Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇళ్లలో తరచుగా కనిపించే బొద్దింకలు వివిధ రకాల బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉంటాయి. వంట గది, కబోర్డులు, మ్యాన్‌హోల్స్‌లో ఇవి ఆవాసం ఏర్పరచుకుంటాయి. మనం పడేసే ఆహార పదార్థాలను తింటాయి. తక్కువ సమయంలో సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ.. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. మన ఇంట్లోనే లభించే కొన్ని రకాల సహజ పదార్థాలతో బొద్దింకల ముప్పును దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
బొద్దింకలను చంపేసే శక్తి కాఫీకి ఉంటుంది. బొద్దింకలు కాఫీ వాసనకు సులభంగా ఆకర్షితమవుతాయి. కాఫీని రుచి చూసిన తర్వాత దాంట్లో ఉండే కెఫిన్ వాటిని చంపుతుంది. కాఫీ గింజలను పొడిగా చేసి దాన్ని ఇంట్లో వివిధ ప్రాంతాల్లో చల్లుకోవాలి. ఆ తర్వాత బొద్దింకల బెదడ దూరమవుతుంది.
బేకింగ్ సోడా కూడా సులభంగా బొద్దింకలను చంపగలదు. బేకింగ్ సోడాను చక్కెరలో కలిపి ఆ మిశ్రమాన్ని బొద్దింకలు ఉండే ప్రాంతంలో చల్లాలి. ఆ కీటకాలు చక్కెరను ఎక్కువగా ఇష్టపడతాయి. కానీ దాంట్లో కలిసిన బేకింగ్ సోడాను బొద్దింకలు జీర్ణించుకోలేవు. ఫలితంగా అవి చనిపోతాయి.
ఆరోగ్య సంరక్షణతో పాటు బొద్దింకలు, ఇతర కీటకాల నివారణలోనూ పుదీనా సమర్థంగా పనిచేస్తుంది. కొన్ని ఎండిన లేదా తాజా పుదీనా ఆకులను బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో వేయాలి. లేదంటే పుదీనా ఎసెన్షియల్ ఆయిల్, నీరు కలిపి బొద్దింకలు కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. వీటి వాసనల వల్ల కీటకాలు ఇబ్బందిపడి పారిపోతాయి.
ఇంట్లోనే లభించే బిర్యానీ ఆకులను అవి తరచుగా కనిపించే ప్రాంతాల్లో వేస్తే చాలు. బొద్దింకలు ఈ ఆకుల సువాసనను భరించలేవు. అందువల్ల బిర్యానీ ఆకులను పొడిగా చేసి, ఇంట్లో అక్కడక్కడా చల్లితే.. బొద్దింకలు ఇంట్లోకి రావు.