Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో మహిళలు తమ కెరీర్ పట్ల ఓ స్పష్టమైన అవగాహనతో ఉంటున్నారు. అయితే అదనంగా ఉన్న కుటుంబ బాధ్యతల రీత్యా.. కొంతమంది మహిళలు మధ్యలోనే ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో పార్ట్‌టైమ్ జాబ్, తక్కువ జీతానికి పనిచేయడం.. వంటివి చేస్తున్నారు.. ఇంకొన్ని కంపెనీల్లో లింగ అసమానత కారణంగా పురుషులతో సమానంగా జీతభత్యాలు దక్కట్లేదనే చెప్పాలి. ఇలా ఎటు నుంచి చూసినా పదవీ విరమణ పొందాక పెన్షన్ వస్తుందన్న ధీమా కనిపించట్లేదు. అలాంటప్పుడు సంపాదిస్తోన్న కొద్ది మొత్తం నుంచైనా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
ముందే తీసుకోవాలి: ఆర్థిక ప్రణాళిక ఏ నెలకో, రెండు నెలలకో ముగిసేది కాదు.. మనకొస్తున్న ఆదాయాన్ని బట్టి దీర్ఘకాలం పాటు పొదుపు-మదుపులు చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిటైరయ్యాక కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీవించొచ్చు. అయితే ఇలాంటి ప్లానింగ్ వేసుకోవడానికి ముందే ఓ ఆరోగ్య బీమా, ఓ జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వయసు చిన్నదైనా, పెద్దదైనా ఏ ఆపద, అనారోగ్యం తలెత్తుతుందో చెప్పలేం కాబట్టి.. అలాంటప్పుడు ఈ బీమా పాలసీ అత్యవసర నిధిలా ఉపయోగపడుతుందంటున్నారు.
రిస్క్ లేకుండా: డబ్బు విషయంలో రిస్క్ చేయడానికి మహిళలు అస్సలు ఇష్టపడరు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తారే తప్ప.. 'వస్తే లాభాలొస్తాయి లేదంటే నష్టపోతాం..' అంటూ ధైర్యం చేసే మహిళల్ని మనం అరుదుగా చూస్తుంటాం. ఇలా రిస్క్ చేయలేని వారు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్, సిప్.. వంటి పొదుపు మార్గాల్ని అనుసరించ వచ్చు అంటున్నారు నిపుణులు. ఇవి సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఆర్థిక ప్రణాళికలు.. పైగా ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ మొత్తం రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత, ఇల్లు కొనడం.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.
అవగాహన అవసరం: ఇద్దరూ సంపాదిస్తోన్నప్పుడు పొదుపు చేయడం ఎంత అవసరమో.. ఇద్దరూ విడివిడిగా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడమూ అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. దాంతో పదవీ విరమణ తర్వాత కూడా ఎలాంటి చీకూ చింతా లేకుండా ఆర్థిక భద్రతతో హాయిగా గడిపేయవచ్చు. అయితే ఈ విషయంలో మహిళలు అవగాహన పెంచుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవాలంటున్నారు. ఎందుకంటే.. ఆర్థిక విషయాల్లో ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడితే.. ఒకవేళ వాళ్లు చనిపోయినా, మిమ్మల్ని విడిచి వెళ్లిపోయినా.. మీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలా జరగకూడదంటే రిటైర్మెంట్ ప్లానింగ్, ఇతర ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిది.
వెనకేసుకోండి: పెండ్లి, పిల్లలు పుట్టకముందు మహిళలు సంపాదనపై పూర్తి దృష్టి పెట్టినా.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కెరీర్‌ను కొనసాగించే వాళ్లు చాలా తక్కువ మందే అని చెప్పాలి. ఇందుకు కుటుంబ బాధ్యతలు, ఇతర వ్యక్తిగత విషయాలు.. వంటివి కారణమవుతుంటాయి. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఎక్కువ మొత్తంలో వెనకేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఇలా ఈ డబ్బుతో ఇల్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్.. వంటి ఆస్తుల్ని కొనుగోలు చేసి మీ పేరిట రిజిస్టర్ చేయించుకుంటే ముందు ముందు మీరు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పెద్ద ఇల్లైతే ఇతరులకు అద్దెకిచ్చి కొంత సొమ్ము ఆర్జించచ్చు.. దీన్ని రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు కొన్న ఈ ఆస్తుల విలువ క్రమంగా పెరుగుతుందే తప్ప తరిగే అవకాశమే లేదు. ప