Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలా మందికి చిరుధాన్యాలు అంటే చిన్న చూపు. కానీ మన ఆరోగ్యానికి, శరీరానికి అవి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. తప్పనిసరిగా మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటాం. కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊడలు, అరికెలు. ఈ ఐదింటిలో అద్బుతమైన ఔషద గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని వీటితో పెంచుకోవచ్చు.
రాగుల్లో అధిక బరువు తగ్గటానికి ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మనకు ఆకలిని తగ్గిస్తుంది. కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే. చిరు ధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. చిరు ధాన్యాల్లో పొట్టు తీసినా కాస్త కొవ్వు ఉంటుంది. ఇది మంచి కొవ్వు.
చిరు ధాన్యాలు షుగర్ పేషంట్లకు ఓ బలం లాంటివి. బియ్యంతో పోలిస్తే ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. వీటితో చేసిన పదార్థాలను నములుతూ తినడానికి కాస్త ఎక్కువ సమయం పట్టడమే కాకుండా తీసుకునే ఆహార పరిమాణం సైతం తగ్గుతుంది. ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి తొందరగా ఆకలి వేయదు. ఇలా బరువు తగ్గటానికి తోడ్పడతాయి. రక్తంలో కొలెస్టాల్ శాతం అదుపులో ఉంటుంది. చిరుధాన్యాలు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గడానికి ఉపయోగపడతాయి. దీంతో కడుపులో ఇబ్బంది, అల్సర్ల వంటివి తలెత్తకుండా ఉంటాయి. మలబద్దకం కూడా దూరం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్న వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణ లోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చు. రాగులతో పొడి చేసిన పిండిని ఉదయం మజ్జిగతో గాని బెల్లంతోగాని తీసుకొంటే అద్భుతమైన పోషకాలు పొందవచ్చు. ఇంకా రాగులతో ఎన్నో అద్భుతమైన వంటలు చేయొచ్చు. దోసెలు, బిస్కెట్లు, తోపా, అప్పలు, ఇడ్లీలు ఇంకా చాలా రకాల పదార్థాలు చేయొచ్చు.