Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుహర్ గోయల్... బెంగుళూరుకు చెందిన 17 ఏండ్ల యువతి. మహిళల ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తున్న డిస్పోజబుల్ శానిటరీ న్యాప్కిన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంది. గ్రీన్ పీరియడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. దీని కోసం తాను చేసిన కృషిని ఈ ఏడాది డిసెంబర్లో న్యూయార్క్‌లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో 1ఎం1బి ఫౌండేషన్ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ ఫైనలిస్ట్‌గా ఎంపికై ప్రదర్శించబోతోంది.
గుహర్ గోయల్ గతంలో రుతుస్రావ సమయంలో డిస్పోజబుల్ శానిటరీ న్యాప్కిన్లు ఉపయోగించి దద్దుర్లతో ఇబ్బందిపడేది. ఆ బాధను భరించలేక 2017లో క్లాత్ ప్యాడ్‌కి మారింది. ఈ చిన్న మార్పు తన జీవనశైలిని పూర్తిగా మార్చివేసిందని ఆమె అంటున్నారు. అదే సంవత్సరం ఇన్వెస్టర్ చేంజ్‌మేకర్ ఛాలెంజ్ రూపంలో ఆమెకు ఓ అవకాశం వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మార్పు తీసుకురావడానికి హైస్కూల్ అమ్మాయిలకు వారు పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. రుతుస్రావ ఉత్పత్తులను తయారు చేయించడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని గుహార్ నిర్ణయించుకుంది.
అమ్మ సమకారంతో...
''నేను పోటీలో గెలవలేదు, సెమీఫైనల్స్ వరకు మాత్రం వెళ్ళగలిగాను. కానీ మొత్తం ప్రక్రియలో సమస్య లోతులను అర్థం చేసుకున్నాను. మా అమ్మ సహకారంతోనే నేను సెమీ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగాను'' అంటుంటి ఆమె. ఆ అనుభంతో ఆమె గ్రీన్ పీరియడ్ ప్రారంభించింది. మహిళలకు స్థిరపమైన రుతుస్రావ ఉత్పత్తుల గురించి, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, ప్లాస్టిక్ సానిటరీ ప్యాడ్స్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టింది.
తీవ్రమైన ప్రమాదం
డిస్పోజబుల్ శానిటరీ నాప్‌కిన్‌లలో బ్లీచింగ్, కృత్రిమ సువాసనలు జోడించడం, పురుగుమందులతో నిండిన పత్తిని వాడటం వల్ల వాటిలో వివిధ రసాయనాలు కలిసి ఉంటాయి. అలాంటి ప్యాడ్‌ను మన శరీరంలోని సున్నితమైన ప్రదేశంలో ఉపయోగిస్తాం. ఎన్నో అధ్యయనాలలో చూపినట్టుగా ఇటువంటి రసాయనాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. దాంతో ఇవి మన ఆరోగ్యానికి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలనే కాదు వీటి విపరీత వాడకం వల్ల పర్యావరణానికి కూడా తీవ్ర ప్రమాదం కలిగిస్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక (2018-19) ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 12.3 బిలియన్ శానిటరీ నాప్కిన్లు భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. ప్రతి ప్యాడ్‌లో 90 శాతం ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. మెనిస్ట్రల్ హెల్త్ అలయన్స్ ఇండియా అంచనా ప్రకారం ఒక శానిటరీ ప్యాడ్ కుళ్ళిపోవడానికి దాదాపు 500 నుండి 800 సంవత్సరాలు పడుతుంది.
గ్రీన్ పీరియడ్
వివిధ కార్యక్రమాలు, బహిరంగ సభలలో తన అనుభవం గురించి వివరిసర్తూ రుతుస్రావ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి చెప్తూ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని చేయలని ఉత్పత్తుల గురించి ప్రచారం చేస్తూ గుహర్ తన పనిని ప్రారంభించింది. ప్రజల ద్వారా నిధులు సమీకరిస్తూ తన 'గ్రీన్ పీరియడ్' కోసం రూ. లక్ష సమీకరించింది. కోవిడ్ -19 ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం 200 రుతుస్రావ కప్పులను కొనుగోలు చేయడానికి ఆ డబ్బు ఉపయోగించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కార్యక్రమంలో బెంగళూరులోని ఓరియన్ మాల్లో మున్సిపల్ స్వీపర్లు 80 మందికి రుతుస్రావ కప్పులను పంపిణీ చేసింది.
