Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శనగలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.ప్రోటీన్లు ఎంత గానో లభించే ఈ శనగలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ వెరైటీలు తిండానికి ఇష్ట పడతారు. ముఖ్యంగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందనిరీ ఈ శపగలే ఆరోగ్యప్రదాయిని అని చెప్పవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న శనగలతో చేసిన వంటకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
శనగలతో పాట్టోల్లి
కావాల్సిన పదార్ధాలు: శనగలు - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు, నూనె (కొంచం ఎక్కువే పడుతుంది), ఇంగువ (ఇవన్నీ రుచికి సరిపడా)
తయారు చేయు విధానం: శనగలు ముందుగా నాన బెట్టుకోవాలి, బాగా నానిన తర్వాత వాటిని మిక్సీలో కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి(మెత్తగా చేయకూడదు). ఉల్లిగడ్డ సన్నగా. పొడుగ్గా తరిగి పెట్టు కోవాలి. తర్వాత బాండీలో నూనె కొంచం ఎక్కువగా వేసి వేడెక్కక పోపుదినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. పోపు దినుసులు గోధుమ రంగులోకి వచ్చాక ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి వేయించాలి. అవి కొంచం వేగిన తర్వాత రుబ్బి వుంచుకున్న శనగల ముద్దను దాంట్లో వేసి సన్న సెగ మీద వేయించాలి. పచ్చి వాసన పోయి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి. బాగా వేగిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి మరి కొంత సేపు బాగా కలుపుతూ వేయించాలి. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.
శనగలు పాయసం
కావాల్సిన పదార్ధాలు: శనగలు కప్పు, బెల్లంతురుము - కప్పు, పాలు - మూడు కప్పులు, నెయ్యి - అరకప్పు, ఏలకులు, జీడిపప్పు, కిస్మిస్ తగినన్ని.
తయారు చేయు విధానం: శనగలు బాగా నాన బెట్టుకుని, బాగా కడిగి మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెలో నెయ్యి పోసి వేడెక్కక జీడిపప్పు, కిస్మిస్ వేయించి తీసిపక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో రుబ్బి పెట్టుకున్న శనగల ముద్దను వేసి సన్నటి సెగ మీద బాగా వేయించాలి. కొంచం రంగు మారగానే అందులో పాలు పోసి ఉడికించాలి. పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుండగా దాంట్లో పొడి చేసి పెట్టుకున్న బెల్లం వేసి స్టవ్ ఆపేసి, బాగా కలియబెట్టాలి. బాగా కలిసిన తర్వాత అందులో ఏలకులు పొడి, వేయించి పెట్టుకున్న జీడీ పప్పు, కిస్మిస్ వేసి కలపాలి. వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది.
(ఇష్టం ఉన్నవారు పంచదార కూడా వేసుకువచ్చు. బాగా జారుగా కావాలని అనుకున్నవారు పాలు ఎక్కువ పోసుకోవచ్చు. బెల్లం పిల్లలకు, షుగర్ ఉన్నవారికి మంచిదని నేను బెల్లం వేసి చేస్తాను. రుచి కూడా బావుంటుంది)
శనగలు వడలు
కావాల్సిన పదార్ధాలు: శనగలు రెండు కప్పులు, నూనె - తగినంత, ఉల్లిగడ్డలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4నాలుగు లవంగాలు.
తయారు చేయు విధానం: శనగలు నాన బెట్టుకుని, బాగా కడిగి కచ్చాపచ్చగా మిక్సీలో రుబ్బుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె కొంచం ఎక్కువగా పోసి అది వేడెక్కేలోగా ఈ రుబ్బుకున్న శనగలు ముద్దలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క దంచి కలుపుకోవాలి. నూనె బాగా వేడెక్కాక వడల్లా తట్టి నూనెలో వేసి సన్న మంట మీద వేయించాలి. ఇవి స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు. వీటిని టమాటో సాస్ లేదా కెచప్‌తో తింటే బావుంటాయి.
శనగలు కూర
కావాల్సిన పదార్ధాలు: శనగలు - అరకప్పు, టమాటో - ఒకటి (పెద్దది), ఉల్లిగడ్డలు - రెండు, ఆలూ - ఒకటి, పచ్చి మిర్చి - రెండు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, నూనె, పోపుదినుసులు, కొంచం చింతపండు గుజ్జు.
తయారు చేయు విధానం: శనగలు బాగా నాన బెట్టుకుని, శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. టమాటో, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఆలూ సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి. బాండీలో నూనె పోసి వేడెక్కాక పోపుదినుసులు వేసి అవి కొంచం రంగు మారక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేయించాలి. అవి కొంచం వేగాక ఆలూ ముక్కలు వేయాలి. అవి కొంచం మెత్త పడ్డాక టమాటో, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతూ ఉండాలి. ముక్కలన్ని బాగా మెత్తపడ్డాక ఉడికించి పెట్టుకున్న శనగలు వేయాలి. ఇవి అన్ని వేసి దాంట్లోనే కొంచం చింతపండు గుజ్జు వేసి ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా అన్ని కలిసేలా కలియబెట్టాలి. దించే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఇది చపాతి, రొట్టెలు, పుల్కాలు, పూరిల్లోకి తింటే చాలా బావుంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి