Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైకల్యం వెంటాడుతున్నా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ సమాజ హితానికి ముందుకు వచ్చారు. తాము చేస్తున్న పని పర్యావరణహితంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఎటువంటి కెమికల్ లేని స్వచ్ఛమైన రాఖీలు తయారి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిర్వహిస్తున్నారు. కృషి.. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించడానికి వైకల్యం అడ్డుకాదని వీరు మరోసారి రుజువు చేశారు. ఈ వికలాంగులు వారి కృషితో మహామహిళలు అయ్యారు..
సాధారణంగా వైకల్యంతో ఇబ్బంది పడుతున్నవారు తమ పనులు తాము చేసుకోవడమే కష్టం. ప్రతి దానికీ వేరొకరిపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ తమ కాళ్ల మీద తాము నిలబడి పని చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కామారెడ్డికి చెందిన చింతల పోశవ్వ, ఆఫీసా బేగం కూడా ఉన్నారు.
గ్రూపుగా ఏర్పడి
ఇద్దరు వికలాంగ మహిళలు కలిసి పర్యావరణహితమైన రాఖీలు తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తెలంగాణాలోనే మొట్టమొదటిసారిగా వికలాంగ మహిళలు ఆవుపేడను ఉపయోగించి రాఖిలు తయారు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రలో మహిళా వికలాంగులు ఓ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిపై ఆధారపడకుండా స్వయం ఉపాది పొందాలని నిర్ణయించుకున్నారు. పోశవ్వ, ఆఫీసా నాయకత్వంలో దివ్య హస్త సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు.. ఈ సొసైటీ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిగా రాఖీలు తయారు చేయాలని నిర్ణయించారు.
అందరికంటే భిన్నంగా
రాఖీల తయారిపై అందరి లాగా కాకుండా కొంత వినూత్నంగా ఆలోచించారు. ఇలా ఆవుపేడతో రాఖీలను తయారు చేయడం ప్రారంభించారు. దీని ద్వారా బయోడిగ్రేడబుల్ యాంటీ, రేడియేషన్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతాయని వారు చెబుతున్నారు. ఇందుకోసం కెమికల్ కలర్స్ కాకుండా వాటర్ కలర్స్ ఉపయోగిస్తున్నామని అంటున్నారు. ఇలా తయారు చేసిన రాఖీలు మట్టిలో సులభంగా కలిసిపోతాయి.. పోలానికి ఎరువుగా కూడా ఉపయోగపడతాయని వారంటున్నారు.
ప్రభుత్వం సహాయం చేస్తే...
పర్యావరణానికి ఉపయోగపడే ఈ రాఖీలు ప్రతి ఒక్కరికి చేరాలని ఆలోచనతో ఈ రాఖీలను వికలాంగ మహిళలు తయారు చేస్తున్నారు. ఇలా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు వాటికి కావలసిన సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని సొసైటీ ప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వ సహాయం అందిస్తే మరింత ఎక్కువ మొత్తంలో రాఖీలు తయారు చేస్తామని చెబుతున్నారు. రాఖీలు కావలసినవారు కామారెడ్డి జిల్లా న్యూ కలెక్టర్ ఆఫీసుకు సమీపంలో ఉండే రాజీవ్ గృహకల్పలో సంప్రదించాల్సిందిగా వారు విన్న వించుకుంటున్నారు.