Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతికూలతల్లోనూ సానుకూల దృక్పథంతో మనం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తే.. తప్పకుండా విజయం మనదే అంటున్నారు నిపుణులు. అందుకే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం.. వంటి దుర్బర పరిస్థితులు ఎదురైనప్పుడు కెరీర్లో ఆగిపోకూడదంటే ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.
సమయం మనది కానప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగానే మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఫలానా కంపెనీలో ఉద్యోగమే కావాలని కూర్చోకుండా.. కెరీర్లో గ్యాప్ రాకుండా జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. మీ చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా.. దానికోసం ప్రయత్నించడంలో తప్పు లేదంటున్నారు. అవసరమైతే ఆ ఉద్యోగావకాశాల కోసం కొత్త నైపుణ్యాలు సైతం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అదనపు స్కిల్స్, ఉద్యోగ అనుభవం ఎప్పటికీ వృథా కావు.
కరోనా వచ్చాక కొన్ని రంగాలపై ప్రభావం పడినా.. ఆరోగ్య రంగం, ఈ-కామర్స్ వంటివి బోలెడన్ని లాభాల్ని ఆర్జించాయి. కాబట్టి మీ ఉద్యోగం సంక్షోభంలో ఉన్న సమయంలో ఎప్పటికీ ఆర్థిక స్థిరత్వం ఉంటుందన్న ఇలాంటి రంగాలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు.
- కరోనా వచ్చాక పిల్లల చదువు దగ్గర్నుంచి, పెద్దల ఉద్యోగాల దాకా ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయింది. కరోనా తర్వాత కూడా ఇంటి నుంచే పనిచేస్తామంటున్నాయి చాలా కంపెనీలు. అందుకు తగ్గట్టే మన నైపుణ్యాల్ని కూడా మెరుగుపరచుకోవాలంటున్నారు.
కంఫర్ట్ జోన్.. కెరీర్‌కి ఇది అతిపెద్ద అడ్డుగోడ. ఎంతసేపూ.. 'నేను ఈ ఉద్యోగమైతేనే చేస్తాను', 'ఇంతకంటే ఎక్కువ కష్టపడడం నా వల్ల కాదు', 'రిస్క్ చేయలేను'.. అంటూ మన సౌకర్యానికే ప్రాధాన్యమిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కెరీర్ మందగమనంలో సాగుతుంది. కాబట్టి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనమూ మారాలంటున్నారు నిపుణులు. అదనపు బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించాలంటున్నారు.
ఉద్యోగం పోయింది.. ఎంత ప్రయత్నించినా సక్సెస్ కావట్లేదు.. అంటారా? అయితే నిరుత్సాహపడకుండా కాస్త ఆలోచించి మీలో ఉన్న తపనేంటో తెలుసుకోమంటున్నారు. అంటే.. కొంతమందికి వంటలంటే ఇష్టం.. మరికొంతమందికి పాఠాలు చెప్పడమంటే మక్కువ.. ఇంకొంతమంది క్రాఫ్ట్స్ చేయడంలో దిట్ట... ఇలా మీలోని ఆసక్తిని బయటికి తీసి వాటినే స్వీయ ఉపాధి మార్గాలుగా మలచుకోవచ్చు. వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెట్టచ్చు.. బొమ్మలు తయారుచేసి ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్‌లో పెట్టి అమ్మచ్చు.. అవసరమే మనలో ఉన్న ఆలోచనల్ని తట్టిలేపుతుందన్నట్టు ఇలా ఆలోచిస్తే ఐడియాలకు కొదవేలేదు.