Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం.. కెరీర్ పట్ల అవగాహన భవిష్యత్‌ను ఉన్నత మార్గంలో నడిపిస్తాయి. ఈ విషయంలో స్పష్టత కలిగిన యువతి సింగర్ జాహ్నవి. మ్యూజిక్‌ను తన కెరీర్‌గా మలుచుకునేందుకు చక్కటి ప్రణాళికతో అడుగులు వేస్తుంది. తేనెలూరే తన స్వరంలో ప్రేక్షకులను మైమరిపిస్తుంది. ఓ పక్క ఐటీ ఉద్యోగం చేస్తూ తన కలలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తున్న యువ గాయని పరిచయం నేటి మానవిలో...
అమ్మ సరోజ, హౌస్‌వైఫ్. నాన్న పత్తిపాటి రామారావు, ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తారు. నా స్కూలింగ్ మొత్తం వరంగల్‌లో నడిచింది. ఇంటర్ తర్వాత హైదరాబాద్ వచ్చేశాము. ఇక్కడే సెటిల్ అయ్యాము. సొంతూరు విజయవాడ. నాన్న ఉద్యోగరీత్యా వరంగల్ వచ్చేశాము. నాకు మూడేండ్లు ఉన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు ఇంట్లో సీరియల్స్‌కి సాంగ్స్ వస్తుంటే వాటిని వింటూ పాడుతూ ఉండేదాన్ని. నా గొంతు బాగుందని అమ్మవాళ్ళు మ్యూజిక్ క్లాసులో జాయిన్ చేశారు. వరంగ్ల్లో కామేశ్వరి గారి దగ్గర మొదటిసారి మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత లక్ష్మణాచారిగారు, స్వరసుధ మ్యూజిక్ అకాడమీ అని వరంగల్‌లో ఉంది. అది అక్కడ బాగా ఫేమస్. అందులో నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత రామచారిగారి దగ్గర లైట్ మ్యూజిక్, శ్రీనిధి గారి దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను.
మొదటిసారి టీవీలో
స్కూల్, కాలేజీలో చదువు కునేటప్పుడు ప్రతి ప్రోగ్రామ్‌లో పాల్గొనేదాన్ని. 2008లో మొదటి సారి టీవీ షోకి పరిచయం అయ్యాను. అప్పుడు ఈటీవీలో 'ఆటైనా పాటైనా' ప్రోగ్రామ్‌కు ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్ళాను. సెలక్ట్ అయ్యాను. ఆ ప్రోగ్రామ్‌లో విన్నర్‌గా వచ్చాను. నేను పాడటం అమ్మానాన్నకు ఇద్దరికీ ఇష్టం. దాంతో వాళ్ళు బాగా ప్రోత్సహించారు. తర్వాత జీ తెలుగులో అంత్యాక్షరి ప్రోగ్రామ్‌లో రన్నర్‌గా వచ్చాను. ఆ తర్వాత 'రేడియో సిటీ సూపర్ సింగర్స్ - సీజన్ 6' ప్రోగ్రామ్ 91.5 ఎఫ్.ఎమ్.వాళ్ళు నిర్వహించారు. అది రాష్ట్ర వ్యాప్తంగా పెడితే అందులో టాప్ 5లో నేనూ ఉన్నాను. తర్వాత 2018లో 'పాడుతా తీయగా' సీజన్ 16లో పాల్గొని రన్నర్‌గా నిలిచాను.
కొంత కాలం జాబ్ చేస్తా
మ్యూజిక్ ఏదో నేర్చుకొని వదిలేయాలనే ఆలోచన లేదు. దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఐటీ జాబ్ వచ్చింది. ప్రస్తుతం కరోనా వల్ల వర్క్ ఫ్రం హౌం చేస్తున్నాను. మరో పక్క మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను. జాబ్ ప్రస్తుతం అవసరం కాబట్టి చేస్తున్నాను. తర్వాత సింగర్‌గానే సెటిల్ కావాలని ప్లాన్ చేసు కుంటున్నాను. సింగర్‌గా సెటిల్ అయ్యే వరకు జాబ్ చేస్తాను.
చాలా నేర్చుకుంటున్నా
ఇప్పటి వరకు షాట్ ఫిలింమ్స్కి పాడాను. అనేక అల్బమ్స్‌లో కూడా పాడుతున్నాను. అలాగే కీరవాణిగారు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్స్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' సినిమాలకు రీరికార్డింగ్ సెక్షన్‌కు సార్‌తో కలిసి పని చేశాను. అలాగే 'మజిలీ' మూవీకి కూడా వర్క్ చేశాను. ఇప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవకాశాలు వచ్చాయి. వాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటున్నాను. ఇవన్నీ నా కెరీర్ పరంగా డెవలప్ కావడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బాలుగారి సలహాలతో...
'పాడుతా తీయగా'లో బాలు గారు మంచి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అవి నాకు బాగా ఉపయోగపడ్డాయి. అందులో ఫైనల్స్ వరకు ఉన్నాను కాబట్టి చాలా నేర్చుకున్నాను. అన్ని రకాల పాటలు పాడగలిగాను. అలాగే టీటీడీ వారు నిర్వహించిన 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' అనే దానికి వర్క్ చేశాను. అది రాఘవేంద్రరావుగారి పర్యవేక్షణలో జరిగింది. కీరవాణి గారు, సునీతగారు, బాలక్రిష్ణ ప్రసాద్‌గారు ఈ ప్రోగ్రామ్‌కు గెస్టులుగా వస్తుంటారు. కీరవాణి గారైతే ప్రతి ఎపిసోడ్‌కి వుంటారు. ఆ ప్రోగ్రామ్‌లో చాలా నేర్చుకున్నాను. అన్నమయ్య రచించిన సంకీర్తనలన్నీ మాతో పాడించి ఆల్బమ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ టీటీడీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది. అందులో పాడే అవకాశం రావడం చాలా గొప్ప విషయం.
సినిమాలకు పాడుతున్నా
2018లో బతుకమ్మ పాటను నేనే స్వయంగా రిలీజ్ చేశా. దాన్ని పది లక్షల మంది వరకు చూశారు. యూటూబ్ ఛానల్ ప్రారంభించి 2020లో అందులో నా పాటలను రిలీజ్ చేశాను. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. డీడీ సప్తగిరి ఛానల్లో 'ఆలాపన' ప్రోగ్రామ్‌లో చాలా పాటలు పాడాను. కొన్ని టీవీ సీరియల్స్‌కు కూడా పాడాను. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్‌కు వర్క్ చేస్తున్నాను. అలాగే మూడు సినిమాలకు పాడాను. అందులో ఒకటి రఘు కుంచె గారి సినిమా. మూడు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి.
ప్రస్తుతం ఇబ్బంది లేదు
ప్రస్తుతం వర్క్ ఫ్రం హౌం కావడంతో మ్యూజిక్ కూడా ఇంట్లోనే వుండి ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. దాంతో పెద్దగా ఇబ్బంది కలగడం లేదు. మ్యూజిక్ క్లాసులు వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉంటాయి. వర్క్ ఫ్రం హౌం మొదలైన కొత్తలో కాస్త కంగారుగా అనిపించేది. ఎందుకంటే ఐటీలో పని ఒత్తిడి చాలా ఎక్కువ. మెల్లగా అలవాటైపోయింది. మా చెల్లి అక్షయ తను కూడా పాడుతుంది. నాతో పాటు 'పాడుతా తీయగా' సీరిస్‌లో పాడి విన్నర్‌గా నిలిచింది.
- సలీమ