా ఉంటే మీరేమో ప్రతి విషయానికి రాజునే తప్పుపడుతున్నారు. మీరు కాస్త ప్రశాంతగా ఉంటే సమస్య అదే పరిష్కారమవుతుంది' అని చెప్పి పంపారు.
మళ్ళీ మూడు నెలల తర్వాత బాబును తీసుకొని గౌరి, ఆమె తండ్రి, రాజు లీగల్‌సెల్‌కు వచ్చారు. సభ్యులు గౌరితో 'చూడు గౌరీ లేని పోని సమస్యలతో నీ సంసారాన్ని పాడు చేసుకోకు. ఇష్టం లేకుండా పెండ్లి చేసుకున్నా ఇప్పుడు నీకు బాబు కూడా పుట్టాడు. రాజు కూడా మంచివాడే. అతనితో అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఇద్దరూ సంతోషంగా ఉండండి. మీ అత్తగారు మీ కోసం చాలా బాధపడుతుంది. కాబట్టి అర్థం చేసుకో. నువ్వు రాజుతో ప్రేమగా ఉంటే అతను నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళడు' అని చెప్పారు.
సభ్యులు చెప్పిందంతా విన్న గౌరి 'మేడమ్ నేను ఇప్పటి వరకు చేసింది పొరపాటే. ఇకపై అలా ప్రవర్తించను' అని చెప్పి బాబును తీసుకొని రాజుతో సంతోషంగా వెళ్ళిపోయింది.
- సలీమ