Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుజాత, రవి ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత అత్తా, కోడళ్ళకు మధ్య గొడవలు మొదలయ్యాయి. సుజాతకు వేరు కాపురం పెట్టాలని కోరిక. కానీ రవి దానికి ఒప్పుకోవడం లేదు. దాంతో భార్యా భర్తలకు అస్సలు పడడం లేదు. వేరు కాపురం పెడితే తప్ప రానని సుజాత తన మూడేండ్ల కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదవండి.
దూరపు బంధువల పెండ్లిలో రవిని మొదటి సారి చూసింది సుజాత. అతని మాట తీరు ఆమెకు బాగా నచ్చాయి. అప్పుడు సుజాత ఇంటర్ చదువుతుంది. ఫ్రెండ్స్ ద్వారా రవి నెంబర్ తెలుసుకుని అతనికి ఫోన్లు చేసేది. అతను కూడా సుజాతకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. రవి ధ్యాసలో పడి సుజాత చదువు సంగతి మర్చిపోయింది. దాంతో ఇంటర్ ఫేయిల్ అయింది. రవి చిన్న కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజులకు వీరి విషయం సుజాత ఇంట్లో తెలిసింది. పెండ్లంటూ చేసుకుంటే రవినే చేసుకుంటానని సుజాత కచ్చితంగా చెప్పింది. తల్లి ఎంత వద్దనా వినిపించుకోలేదు. ఇక చేసేది లేక పెండ్లి చేశారు.
పెండ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. సుజాతకు ఇంటి పనుల గురించి పెద్దగా అవగాహన లేదు. దాంతో అత్త సూటిపోటి మాటలు అనేది. ఇంటి చుట్టుపక్కల వారికి కూడా 'నా కోడలికి ఒక్క పని కూడా రాదు, వంట సరిగా చేయదు' అని చెబుతుండేది. వాళ్ళు సుజాతతో 'మీ అత్త నీ గురించి అందరికీ ఇలా చెబుతుంది ఏమిటీ' అని అడిగేవారు. దాంతో సుజాత 'మీ అమ్మ నా గురించి బయట వాళ్ళకు ఇలా చెబుతుంది' అంటూ రవి ఇంటికి వచ్చీ రాగానే చెప్పడం మొదలుపెట్టేది.
పగలంతా కష్టపడి వచ్చిన రవి, సుజాత మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మరీ గట్టిగా మాట్లాడితే ''అమ్మ పెద్దది కదా, చూసీ చూడనట్టు వదిలెరు' అనేవాడు. భర్త తల్లికి సపోర్ట్ చేయడం సుజాతకు నచ్చేది కాదు. దాంతో సుజాతకు అత్తపై రోజురోజుకు కోపం పెరిగిపోయేది. ఇంట్లో గొడవలు కూడా ఎక్కువయ్యాయి. ఈ గొడవల మధ్య రవి నలిగిపోయేవాడు. ఇటు తల్లికి, అటు భార్యకు ఇద్దరికీ సర్ధి చెప్పలేక సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుజాత నెల తప్పింది. డాక్టర్లు బెడ్ రెస్ట్ అని చెప్పారు. దాంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. పాప పుట్టే వరకు అక్కడే ఉండిపోయింది. పాపకు ఆరో నెలలో తిరిగి వచ్చింది. మళ్ళీ గొడవలు మొదలు. ఇక అప్పటి నుంచి భర్తతో ఎలాగైనా వేరు కాపురం పెట్టించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రవి మాత్రం ఒప్పుకోవడం లేదు.
సుజాత ఏదో ఒకటి అనడం, రవి ఆమెను కొట్టడం కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళడం, తిరిగి రావడం ఇలా రెండేండ్లు గడిచిపోయాయి. ఒకరోజు సుజాత, రవి ముందే అతని తల్లి నానా మాటలూ అంది. అది భరించలేని రవి, సుజాతను బయటకు గెంటేశాడు. ఇక వేరుకాపురం పెడితే తప్ప తిరిగి రానని చెప్పి వెళ్ళిపోయింది. సుజాత పుట్టింట్లో పరిస్థితి అతంత మాత్రమే. తండ్రి లేడు. తల్లి కష్టపడి పిల్లల్ని పెంచుతుంది. ఇంట్లో సుజాతనే పెద్దది. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకు పెండ్లి చేయాలి. పెద్ద కూతురు ఇలా పుట్టింట్లో ఉంటే ఎలా అని ఆమె దిగులు. ఇదంతా గమనించిన దూరపు బంధువలు సుజాతను ఐద్వా లీగల్‌సెల్‌కు తీసుకొచ్చింది.
