Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శృతి మూర్తి... అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించడమంటే ఈమెకు ప్రాణం. దాని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేసుకుంటూ వేలకు వేలు సంపాదిస్తూ హాయిగా బతికే అవకాశం ఉన్నా ఫొటోగ్రఫీపై ఉన్న అమితమైన ఆసక్తితో పట్టుబట్టి ఆ రంగంలోకే అడుగుపెట్టారు. మంచి ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ ఫొటోగ్రపీ దినోత్సవం సందర్భంగా ఆమె పరిచయం మానవి పాఠకుల కోసం...
నేను పుట్టిపెరిగింది ఢిల్లీలో. నా బాల్యం, చదువు అంతా అక్కడే జరిగింది. అమ్మ రమామణి, నాన్న ఎస్.ఎస్.ఆర్ మూర్తి. చిన్నప్పుడు... బహుశా నాకు 15 సంవత్సరాలు ఉంటాయేమో. మా నాన్నగారు రీల్ కెమెరా కొనడానికి వెళ్తే నేను డిజిటల్ కెమెరా కొందామని సలహా ఇచ్చాను. అలాంటిది ఆ మధ్యనే చాలా మంది దగ్గర చూసాను. అలా మా ఇంటికి డిజిటల్ కెమెరా వచ్చింది. కొనడం వరకే నాన్న పని. ఆ తర్వాత దాన్ని అన్ని రకాలుగా వాడింది నేనే.
ఏవో ట్రయల్స్ చేస్తుండగా
ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. అందులోని జీవరాశులు, అకాశం, చెట్లు, పువ్వులు అన్నీ ఇష్టమే. ఆ ఇష్టంతోనే నేను తీసిన రకరకాల క్రిమికీటకాల ఫొటోలు నా దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు. నాచురల్ నుంచి స్లో షూట్టర్ ఫొటోస్ వరకు అన్నీ చేశాను. అప్పట్లో స్లో షూట్టర్ గురించి తెలియక పోయినా ఏవో ట్రయల్స్ చేస్తుండగా అలా జరిగిపోయింది. ట్రిప్స్‌లో కెమెరా ఎప్పుడు నా దగ్గరే ఉండేది. నేను తీసిన ఫొటోస్‌ని అందరు చాలా బావున్నాయి అనేవారు. దాంతో నాలో ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగేది.
ఎప్పటికైనా ఆపరేట్ చేయాలని
ఒక రోజు మా పెదనాన్నగారి అబ్బాయి, మా అన్నయ్య వచ్చాడు. అప్పట్లో తను టెక్నీషియన్‌గా పని చేసేవాడు. తను డీఎస్ఎల్ఆర్ కొని మా ఇంట్లో పెట్టాడు. దాన్ని భద్రంగా దాచి, రోజుకి ఒక సారైనా చూసి మళ్లీ పెట్టేసేదాన్ని. ఎప్పటికైనా నేను దాన్ని ఆపరేట్ చేయగలనా అనుకునేదాన్ని. నెమ్మదిగా మా అన్నయ్యని అడిగి, నేర్చుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తనే నాకు స్ఫూర్తి.
అమ్మ నా మోటివేషన్
ఒకరోజు మా ఇంటి వెనక ఉన్న చెట్ల మీద రెండు ఉడుతలు అటు ఇటు పరుగులు పెడుతూ కనిపించాయి.. దాగుడు మూతలు ఆడుకుంటున్నట్టుగా. వాటిని ఫోటో తియ్యడానికి కూర్చున్నాను. ఆ రెండింటిని ఒకే ఫ్రేమ్‌లో బంధించాలని చాలా సేపు ట్రై చేశాను. ఈ కార్యక్రమంలో నాకు తెలియకుండానే మూడున్నర నాలుగు గంటలు పట్టేసింది. నేను కిటికీ బయటకి ఫోకస్ చేసి కూర్చున్న తీరు చూసి మా అమ్మ సహాయం చేసింది. భోజనం కలిపి నా నోట్లో పెట్టింది. అలా కష్ట పడుతూ తీసిన ఫోటోనే ఈ రెండు ఉడతలది. మా అమ్మ నాకు మోటివేషన్.
రిస్క్ తీసుకోవడం ఇష్టం
కెమెరా మీద ఉన్న ఫీల్‌ని, క్రేజ్‌ని కాపాడుకుంటూ వచ్చాను. కొన్నాళ్ళకి మేము హైదరాబాద్‌కి వచ్చేశాము. అప్పట్లో నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రిలిమ్స్ రాసి ఇక నా వల్ల అవ్వదు అని తెలుసుకొని, ఇంజనీరింగ్ చేశాను కాబట్టి అందులోనే ఉద్యోగం వెతకడం మొదలుపెట్టాను. మొదలంటూ పెట్టానే కాని నా చిరకాల వాంఛ అయినా ఫొటోగ్రఫీ మీదే నా మనసంతా ఉండేది. ఇంట్లో చెప్పాలంటే భయం, వద్దంటారేమో అని. కానీ రిస్క్ తీసుకోవడమంటే నాకు చాలా ఇష్టం. ఇక ఏదైతే అది అవుతుందని ఒకసారి మా నాన్నను అడిగేసాను ''నాకైతే ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఉంది. ఉద్యోగంలో చేరానంటే, ఆ జాబ్‌కి నేను న్యాయం చేయలేను అనిపి ిస్తోంది'' అని చెప్పేసి రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను. ''ఓకే ట్రై చెయ్యి, టైం తీసుకో.. కాని నీ వల్ల కాదు అనుకుంటే మాత్రం జాబ్‌కి ట్రై చెయ్యి. ఖాళీగా మాత్రం ఉండద్దు'' అన్నారు. ఇంక నా ఆనందానికి అవధుల్లేవు. ఆయన నా గొప్ప సపోర్టర్.
