Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిహార్ రాజధాని పట్నాలో మగధ్ కళాశాల యాజమాన్యం గతంలో ఓ విచిత్రమైన ఆదేశం జారీ చేసింది. జీన్స్ ప్యాంటులు, పటియాలా సూట్స్, జీన్స్ కోటులు ధరించి క్యాంపస్‌లోకి అడుగుపెట్టవద్దని.. అలాగే మొబైల్ ఫోన్లు కూడా కాలేజీలోకి అనుమతించమని. అయితే తాము ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఎలాంటి దుస్తులు ధరించకూడదో కాలేజీ నిర్ణయించడమేమిటని విద్యార్థులు ప్రశ్నించడంతో కాస్త వెనక్కు తగ్గారు. ఇపుడు మరోసారి అదే బిహార్‌లోని సుందరవతి మహిళా కళాశాల నిబంధనలు చర్చనీయాంశమయ్యాయి. తమ కాలేజీలో చదివే విద్యార్థినులకు వినూత్న నిబంధనలు విధించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థినులు జడ వేసుకునే కాలేజీకి రావాలి. అంతేకాదు డ్రెస్ కోడ్ కూడా విధించింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వేరే డ్రెస్సులు ధరించి వస్తే వారిని కళాశాల ఆవరణలోని అనుమతించబోమని ప్రకటించింది.
సెల్ఫీలు కూడా బంద్: సుందరవతి మహిళా కళాశాల బిహార్‌లోని భాగల్పూర్లో మంచి పేరున్న కాలేజీ. ఈ కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ తదితర గ్రూపుల నుంచి దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా కాలేజీకి ఏ రకమైన డ్రెస్‌లో రావాలి అనే దానిపై కళాశాల ఓ కమిటీ ఏర్పాటుచేసింది. కమిటీ సూచించిన దుస్తులనే ధరించాలని కాలేజీ యాజమాన్యం విద్యార్థినులకు స్పష్టంచేసింది. అంతేకాదు ఇకపై తమ కళాశాలలో చదివే విద్యార్థినులు కాలేజీ ఆవరణలో సెల్ఫీలు కూడా దిగకూడదని నిబంధన విధించి కాలేజీ ప్రిన్సిపల్ రామన్ సిన్హా ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఈ కొత్త నిబంధనలపై చాలామంది విద్యార్థినులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. చదువులో తమ ప్రతిభ, వికాసం వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలి తప్ప ఈ విధమైన కఠిన నిబంధనలు పెట్టడమేంటని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.
రక్షణ కోసమే అయితే: కాలేజీలు యూనివర్సిటీల్లో అమ్మాయిలకు డ్రెస్ కోడ్ అమలు చేయడమన్నది వివక్ష చూపేదిగా ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ గతంలోనే జారీ చేసిన రెండు వెర్వేరు నోటిఫికేషన్లలో పేర్కొన్నాయి. డ్రెస్ కోడ్ అన్నది విద్యార్థుల స్వేచ్ఛను హరించేదిగా ఉండరాదని ఇవి సూచించాయి. అసభ్యంగా ఉండనంతవరకు వారు ఏ విధమైన డ్రెస్ అయినా ధరించాలన్నది ఈ సంస్థలు చెబుతున్నాయి. అయితే అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకే ఇలాంటి నిబంధనలు పెడుతున్నామని కాలేజీల యాజమాన్యాలు సమర్ధించుకుంటున్నాయి. అయితే జడలు వేసుకున్న అమ్మాయిలపై దాడులు జరగడంలేదా అని కొన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. నిజంగా అమ్మాయిల రక్షణ కోసమే ఆలోచించే వారైతే ఇలాంటి వివక్షా పూరిత నిబంధనలు కాకుండా... దాడులకు కారణమైన పురుషాధిపత్యాన్ని రూపుమాపే ప్రయత్నం చేయాలనీ, అప్పుడే అమ్మాయిలకు రక్షణ అని వారు అంటున్నారు.