Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తన ఉగ్రరూపం తగ్గించుకొని మామూలుగా వెళుతున్నది. ఒకనాడు వెంటిలేటర్ల కొరకు రోగులు నిరీక్షించే అవసరం ఎక్కువగా ఉండేది. సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్ల కొరకు కూడా సిఫార్సులు చేయించుకోవడం, ఐసీయూలో బెడ్ కొరకు సిఫార్సులు మొదలైనవి ఎన్నో చూశాము. ప్రస్తుతం అలాంటి పరిస్థితి తగ్గింది. కొద్దిగా ప్రశాంతంగానే ఉన్నది. కానీ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పిల్లల్లో కరోనా ఎక్కువగా ప్రబలుతున్నట్టు వార్తల్లో చూస్తున్నాం. కానీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణంగా కనిపిస్తున్నది. ఇది తుఫాను ముందరి ప్రశాంతతనా లేదా ఉధృతి తగ్గిందా అనేది మనకు తెలియదు. గతంలో ఒక్కొక్క పేషెంటుకు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం పడేది. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి ప్రస్తుతం అతి తక్కువ ఆక్సిజన్ వినియోగించే స్థాయికి వచ్చింది. ఇప్పుడూ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. కానీ తీవ్రత లేదు. క్వారంటైన్లో ఉండటంతోనూ, లేదా హాస్పిటల్లో అతి తక్కువ ఆక్సిజన్ వినియోగంతోనూ కోలుకుంటున్నారు. మంచి పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోండి. ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోండి. బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. పిల్లల్ని ఆటలకు బయటకు పంపవద్దు. జంక్ ఫుడ్ జోలికి పోకుండా హాబీలతో కాలం గడపండి.
వెల్లుల్లిపాప
ఇంట్లో కూరల్లో వేయడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాం. ఇది చేయడానికి వెల్లుల్లి వలుస్తున్నాను. అలా రాశిగా చూసేసరికి నాకు బొమ్మను చేయాలనిపించింది. సరే అల్లం వెల్లుల్లి పేస్టును పక్కనపెట్టి మధ్యలో బొమ్మను చేస్తూ కూర్చున్నాను. అందుకే మా అమ్మ ఎప్పుడూ అంటుంది ''నువ్వు వంటింట్లోకి రాకు. కూరలు చేసే పని పక్కన పెట్టి బొమ్మలు చేస్తావు.. వంట లేటవుతుంది అని''. ఇప్పుడూ అలాగే బొమ్మ చేస్తున్నాను. అరిచేందుకు అమ్మే లేదు. పచ్చిమిర్చి తెచ్చి గౌను కుట్టాను. కుచ్చుల గౌను కొరకు కొత్తిమీర కాడలు, పచ్చిమిర్చి వాడాను. మిగతా బొమ్మంతా వెల్లుల్లి పాయల్‌నే తీసుకున్నాను. నేనీరోజు బాలికా విద్యను అంశంగా తీసుకోదలిచాను. అందుకే ఈరోజు బాలికల బొమ్మల్ని వేయాలనుకున్నాను. ఇప్పుడు రోజులు ఎంతో మారినప్పటికీ ఇంకా బాలికలు అక్షరాస్యతను సాధించవలసి ఉన్నది. నగరాలలో ఎక్కువగా మహిళల అక్షరాస్యత కనిపిస్తుంది కానీ పల్లెల్లో ఇంకా ఆడపిల్లల్ని బడికి పంపని వాళ్ళున్నారు. అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాను. వెల్లుల్లి కూడా ఉల్లి జాతికి చెందిన మొక్క. ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంధంలోనూ వెల్లుల్లి ప్రస్తావన ఉన్నది. అధిక రక్తపోటును నివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ వెల్లుల్లిని గాంగ్రీన్ వ్యాధి పెరగకుండా వాడే వాళ్ళట. వెల్లుల్లిలో 'సి' విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల నోటి వ్యాధులకు మంచి ఔషధమని 19వ శతాబ్ధం మొదట్లో కనుగొన్నారు.