నా గైడ్, మార్గదర్శకులు
నా కోరికకి, తంతే బూరెల బుట్టలో పడినట్టు నా జీవితంలోకి ఒక పెద్ద బహుమతి రూపంలో వచ్చారు మా నాన్న ఫ్రెండ్ శ్రీ మణిశంకర్ గారు. నాకు ఫస్ట్ ఛాన్స్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చి తన పర్సనల్ డీఎస్ఎల్ఆర్ ఇచ్చి ఫొటోగ్రాఫీలో చిన్న చిన్న మెళకువలు చెప్పారు. వారం రోజుల తర్వాత రమ్మని చెప్పారు. ఏపీ టూరిజం ప్రాజెక్ట్ చేయించారు. ఆ నెల అయిపోయాక నా చేతికి ఒక చెక్ ఇచ్చారు. ఆ రోజు నా సంతోషం అంతా ఇంతా కాదు. అది ఎప్పటికి మరువలేని తీపి జ్ఞాపకం. ఆయన దగ్గర పని చేసిన రెండేండ్లలో చాలా నేర్చుకున్నాను. యాడ్ ఫిలిమ్స్, ప్రాజెక్ట్ మ్యాజింగ్, హౌలోగ్రామ్, సాంగ్ షూట్, ఆడియో షూట్ లాంటి వాటిల్లో అనుభవం వచ్చింది. అసిస్టెంట్ చేయడం నుంచి నేనుగా షూటింగ్‌కి లైటింగ్, ఆడియో సెట్ చేయడం నేర్చుకున్నాను. గ్రీన్ స్క్రీన్ షూట్స్ చాలా చేసాము. ఆ సమయంలోనే ప్రముఖ దిగ్గజులైన సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, నటి కాజల్ అగర్వాల్, రాణా దగ్గుపాటి, జాతీయ అంతర్జాతీయ ఎలక్షన్ క్యాపియన్స్కి టీంతో పాటు షూట్ చేశాను. అలా మణిశంకర్ గారు నాకు గురువు మార్గదర్శకులు.
క్యాన్డిడ్ బై హర్
నాకు నేనుగా క్రియేటివ్‌గా ఏదైనా చేద్దాం అనిపించి మొదలుపెట్టిన నా కంపెనీ, నా బేబీ, క్యాన్డిడ్ బై హర్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్‌లో నా కంపెనీ గురించి చూడచ్చు. నేను నా బిజినెస్‌ని విస్తరింప చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఈ మధ్యనే ఏడు నెలల కిందట పెండ్లి కూడా అయ్యింది. నా అదృష్టం కొద్దీ మా అత్తవారింటి నుండి కూడా నాకు మంచి సహకారం అందుతోంది. వెడ్డింగ్స్, ప్రీ-వెడ్డింగ్స్, పోస్ట్-వెడ్డింగ్స్, ఫ్యామిలీ షూట్స్, ప్రెగన్సీ షూట్స్, న్యూ బోర్న్ బేబీస్, బేబీ షూట్స్, బర్త్ డే షూట్స్, కేక్ - స్మాష్ షూట్స్, పోర్ట్ఫొలియో ప్రోడక్ట్ షూట్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఫుడ్ షూట్స్ లాంటివి చేస్తున్నాను. ముఖ్యంగా ముస్లిం సమాజంలోని వివాహ కార్యక్రమాలకి మహిళా ఫొటోగ్రాఫర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నందుకు ఆ పరంగా ఎక్కువగా పని చేయగలుగుతున్నాను.
నేచురల్‌గా తీస్తేనే...
ఎవరైనా నన్ను ఫొటోగ్రాఫర్‌గా ఎందుకు నియమించుకోవాలి అని అడిగితే, నేను చెప్పే జవాబు ఏమిటంటే, నా క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నేను ఫొటో షూట్ చేస్తాను. వారితో చర్చలో పాల్గొని, వారి అవసరాలు తెలుసుకొని, నాతో నా కెమెరాతో ఫ్రీగా ఉండేలాగా చేస్తాను. పోజులు ఇప్పించి ఫోటోలు తీయడం కన్నా నేచురల్‌గా ఫొటోలను తీయడమే నాకు ఇష్టం. ఆలా తీస్తే వారిలో సహజంగా కనిపించే భావోద్వేగాలు కెమెరాలో బంధించగలము. వారిని సహజంగా నవ్వించి ఫొటోలు తీస్తేనే అవి అందంగా కనపడతాయి అని నా అభిప్రాయం.
- శృతి మూర్తి
- పాలపర్తి సంధ్యారాణి