పేదరికాన్ని ఓడించాలి
తన కార్యక్రమాలు మొదలుపెట్టిన కొత్తలో రుతుస్రావం గురించి, అది ఎందుకు జరుగుతుందనే దాని వెనుక ఉన్న సైన్స్ గురించి మహిళల్లో అవగాహన లేకపోవడం గమనించిన గుహార్ ఆశ్చర్యపోయింది. పేదరికం వల్ల చాలా మంది ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. అందుకే పీరియడ్ పేదరికాన్ని ఓడించడంలో సహాయపడటమే ఇప్పుడు ఆమెకున్న పెద్ద లక్ష్యం.
ప్రాంతీయ భాషలో అవగాహన
''డిస్పోజబుల్ ప్యాడ్లు రేటు ఎక్కువ. పైగా ఒక్కసారి మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే గుడ్డ ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్పుల వంటి స్థిరమైన ఉత్పత్తులు ఒక్కసారి కొంటేచాలు. అవి చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు'' అంటున్నారు ఆమె. తన పాఠశాలలో ఓసారి గైనకాలజిస్ట్ చేత అవగాహన సెషన్ నిర్వహించడం, ప్రాంతీయ భాషలలో వివరించడం ఆమె గుర్తుచేసుకుంది. అలాగే వెనుకబడిన, మధ్యతరగతి జనాభాలో చాలా మంది గుడ్డను ఉపయోగించడం చూసి ఆమె మనసు చలించిపోయింది. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఉందని ఆమె జతచేస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడలేని బలహీనవర్గాల ప్రజలను అవగాహన కార్యక్రమాలు చేరుకోవడానికి భాష ఒక అడ్డంకి. బాగా డబ్బున్న వారు ఆమెను తరచుగా నిరుత్సాహపరిచే మాటలు అంటుండేవారు 'మా జీవన విధానాన్ని మార్చడానికి మీరు ఎవరు', 'మీరు చిన్న పిల్లలు, మీరు ఏం చెబుతున్నారో మాకు అర్థం కావడం లేదు' వంటి ప్రశ్నలు వేస్తుండేవారు.
1ఎం1బి సహకారంతో...
ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన లాభాపేక్షలేని సంస్థ 1ఎం1బి ఫౌండేషన్ (మిలియన్ ఫర్ 1 బిలియన్) సహ వ్యవస్థాపకులు మానవ్ సుబోధ్ గత ఏడాదిగా గుహార్కు గ్రీన్ పిరియడ్ గురించి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తను చేస్తున్న కార్యక్రమం 1ఎం1బి ప్రోగ్రామ్‌లో భాగంగా ఉండటం వల్ల మానవ్ సుబోధ్ దిశానిర్దేశం ఎంతో సహాయపడిందని గుహర్ అంటుంది. కరోనా మహమ్మారి సంస్థకు కష్ట సమయంగా మారినప్పటికీ 1ఎం1బి భవిష్యత్ కార్యకలాపాలను కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో కోవిడ్-19 లాక్డౌన్ సడలించిన తర్వాత మారుమూల ప్రాంతాలకు ఫీల్డ్ వర్క్‌లను ప్లాన్ చేయడానికి విద్యార్థులు అంకితభావంతో పని చేశారని మానవ్ చెప్పారు. డిసెంబర్ 2021లో గుహార్తో పాటుగా ఇంకా ఎంపికైన ఫైనలిస్టులతో కలిసి న్యూయార్క్‌లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో వారు చేసిన కృషిని ప్రదర్శిస్తారు.
వైద్య ఉత్పత్తులుగా గుర్తించాలి
గుహర్ను తన భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగినప్పుడు శానిటరీ ఉత్పత్తులను వైద్య ఉత్పత్తులుగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేయాలని, తద్వారా ప్యాకేజింగ్‌లోని పారదర్శకతతో వాణిజ్య తయారీదారులు తమ విషయాలను వెల్లడించాలని గుహార్ వెంటనే చెప్పింది. దీర్ఘకాలంలో ఆమె పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారు చేయడం, వాటి గురించే అధ్యయనం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రుతుస్రావ ఉత్పత్తులలో స్థిరమైన మార్పును తీసుకురావాలని భావిస్తోంది.
- సలీమ