Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళల భాగస్వామ్యం లేనిదే ఏ ఉద్యమం సంపూర్ణం కాదు... ఎన్నో చిత్రహింసలకు ఓర్చి... ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే మహిళకు నిజమైన స్వాతంత్య్రం 75 ఏండ్లు గడిచినా ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అసమానతలు రాజ్యమేలుతున్న తరుణంలోనూ ఎందరో మహిళలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకుంటున్నారు. దేశం గర్వపడేలా చేస్తున్నారు. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఇది స్పష్టమైంది. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారి విజయానందాన్ని మనమూ పంచుకుందాం...
పూసర్ల వెంకట సింధు... భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. టోక్యో 2021 ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్యం పతకం గెలుచుకుంది.
2012 సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013 ఆగస్టు 10న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18న రియో ఒలింపిక్స్‌లో జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తర్వాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.
సింధు 1995 జూలై 5న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాకు చెందిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జన్మించారు. ఉద్యోగ రీత్యా గుంటూరుకు వెళ్ళారు. రమణకు రైల్వేలో ఉద్యోగం రావడంతో తన వాలీబాల్ కెరీర్ కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ. 2000లో రమణకు అర్జున పురస్కారం లభించింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్ళైనా సింధు మాత్రం బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సింధు ఎనిమిదేండ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.
సైఖోమ్ మీరాబాయి చాను
ఒకప్పుడు కుటుంబం కడుపు నింపడానికి కట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్రజల ఆశల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఆమె పేరు మీరాబారు చాను. గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది
మీరా బాయి మణిపూర్ కొండకోనల్లో పుట్టి పెరిగింది. ఆరుగురు సంతానంలో అందరి కంటే చిన్నది. కానీ కుటుంబ బరువు బాధ్యతలు మోయడంలో మాత్రం పెద్దదే. ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని నాంగ్పాక్ కాక్చింగ్ అనే ఊళ్లో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. కొండకోనల్లో కట్టెలు కొట్టుకొచ్చి కడుపు నింపుకోవడమే ఆ కుటుంబానికి తెలిసింది. అందరి కంటే చిన్నదైనా కూడా మొదటి నుంచీ బరువులు మోయడంలో మీరాబారు దిట్ట. 12 ఏండ్ల వయసులోనే తన కంటే పెద్దవాళ్లయిన తోబుట్టువులు కూడా మోయలేని బరువును తలపై ఎత్తుకొని 2 కిలోమీటర్లు అవలీలగా నడిచేసింది. సరిగ్గా 8 ఏండ్ల తర్వాత ఆ అమ్మాయే 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచింది.
అవసరమే కెరీర్‌గా
మీరాబారు ఐదేండ్ల వయసులోనే తలపై ఓ నీటి బకెట్‌ను పెట్టుకొని కొండను కూడా సునాయాసంగా ఎక్కడం నేర్చుకుంది. అప్పుడది కుటుంబ అవసరం. కానీ అవసరమే తన కెరీర్‌గా మారుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అలా నీటి బకెట్లతోపాటు కట్టెలు మోయడం క్రమంగా మీరాబాయిను రాటుదేల్చింది. 14 ఏండ్ల వయసు వచ్చేసరికి ఆమె వెయిట్‌లిఫ్టింగ్ వైపు చూసింది. తనను ఆ దిశగా ఇన్స్పైర్ చేసింది ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్స్ సిల్వర్ మెడలిస్ట్ కుంజరాణి దేవి. ఆమెను చూసిన తర్వాతే ఇక బరువులు మోయడాన్ని తన కెరీర్‌గా మలచుకోవాలని మీరాబారు నిర్ణయించుకుంది.
చిన్నతనం నుంచీ కుటుంబం కోసం ఎంత కష్టపడిందో.. వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కోసం కూడా ఆమె అంతగానే చెమటోడ్చింది. తన ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్‌కు రోజూ వెళ్లి వచ్చేది. మొదట కోచ్ అనితా చాను ఆమెకు శిక్షణ ఇచ్చింది. అక్కడ మీరాబాయి మొదట వెదురు బొంగులనే బార్బెల్స్గా ఉపయోగించి బరువులు మోసింది. అలా తన టెక్నిక్‌ను మెరుగుపరచుకున్న ఆరు నెలల తర్వాత సాంప్రదాయ వెయిట్‌లిఫ్టింగ్ టూల్స్ వైపు మళ్లింది. అలా రెండేళ్లలోనే సబ్‌జూనియర్ స్టేట్ లెవల్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల గెలిచే స్థాయికి చేరింది. 2011లో జూనియర్ కేటగిరీలో తొలిసారి నేషనల్ మెడల్ గెలిచింది. అదే కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ మెడల్ తనను తన ఆరాధ్య వెయిట్ లిఫ్టర్ కుంజరాణిదేవి దగ్గరికి తీసుకెళ్లింది. అలా 2014లో కామన్వెల్త్ గేమ్స్ రూపంలో తొలిసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చూపే అవకాశం దక్కింది. తొలిసారే 48 కేజీల విభాగంలో సిల్వర్‌తో మెరిసింది.