కారబ్బూందీ పిల్ల
మా చిన్నతనంలో కారప్పూస, కజ్జికాయలు, చెకోడీలు, బూందీ అన్నీ ఇంట్లో వండుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు. వారం, పదిరోజుల్లో వాటిని తినకపోతే పారేస్తాం. అలా పారేసే వాటితో ఈ రోజు ఒక అమ్మాయి బొమ్మను చేశాను. 'పఫ్' లనే గుండ్రంగా ఉండే మసాలా బాల్స్ వంటివి పాకెట్లలో దొరుకుతాయి. అవి కూడా డేట్ అయిపోయాయి అంటే వాటిని అమ్మాయి ముఖానికి వాడాను. అవి పసుపురంగులో ఉంటాయి కాబట్టి ముఖానికి బాగుంటాయనకున్నాను. ఇంకా చక్రాల్లాంటి వడియాలు వేయించి ఉప్పూ, కారం చల్లి పాకెట్ చేసి అమ్ముతారు. ప్రయాణాలలో భలే తినాలనిపిస్తుంది తెలుసా! ఈరోజు వాటితో ఈ పిల్లకు లంగా కుట్టాను. నేను చిన్నప్పుడు మిషను కుట్టే పని నేర్చుకోవడం ఎంత మంచిదయిందో. ఇలా ఈ పిల్లలకు లంగాలు, జాకెట్లు కుడుతున్నాను. చెకోడీలను చేతులగా మార్చాను. ఇంకా ఆకులు తెచ్చి అమ్మాయి జుట్టుగా పెట్టాను. ''చిక్కటి అడవిలో ప్రాణం లేని వేటగాడు ప్రాణమున్న జంతువును వేటాడుతున్నాడు'' అంటూ తలలో పేల గురించి, ఈర్పాన గురించీ ఒక పొడుపు కథను చెప్పేవారు. ఈ పొడుపు కథలో జుట్టును అడవి అన్నారు కదాని, నేను ఆకులు తెచ్చి జుట్టుగా అమర్చాను. ఇప్పుడు కారబ్బూందీని తెచ్చి లంగా మీద చిన్న చిన్న పూల ప్రింటు వేశాను. పఫ్లతో ముఖము, చెకోడీల చేతులు, కారబ్బూందీ లంగా, పెడిగ్రీ కాళ్ళు పెట్టుకొని మా అమ్మాయి ఫ్యాషన్ షోకు తయారయింది. ఈ పిల్లనిప్పుడు బడికి పంపించాలి.
అప్పడాలమ్మాయి
మేము స్కూలుకెళ్ళే రోజుల్లో ఒకావిడ అప్పడాలను బట్టలో కట్టుకొని తెచ్చి అమ్ముతుండేది. ''అమ్మా అప్పడాలామె వచ్చింది'' అని కేకపెట్టేవాళ్ళం. అలాగే అప్పడాలమ్మాయి అంటే అప్పడాలు అమ్ముకునే అమ్మాయి అనుకునేరు. ఈ అమ్మాయి అప్పడాలతో తయారైంది. అప్పడాల్లో పెసర అప్పడాలు, మినప అప్పడాలు అని రెండు రకాలుంటాయి. మా ఇంటి చుట్టు పక్కలంతా ఆడవాళ్ళు కుటీర పరిశ్రమగా అప్పడాలు వత్తుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవీ ఎన్నో కొత్త పోకడలు పోతున్నాయి. ఈ మధ్య ఒకావిడకు చెప్పి పెసరప్పడాలు తెప్పించుకున్నాం. ఆ పెసర అప్పడాలే ఈ అమ్మాయి సృష్టికి మూలకారణమైంది. పచ్చని పసుపు రంగులో ఎంత అందంగా ఉందో ఈ అమ్మాయి. పప్పులు, పులుసులు కలుపుకున్నప్పుడు అప్పడాలు, వడియాలు నంచుకుని తింటే ఆ రుచే వేరు. నేను వంటింట్లో కెళితే ఇలాంటి ప్రమాదాలే ఉంటాయని ఇప్పుడు మా అబ్బాయి అంటున్నాడు. 'అప్పడాలు వేయించమ్మా అంటే ఇలా బొమ్మ చేసుకుని మురిసిపోతున్నా వేంటమ్మా' అని మా అబ్బాయి అప్పడం లేకుండానే అన్నం తినేశాడు. అయితే ఆడపిల్ల చదువుకుంటే ఇంటిల్లిపాదీ చదువుకున్నట్టే.