లీగల్ సెల్ సభ్యులు మాట్లాడుతూ...''చూడు సుజాత నువ్వు అనవసరంగా సమస్య పెద్దది చేసుకుంటున్నావు. ఏ ఇంట్లో అయినా ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుని పుట్టింటికి వస్తే ఎలా. నీకు వేరు కాపురం పెట్టాలని ఉంది. వేరుగా ఉంటే హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. నీ ఆలోచన కరెక్టు కాదు. మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అక్కడ మీ అత్త ఒక్కటే ఉంటుంది. మీరు వేరుగా ఉంటే మీకోసం, మీ అత్త కోసం వేరు వేరు ఇండ్లు తీసుకోవాలి. రెండు అద్దెలు కట్టాలి. ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ రవి వల్ల కాదు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. మీ మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. పరిస్థితులను బట్టి సర్ధుకుపోవడం నేర్చుకోవాలి. మీ అత్త ఎవరితోనో అంటుంటే వాళ్ళు వచ్చి నీతో చెబుతున్నారు. కానీ బయట వాళ్ళు గొడవలు పెట్టడానికి ఒకటికి రెండు కల్పించి చెబుతారు. వాళ్ళ మాటలు నమ్మి నువ్వు మీ అత్తపై కోపం పెంచుకోవద్దు. దీని వల్లనే కాదా ప్రేమించి పెండ్లి చేసుకున్న రవికి, నీకు మధ్య గొడవలు. చిన్న వయసులో ప్రేమించి పెండ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లివి. కాస్త ఆలోచించి నడుచుకో. లేని పోని సమస్యలు తెచ్చుకోవద్దు'' అంటూ సుజాతకు నచ్చజెప్పారు.
సుజాత మాట్లాడుతూ... ''మీరు చెప్పింది కూడా నిజమే. కానీ ఆయన నాతో సరిగా మాట్లాడడు. వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే నావైపు కూడా చూడడు. వెళ్ళి అంత దూరం కూర్చుంటాడు. ఎప్పుడూ వాళ్ళ అమ్మకే సపోర్ట్ చేస్తాడు. నన్ను కొడతాడు. సరదాగా బయటకు వెళదామన్నా తీసుకెళ్ళడు. ఆయన అలా ఉంటే నేను అక్కడ ఉండలేను. ఆయన మారితేనే వెళతాను'' అంది.
లీగల్ సెల్ సభ్యులు రవిని పిలిపించి మాట్లాడితే... ''మేడమ్ నాకు వచ్చే ఆదాయం తక్కువ. అందులోనే అన్ని ఖర్చులు చూసుకోవాలి. సుజాత ప్రతి విషయానికీ గొడవలుపెట్టుకుంటుంది. అలుగుతుంది. ఎప్పుడూ వేరు కాపురం పెడదాం అంటుంది. వేరు కాపురం అంటే మాటలు కాదు. అది నావల్ల కాదు. ఇవన్నీ చెబితే సుజాత అర్థం చేసుకోదు. అందుకే నాకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కొడతాను, అలిగి పుట్టింటికి వెళుతుంది'' అని చెప్పుకొచ్చాడు.
''ఏది ఏమైనా మీరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. భార్య కోరే చిన్న చిన్న కోర్కెలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. పైగా మీ ఇద్దరి వయసు కూడా చిన్నదే. అప్పుడప్పుడు నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలని సుజాతకు ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నావు. కానీ సుఖంగా ఉండడం లేదు. వారంలో కనీసం ఒక్క పూట సుజాతకు కేటాయించు. అప్పుడు నీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ అమ్మ ఇంట్లో ఉండడం వల్లనే నువ్వు తనతో ప్రేమగా ఉండడం లేదనుకుంటుంది సుజాత. అందుకే వారిద్దరి మధ్య ఇన్ని గొడవలు. కాబట్టి ముందు సుజాతలో ఆ ఆలోచన రాకుండా చెయ్యి. భార్యకు కాస్త సమయం కేటాయించు. అప్పుడే నీ సమస్యలు పరిష్కారమవుతాయి. మేము సుజాతతో మాట్లాడాం. నువ్వు కాస్త ఆమెతో ప్రేమగా ఉంటే చాలు. సమస్యలనీన పరిష్కారమవుతాయి'' అన్నారు సభ్యులు.
ఇద్దరూ లీగల్‌సెల్ సభ్యులు చెప్పిన ప్రకారమే చేస్తామన్నారు. సుజాత పాపను తీసుకుని రవితో కలిసి అత్తారింటికి వెళ్ళింది. ప్రస్తుతం ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. రవి అప్పుడప్పుడు సుజాతను తీసుకొని బయటకు వెళుతున్నాడు. దాంతో అత్త ఏమన్నా సుజాత పెద్దగా పట్టించుకోవడం లేదు.
- సలీమ