Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలామందికి కెరీర్ పట్ల పూర్తి అవగాహన ఉండదు. ఏది తోస్తే అది చేస్తూ ఇబ్బందులకు గురవుతుంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలే తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని సూచనలు ఇస్తున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
మనసులో వచ్చే ఆలోచనలకు ముందుగా ప్రాధాన్యతనివ్వడం నేర్చుకోవాలి. ఫలానా రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందనే సందేహంతో కొట్టుమిట్టాడకూడదు. అనుకున్న రంగానికి సంబంధించిన వ్యక్తులను కలిసి కొత్త విషయాలను తెలుసుకోవాలి. దాని గురించి సమగ్ర వివరాలను సేకరించాలి. అప్పుడే ప్రారంభమవుతున్న రంగంలో ఎదుగుదల ఉండదని భావించకూడదు. పెనుమార్పునకు ఈ రంగమే కారణమవచ్చు. అందుకే ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా ఆలోచించండి.
కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు ముందుగానే వైఫల్యం గురించి ఆలోచించకూడదు. అపజయం కూడా విజయానికి మొదటిమెట్టు అని నిపుణుల అనుభవాలే చెబుతున్నాయి. అనుభవాలను పాఠాలుగా చేసుకుని ముందడుగు వేయగలిగే మానసిక బలాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
ఎంచుకున్న రంగానికి కావాల్సిన సామర్థ్యాలు మీకు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. లేదంటే వాటిని పెంచుకోవాలి. దానికి సంబంధించిన కోర్సులు చేస్తే మంచిది. ఆ రంగంలో అనుభవజ్ఞులను సంప్రదించి వారి అనుభవాలను అడిగి తెలుసుకోవాలి తప్ప, వారి అభిప్రాయాన్ని పూర్తిగా అనుసరించకూడదు. అవతలి వారికి అనుకూలంగా లేకపోయినా, మీ సామర్థ్యానికి మీరు అందులో అడుగుపెట్టి విజయం సాధించగలరేమో అనే దిశగా ఆలోచించాలి.
ఏ నిర్ణయం తీసుకున్నా మీ మనసుకు నచ్చినదై ఉండాలి. ఇష్టపడితేనే కష్టాలెదురైనా నిలబడగలుగుతారు. అంతేకాకుండా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. దానికి తగిన సృజనాత్మకతను పెంచుకోవాలి. ఎదురుపడిన చిన్న సమస్యను కూడా ఛాలెంజ్‌గా తీసుకోగలిగితే మీలో ఉత్సాహం కలిగి, ముందడుగు వేయగలుగుతారు. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా ఉండటానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే చాలు. కెరీర్లో సక్సెస్ పొందుతారు.