చపాతీ బాలిక
రాత్రి చపాతీలు చేస్తే ఒకటి మిగిలిపోయింది. దాన్ని బొమ్మ చేయడానికి ఉపయో గించాను. చపాతీని బాలిక గౌను లాగా మార్చేశాను. గౌనుకు ఎంబ్రాయిడరీ కూడా కుట్టాను. అక్కడక్కడా సున్నాలు చుట్టినట్టుగా చెకోడీలు అమర్చాను. మధ్యలో డిజైను కోసం యాపిల్ పైన ఉండే ఎర్రటి తొక్కను కూడా ఉపయోగించాను. ఈ బాలిక ముఖానికి ఏం పెట్టానో తెలుసా? గోధుమ పిండితో తయారైన బిస్కెట్లు పెట్టాను. ఇవి మాత్రం మిగిలిపోయినవి కాదు. ఇప్పుడే వండినవి. ఈ తీపి బిస్కెట్లను బాలిక ముఖానికి, చేతులకు ఉపయోగించాను. చెవులు, లోలాకుల కోసం దోశ ముక్కల్ని పెట్టాను. గౌను మీద గుమ్మడి కాయ తొక్కును సన్నగా కత్తిరించి డిజైన్ లాగా అమర్చాను. ఇప్పటికీ బాలికల్లో ఎంతో మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంటే ఇప్పటికీ సుమారు ఇండియాలో 20 కోట్లమంది మహిళలు చదువుకు దూరంగా ఉన్నారు. కాబట్టి బాలికా విద్య పట్ల అందరూ దృష్టి పెట్టడం అవసరం.
గుమ్మడికాయల గుమ్మ
గుమ్మడి కాయ ముక్కల ఫ్రై చేద్దామని ముక్కలు చేయించాను. చాలా చక్కగా ఒకే సైజులో ఆర్టిస్టిక్‌గా కోసి ఉన్నాయి ముక్కలు. వాటిని చూడగానే నాకు బొమ్మ చేయాలని పించింది. ''గుమ్మడి పండండి బిడ్డ నివ్వమా'' అంటూ కడుపుతో ఉన్న వాళ్ళను దీవిస్తారు. అందుకే పసిమి రంగుతో చక్కగా కోసిన ముక్కల్ని బాలికగా అమర్చాను. మధ్యలో కొన్ని ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వాడాను. గుమ్మడికాయ తొక్కల్ని కూడా సన్నగా కత్తిరించి జుట్టుగా అమర్చాను. అలాగే చెవులకు పెట్టుకున్న జూకాలు, బొట్టు, పెదవులు అన్నీ గుమ్మడి తొక్కుతోనే అమర్చాను. ఆకుపచ్చని పళ్ళెంలో పసుపు పచ్చని అమ్మాయి కొలువుదీరింది. బాలికల విద్య కొరకై పల్లెల్లో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్ని ఏర్పాటు చేశారు. తల్లి అక్షరాస్యతకూ, పసిబిడ్డల మరణాల రేటుకూ అవినాభావ సంబంధముంది. తల్లి విద్యావంతురాలైతే బిడ్డను అరోగ్యంగా చూసుకోగలుగుతుంది. కాబట్టి బాలికా విద్య ఈ సమాజానికి ఎంతో అవసరం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్