2014లో ఏషియన్ గేమ్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగినా ఉత్త చేతులతోనే తిరిగి వచ్చింది. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు మాత్రమే అర్హత సాధించగలిగింది. కానీ అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో ఒక్కసారి కూడా బరువు ఎత్తలేక నిరాశతో వెనుదిరిగింది. ఈ ఊహించని పరిణామంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. గేమ్‌ను వదిలేయాలని భావించింది. కానీ కొంతకాలం తర్వాత ఆ బాధ నుంచి బయట పడిన మీరాబారు.. బలంగా పుంజుకుంది. ఏడాది తర్వాత జరిగిన వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఏకంగా గోల్డ్ మెడల్ గెలిచింది. కరణం మల్లీశ్వరి తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ గెలిచిన రెండో ఇండియన్ వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతే ఆమెకు అత్యున్నత పౌరపురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న దక్కింది. 2018లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. ఇప్పుడు ఎన్నో ఆశలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన మీరాబాయి ఏకంగా సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించింది. ఈ ఆనంద సమయంలో ఆమె శిక్షణ తీసుకునేందుకు వెళ్ళే సమయంలో తనకు సాయం చేసిన డ్రైవర్లను కలుసుకుని ధన్యవాదాలు చెప్పాలని ఉందని మీడియాతో అన్నది.
లవ్లీనా బోర్గహైన్
టోక్యో మహిళల బాక్సింగ్‌లో కాంస్యం గెలిచిన లవ్లీనా బోర్గహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతున్నది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ డివిజన్లో ఫైనల్ చేరుతుందని ఆశించినా ఆమె ప్రపంచ చాంపియన్ సుర్మెనెలిపై సెమీస్‌లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నది. ఒలింపిక్స్‌లో 9 ఏండ్ల తర్వాత బాక్సింగ్‌లో పతకం తెచ్చిపెట్టి లవ్లీనా రికార్డు సృష్టించింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా ముఖియా గ్రామంలో 1997 అక్టోబర్ 2న లవ్లీనా జన్మించింది. అదే గ్రామంలో లవ్లీనా తండ్రి చిన్న వ్యాపారం చేస్తుంటారు. లవ్లీనా అక్కలు ఇద్దరూ కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వాళ్లే. దీంతో అక్కల వలె తాను కూడా కిక్ బాక్సింగ్‌ను ఇష్టపడింది. జిల్లా స్థాయిలో పలు పతకాలు సాధించి దూసుకొని పోయింది. ఒక రోజు లవ్లీనా స్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించింది. ఆ పోటీల్లో లవ్లీనా టాలెంట్ గుర్తించిన కోచ్ పదుమ్ బోరో ఆమెను కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్ వైపు మళ్లించారు. అలా లవ్లీనా బాక్సింగ్ కెరీర్ మొదలు పెట్టింది. మేరీకోమ్ 2012లో బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం గెలవగా.. అదే ఏడాది లవ్లీనా బాక్సింగ్‌లోకి అడుగు పెట్టింది.
2012 నుంచి బాక్సింగ్ కెరీర్‌గా ఎంచుకున్న లవ్లీనా పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నది. 2017లో ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. 2018లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేసి 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. అదే ఏడాది రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో కూడా కాంస్యం దక్కించుకున్నది. ఈ రెండు పతకాలే ఆమెను ఒలింపిక్స్‌లో ఆడేలా చేశాయి. అలా ఒలింపిక్స్‌కు తొలి సారి వెళ్లి మళ్లీ కాంస్యమే గెలుచుకుంది.
లవ్లీనా వెల్టర్ డివిజన్లో పతకం గెలుస్తుందని తెలియగానే అస్సాంలోని ఆమె గ్రామానికి రోడ్డు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గోలాఘాట్ జిల్లాలోని ముఖియా గ్రామం.. సరుపథార్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరికి రోడు ఏదో నామ్‌కే వాస్తే ఉంటుంది. సైకిల్, ద్విచక్రవాహనాలు కూడా సరిగా వెళ్లే అవకాశం ఉండదు. అయితే స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ద్వారా రోడ్డు మంజూరు చేయించారు. ఒలింపిక్స్ నుండి లవ్లీనా గ్రామానికి వచ్చేలోపే గ్రావెల్, మట్టితో రోడ్డును చదును చేశారు. ఈ వర్షాకాలం ముగిసిన వెంటనే పర్మనెంట్ రోడ్డు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఊర్లో లవ్లీనా ఇంటి వరకు ఉన్న 600 మీటర్ల రోడ్డును కూడా బాగుచేస్తున్నట్టు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ తెలిపింది.
వీరే కాకుండా పతకం తృటితో తప్పిపోయినా మహిళా హాకీ జట్టు స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించారు. ఇలాగే మరెంతో మంది వఅవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పట్టుదలతో కృషి చేస్తున్నారు. కాస్త చేయూత అందిస్తే దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేసేందుకు సిద్ధంగ ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో కనుమరుగున ఉంటూ తమ ప్రతిభకు గుర్తింపు లేక సాయం కోసం చూస్తున్నారు. అలాంటి క్రీడాకారిణులను ప్రభుత్వం గుర్తించి తగిన సౌకర్యాలు, కల్పిస్తే దేశానికి మరిన్ని పతకాలు రావడం ఖాయం.
- సలీమ